Saturday, January 31, 2009

ఏమని చెప్పను

వెదురు గుండెకు గాయం చేసి వేణువులా మోగ మనే
తిరిగి బ్రతికిన జ్ఞాపకానికి ఏమని చెప్పను

గుండె గుంటలో బండను తోసి అలల కోసం
కలల కొమ్మపై కాపేసిన కాలానికి ఏమని చెప్పను

గుండె మంటలొ గతాన్ని పోసి రగిలే సెగలో చలికాచుకునే
విగత క్షణాలకు ఏమని చెప్పను

విధి గీసిన చీకటి దారుల్లో వేదన మంటలే ఆశ్రయమిస్తే
అవీ ఆర్పిన కంటి జల్లులకేమని చెప్పను

Friday, January 30, 2009

కన్నీళ్ళు

కలగంటున్న యెదగల హితుడవు
వలదంటున్నా కదలని తపనవు
వ్యర్ధం అన్నా వదలని గోడువి
అభ్యర్ధనకూ కరగని వాడివి

హృదయం ఉన్నా పంచగ లేనని
పరిమితులేవో నాకూ గలవని
చెప్పిన మాటలు పెడచెవి పెడితివి
ఇచ్చిన అలుసును తప్పుగ చూస్తివి

ఇప్పుడు చూడు ఏమయ్యిందో
కురులే ఉరిగా బిగిసిన కంఠం
బంగరు బహుమతె నీ బలి పీఠం
నా చెక్కిలి నేర్పెను నాకో పాఠం

ప్రేమే నాపై నిజముగ ఉంటే
చేసిన వినతులు నువ్వే వింటే
ప్రాణం నీకు మిగిలుండేది
బ్రతుకున హితుడుగ ఉండేవాడివి

నా కన్నీళ్ళు నిను తేలేవు
అదితెలిసినా ఈనీళ్ళు

http://pruthviart.blogspot.com/2009/01/blog-post_29.html కు నా స్పందన.

Thursday, January 29, 2009

ప్రేమ

చెలియ చింతన చెక్కిళ్ళు కడిగె
మనిషి చింతన కన్నీళ్ళ మునిగె
మనసున మొలిచెను పచ్చని ఆశలు
గతమును విడమనె వెచ్చని బింబము

విధి పరిచిన వల ఈ గతము
గడచిన ఘడియలు వేసిన ముడులవి

రమ్మని పిలిచెడి ప్రేమొక ఎర
పదునగు కత్తిని దాచిన ఒర

అందని ప్రేమకు బ్రతుకుని చంపకు
అందిన ప్రేమను బ్రతుకని చెప్పకు
బ్రతుకున ప్రేమొక భాగము ఎరుగుము
గతమొక బాధల బ్రమయని తెగడుము

చెమరిన కన్నులు తుడిచే సమయం
బ్రతుకును ముందుకు నడిపే తరుణం
గగనపుటంచులు తాకే సమయం
అదిగో చూపెను కనబడు ఉదయం
http://pruthviart.blogspot.com/2009/01/blog-post_28.html కు నేను రాసిన స్పందన

Tuesday, January 27, 2009

చినుకులు

తెరెపిచ్చిన ముసురు
=============


నింగి నల్ల జుట్టు విరబోసుకుని
సూరీడ్ని తనవెనక దాచేసుకుని
వెండి కొరడాలు ఝుళిపిస్తూ గర్జిస్తోంది

దాని శ్వాస గంధాలు మత్తెక్కిస్తున్నా
మింగ వచ్చిన చీకటి నోళ్ళకి భయపడి
నా నీడా నాలోకి దూరిపోయింది.
ముసురు గంప కింద మా ఊరూ దాక్కుంది

ముసుగులో సూరీడు గోలచేసినట్టున్నాడు
నోట్లోపడ్డ పీచు మిఠాయిలా మబ్బులు కరిగి
వెండి కొరాడాలని భుజాన వేసుకుని వెళుతూ
కొండమీద పడ్డ ఆ కాస్త నలుపూ తీసుకెళుతున్నాయి

తను దూరమయినందుకు పరిహార మేమో, సూరీడు
బంగారు తళుకుల్ని చెట్టు కొమ్మల మీద అద్ది,
గడ్డి పోచల మీద ముత్యాలు పోసి,
వెచ్చ కౌగిలిచ్చి ఊరడించాడు, దాక్కున్న మానీడ తిరిగి

చీకటి
====

నింగి నిండిన చీకటి, చుక్క రంధ్రాల్లోనించి
ఆరు బయట ఆక్రమించి, తనువు పెంచి
కొత్త తావులెతుక్కుంటూ నిశ్శబ్దంగా
తలుపు సందుల నుంచి నట్టింట్లోకి దూరొచ్చి
దీపం చూడని మూలల్లో నక్కి కూర్చుంది
కొంత కొవ్వొత్తి కింద చేరి దోబూచు లాడుతుంది
గురువింద మచ్చలాగా మనిషికొచ్చే చావులాగ

ఆశ కొవ్వొతి చుట్టూ బాధ చీకటి పలచబడుతుంది
బ్రతుకు నింగి ఉదయం కోసం ఎదురు చూస్తుంది
బయట ప్రపంచం ఆదమరచే ఉంది
కొవ్వొత్తి ఒక్కటే కాపలా కాస్తుంది


కల
===

చెలి గాలి సోకింది- చెంప చేను పరవసించి ఎర్ర పూలు పూసింది
ఆమె తలపు తగిలింది - మాట తోట మురిసిపోయి మల్లె పూలు విసిరింది
ఆమె శ్వాస తడిమింది - సెగలు తగిలి రేయి లేచి గజ్జె కట్టి ఆడింది
ఆమె చూపు గుచ్చింది - కవిత ముసుగులోకి దూరి గుండె అంగలార్చింది
ఆమె చేయి తగిలింది - ప్రాణమొచ్చి జ్ఞాపకాలు అల్లిబిల్లి తిరిగాయి
ఆమె తట్టి లేపింది - నిద్ర చెదిరి బద్ధకంగ మనసు మూగబోయిందిMonday, January 26, 2009

ఉదయం

తూర్పు కొండల మీదనించి కాంతి తీగల గాలమేసి
నిద్ర లేచిన పగలు, రాత్రి దుప్పటి లాగుతుంటే
ఒళ్ళుమండిన సూరీడు బద్ధకంగా నిద్ర లేచి
తన కోపము నింగి నిండా పరిచినట్టున్నాడు
భయపడ్డ పొద్దుతిరుగుడు చేలు నిక్కబొడుచుకున్నాయి
గువ్వ పిట్టలు గూళ్ళనొదిలి తుర్రు మన్నాయి
అది చూసి తోటలో పూలన్ని గొల్లు మన్నాయి

ఉదయం

Sunday, January 25, 2009

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు
వెన్న ముద్ద లెన్నో పూసె చెట్టు కొమ్మ లన్ని చూడు

వెన్నె లంత గుట్ట పోసి మిన్న కుండె నింగి రేడు
చల్ల దూది పింజ తోటి ఆట లాడె పిల్ల గాడు
అమ్మ చేతి చల్ది ముద్ద లోక మంత పెద్ద దయ్యె
నోట బెట్టి మింగ బోవ మాయ మయ్యె నేమి చెప్ప .. !! మబ్బు దిండు

వాడి బుగ్గ పూలు పూసె చేతి వేళ్ళు వంగి పోయె
ముక్కు ధార కారు డాయె నోటి పొగల ఆట లాయె
మంచు బంతి చేసి వాడు ఇళ్ళ పైకి రువ్వు డాయె
పిల్ల గుంపు లన్ని జేరి మంచు బొమ్మ చెక్కు డాయె .. !! మబ్బు దిండు

నేల బడ్డ వెన్నె లంత కాస్త కాస్త మాయ మైతె
చంటి గాడి కళ్ళ లోన పొర్లు కొచ్చె బాధ వాన
కారు ముక్కు పీల్చు కుంటు బుంగ మూతి పెట్టు కుంటు
ఎర్ర బుగ్గ మీద కారు వాడి గోడు చూస్తు ఉంటే ..

సంధ్య పొద్దు తోట లోన ఎర్ర మొగ్గ చెంప మీద
ముత్య మోటి వచ్చి నిల్చి ముద్దు పెట్ట మన్నట్టుండె ..!! మబ్బు దిండు

Saturday, January 24, 2009

అపరిచితులు

ఒకే దారిన పోతున్నాం
బ్రతుకు మూట భుజానేసుకుని
ఆశ వెలుగులో దార్లు వెతుకుతూ
అడియాశ మలుపులు వెనక వదులుతూ
తిరిగిన దారులు గుర్తు చేసుకుంటూ

ఒకే కాలాన్ని గడుపుతున్నాం
మన గతపు గంపల గాధలు పంచుకుంటూ
కొత్త కధలను అల్లుకుంటూ
తడబడు నడకలు సవిరించికుంటూ
ఒకరికి ఒకరు ఆధార మవుతూ

ఈ బంధానికి పేర్లు వెదికి
ఓడిన వారెందరో,
అలిసి ఆగిన వారెందరో
పేరు పెట్టి విరిగిన వారెందరో
పిలిచి దాని విరవటమెందుకు ?

మన బంధానికి పేరులొద్దు
ఒకరికి ఒకరు తోడుగా
ఎవరి గమ్యం వారు చేరుకుందామా ?
ఇలా కలిసి తిరిగిన అపరిచితులుగానే సాగి పోదామా ?
చివరికి మన గతాల్లోనే మిగిలి పోదామా ?
సమసి పోదామా ?


Friday, January 23, 2009

అష్టసఖులు

విడివడి మనమొక యుగమయె
భయమయమయె నాదు మనము
నిలకడ వదిలే, గడవక సమయమిపుడు
వడివడిగా నిన్ను జేర వచ్చితి చెలియా .. కలహాంతరికా

చేసిన తప్పును ఒప్పితి నప్పుడే
నిను నొప్పించిన బాధ నాకూ
నొప్పే సఖియా.. ఒప్పును చేయగ
నిప్పుడు ఒప్పించగ వచ్చినాను, చెప్పవె సుఖమా .....ఖండితా

ఎపుడొ వీడితి నిత్తరి, పరి విధముల
వగచె మనము సొగసరీ
పెరిగి పరితాపము గిరివలె
దరిజేరితి కరుణచూపు గడసరీ ... ప్రొషితపథిక

రాజును నేనని నేనన నా మనమున
నెన్నడు నిండిన నా రాణివి నీవని నేనన
నిజమే భామా !! మన మధ్యన వీణలు
మీటగ మరలితి నీ దరికి నేడు పదవే రాణీ ... స్వాధీనపథిక

తడబడు అధరపు తమకములద్దగ
అదిరెడి ఎడదకు స్థిరతను కూర్చగ
వేచిన కన్నుల తృప్తిని నింపగ
తమకము నిండిన తనువుతొ వచ్చితి లలనా ... వాసవసజ్జిక

విరహలతా పరిష్వంగనాలంకృత శిల్పవు
వాంచాశ్వాసావృత సంపూరిత శంఖవు
విరహాగ్నిజ్వలిత కామధూపావృత దీపవు
విరహోత్ఖంఠితవు మదాగమన కాక్షితవే బాలా..

వేళాయెను అదినిజమే నువుతాళలేవు అదియును నిజమే
కళగల కాంతవు కళ్ళకు నీలాలు ఏల తగదే భామా
విరహాన నేను మునిగి వడివడి వేళకు వస్తే,
ఆనాడు నే రాలేదని ఈనాడీ శిక్షలోద్దు విడవవె ఇంతీ ..... విప్రలబ్ధ

అదుపన్నది నీకు లేదు అలసట అది అసలులేదు
ఆరుబయట వేచి ఉండి ఆత్రంగా చూస్తావు
నీకేమో నేనే ప్రియుడు వేలల్లో నాకు ప్రియులు
నీ ఇచ్చము వచ్చి నపుడు రమ్మంటే తగున చెలియా ? ... అభిసారిక


viDivaDi manamoka yugamaye
bhayamayamaye naadu manamu
nilakaDa vadilE, gaDavaka samayamipuDu
vaDivaDigaa ninnu jEra vacciti celiyaa .. kalahaantarikaa

cEsina tappunu oppiti nappuDE
ninu noppincina baadha naakuu
noppE sakhiyaa.. oppunu cEyaga
nippuDu oppincaga vaccinaanu, ceppave sukhamaa .....khanDitaa

epuDo viiDiti nittari, pari vidhamula
vagace manamu O sogasarii
perigi paritaapamu girivale
darijEriti karuNacuupu O gaDasarii ... proshitapathika

raajunu nEnani nEnana naa manamuna
nennaDu ninDina naa raaNivi niivani nEnana
nijamE bhaamaa !! mana madhyana viiNalu
miiTaga maraliti nii dariki nEDu padavE raaNii ... swaadhiinapathika

taDabaDu adharapu tamakamuladdaga
adireDi eDadaku sthiratanu kuurcaga
vEcina kannula tRptini nimpaga
tamakamu ninDina tanuvuto vacciti lalanaa ... vaasavasajjika

virahalataa parishvanganaalankRta Silpavu
vaanchaaSvaasaavRta sampuurita Sankhavu
virahaagnijwalita kaamadhuupaavRta deepavu
virahOtkhanThitavu madaagamana kaakshitavE baalaa..

vELaayenu adinijamE nuvutaaLalEvu adiyunu nijamE
kaLagala kaantavu aa kaLLaku niilaalu Ela tagadE bhaamaa
virahaana nEnu munigi vaDivaDi vELaku vastE,
aanaaDu nE raalEdani iinaaDii SikshalOddu viDavave intii ..... vipralabdha

adupannadi niiku lEdu alasaTa adi asalulEdu
aarubayaTa vEci unDi aatramgaa cuustaavu
niikEmO nEnE priyuDu vElallO naaku priyulu
nii iccamu vacci napuDu rammanTE taguna celiyaa ? ... abhisaarika

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని
పల్లె అంత సందడాయె చూడు దాని అందాన్ని

పురినిప్పి నెమలి నడిచె కురులిప్పి చెట్టులూగె
చుక్క పట్ట నోరుతెరిచి పిల్లలేమొ బయటకురికె
ఇంట బిడ్డ గుర్తు రాగ పరుగునొచ్చె పాల పిట్ట
నల్ల మబ్బు నింగిలోన సందడంత చూడవచ్చె !! చల్ల గాలి

విరగ బూసినప్పడాలు కోయు భామలక్కడ
సేదదీరు ఊరగాయ ఖైదుచేసిరిక్కడ
పంచెగుట్ట పొదివిపట్టి పిల్లగాని పరుగులు
గాదె మూతదొరకపోతె తాత చేయు చిందులు !! చల్ల గాలి

చినుకు లేమొ పందెమేసి ఒకటి ఒకటి నేల రాలె
చెంగు నెత్తి నెట్టుకుని పల్లె పడతి నాట్యమాడె
బసవ బండి దాన్నిచూసి తాళమేసె జోరులోన
ఆశపూసి రైతు నేడు మునిగిపోయె పాటలోన !! చల్ల గాలి

మడుగులోన గంతులేసి పిల్లగాళ్ళ ఆటలు
చూరు నుంచి నేల జారు వాననీటి నాట్యము
వెదురుపొదలు మొదలుపెట్టి ఈలనోటి పాటలు
నాట్లు వేయ రండి అంటు పోలిగాడి కేకలు !! చల్ల గాలి

తోకముడిచి వణికిపోతు చూరుకింద కుక్కలు
చెరువులోని బాతులెట్టె చెట్టుకింద గుంపులు
వంట ఇంట్లో పొయ్యి పక్క చేరిమూల్గె పిల్లి కూన
తనకేమీ పట్టనట్టు గానుగలోన తిరుగు ఎద్దు !! చల్ల గాలి

కప్పు పైకి పాకి పోయి రెల్లు గడ్డి కప్పేటోళ్ళు
నట్టింట్లో బిందెలోకి నీళ్ళు పట్టి పోసెటోళ్ళు
పార పట్టి తోటలోకి నీళ్ళ దారి పెట్టేటోళ్ళు
చుట్టగట్టి రచ్చబండ పిచ్చపాటి జెప్పేటోళ్ళు !!

చల్ల గాలి వెక్కిరించె హైటెక్కు జీవితాల్ని
అవ్వినేడు మరిచిపోయె పల్లె బ్రతుకు పరువాల్ని

పట్టణాల వీధి లోన నల్ల మట్టి తావి ఏది
కాంక్రీటు కొంపలోన రెల్లు గడ్డి వాసనేది
టీవి ముందు సోఫాలో రచ్చబండ చర్చలేవి
స్టీలుపొయ్యి మంటల్లో గాదె తిండి బలాలేవి !! చల్ల గాలి

Thursday, January 22, 2009

వేచి చూద్దాం - ఓబామా

తుస్సు మన్న బుస్సు బాంబు
పచ్చడైన పచ్చ నోటు
బీటలడ్డ కోట గోడ
భగ్గు మన్న ఆశ గడ్డ

ఓటు పోటు ఓడ పైన
మార్పు మాట లంగరేసి
తెల్ల కోట బుర్జు పైన
నల్ల రాజు ఎక్కె నేడు

నల్ల రాజో తెల్ల రాజో
రాజు కేమి లోటు రాదు
వారి ఆట లోన మంట
పేద జనం డొక్క కేగ

మార్పు మాయ నిజం ఐతే
అంత కన్న భాగ్య మేమి
కొంత కాలం వేచి చూస్తే
దాని భోగం వ్యక్త మౌలే

జారు కాలం చెప్ప బోదా
కొండ దూరం తగ్గ బోదా
ఉన్న సున్నం రాలు తుందో
లంకె బిందై పొర్లు తుందో

Wednesday, January 21, 2009

జ్ఞాపకం

నా గారాల పట్టి ఈరోజు ఎందుకో
గతంలో నుండి దోబూచు లాడుతుంది
కలల బంధనాలు తెంచుకుని
కవ్విస్తూ వాస్తవంలో తిరుగాడుతుంది
పట్టి బంధించలేని నిస్సహాయత
తన వెనకనే తిరుగుతూ వెక్కిరిస్తుంది

తను అందంగా ఆనందంగా తిరిగుతూ నవ్వించినా కవ్వించినా
అది నిజం కాదన్న నిజం ఆశ దీపాన్ని ఆర్పేందుకు చూసే చిరుగాలిలా
చెంపలని తడుతుంది చెమ్మ ముసుగు తనని తిరిగి దాచేస్తుంది

రంగుల అబద్ధాల గదుల్లో నేను కొట్టిన కేరింతలు
నిజం తెరలు తగిలి కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి,
గుండె గోడల్లో లయలుగా ఇరుక్కుపోతున్నాయి

ఎందుకో ఈరోజు నా చిన్నారి గతం తలుపులు తీసి
మనసు ముంగిట్లో కేరింతలు కొడుతుంది
జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది
కళ్ళల్లో కలల్ని ఒలక బోస్తుంది

తిరిగి తెరలవెనక ఆమె మాయమవుతుంది
అబద్దంగానైనా ఆశ ఆనందంగా ఆవులిస్తుంది
ఆదమరుస్తుంది

Tuesday, January 20, 2009

వందన మమ్మా భారత మాతా నువు నందన వనమా అది ఎప్పటి మాటా ?

వందన మమ్మా భారత మాతా
నువ్వు నందన వనమా అది ఎప్పటి మాటా

కన్నుల ధారలు ఎండిన సుజలా
రొమ్ములు దన్నిన బిడ్డల సుఫలా
కకృతి శ్వాసల కలుషిత శీతలా
మతమత్తులు జల్లిన రుధిర శ్యామలా !! .. వందనమమ్మా..

కక్షలు చీల్చిన గుండెల జ్యోత్స్నా
చెదిరిన కలలతొ కంపిత యామినీ
పగిలిన పెదవుల వికృత హాసినీ
కలుషిత నేతల ఎంగిలి భాషినీ !! .. వందనమమ్మా..

ఎరువులు మింగి చచ్చే రైతులు. శ్యామల నువ్వని ఎప్పుడు పిలవను ?
బూతులు నిండిన నేతల కోతలు. సుమధుర భాషిణి ఏమైపోయెను ?
రక్తపు రంగులు పులిమిన వార్తలు. శుఖదవు నువ్వనిఎక్కడ చెప్పను ?
కుత్తుక కోతలె జీవన భృతిగ సోలే యువతను ముంగిట చూస్తూ
వరదవు నువ్వని ఎట్లా అరవను !! .. వందనమమ్మా


అయ్యో !

తోటి తమ్ములే నోటుల కోసం దేశాన్నమ్మిన గాధలు చూసి
నిండిన కళ్ళతొ ఆక్రోశంలో గుండెలు మండి రాశానమ్మా

అన్నం పెట్టిన అమృత మూర్తివి ఆకృతినిచ్చిన అక్షయ ధాత్రివి
రోదన వశమున బాధ్యత వీడి ఎంతటి మాటలు అన్నా నమ్మా !!

ముష్కర హస్తాల్లోనూ చచ్చి దొరలకు దాశ్యం చేస్తూ వచ్చి
శృంఖల చేదన చేసిన జాతే నిలువున కాల్చుకు తిన్టూ ఉంటే

కృశించిపోతూ విషాన్ని మింగుతూ పరుషాలాడని మహా తల్లిని
నీ ఎదురు తిరిగని నైజం చూసి క్షమించేసే తత్వం చూసి
రోషం పెంచి మంచిని తెచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ
దులుపుకు పోయే తరుణం కాక తెల్లని రక్తం నాలో లేక
గుండెను పిండే మాటలు దొర్లెను కావుము తల్లీ కరుణతో నన్ను

దేశము అంటే ఎవరో కాదని రాశిగ పోసిన మనిషుల విలువని
దేశము అంటే మట్టి కాదని జనతను తెలివికి తెచ్చిన నాడు
రోషము పెరిగి దోషం కడిగి కాషాయాన్ని పక్కన వదిలి
కక్షలనొదిలి చేతులు కలిపి ప్రగతి పధానికి పునాదులేసి
తరతమ బేధం మచ్చుకి లేక పురోగమిస్తూ కదం తోక్కుదురు

అది సుజలగ సుఫలగ నిను చూసే తరుణము
అది సుఖదగ వరదగ నిను చేసే సమయం
వందన మమ్మా భారత మాతా నువు నందన వనముగ మారే దప్పుడు !!

Monday, January 19, 2009

ఎవరు వీళ్ళు చెప్పగలరా ?

నేలజేరి ముద్దునివ్వ క్రిందకొంగి
కాలుజారి జల్లులాగ కిందపడ్డ వాడు ఇపుడు
నల్ల రంగు చెంగులోకి దూరి గమ్మునున్నాడు

కొంత తడవులోనే తనని వీడిపోవు రేడుచూసి
విర్హబాధ రగిలిపోగ పొగలు గక్కి కరిగిపోతు
నల్ల కోక క్రిందనున్న రంగులన్ని తిరిగి ఇచ్సునామే

అతని గాలి తగల గానె పరవశించిపోయి
ఇలన ఉన్న రంగులన్ని ఒంటికద్దుకుని
గుండెనిండ ప్రేమ నింపి గుప్పు మంది లోకమంత

Sunday, January 18, 2009

కొండ చెట్టు కొమ్మ మీద

కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది

ఘల్లు మన్న గజ్జెలాగ బోసి పాప నవ్వులాగ
రెల్లు గూటి పడవలాగ అలల మీద ఊగి సాగి
గంతులేసి గుండె అలసి వీడి పోకు ఆగమంది !! కొండ..

తావి గాలి తనువు తాకి డొలికల్లో నన్ను ముంచి
కాంతి కన్ను మూయగానే వీడి పోవు నీడలాగ
నాకు ఏమి కానట్టు జారిపోయె ఈడులాగ !! కొండ..

కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది

Saturday, January 17, 2009

నువ్వంటే భయం

నువ్వంటే భయం
నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తావనో
నీ అస్థిత్వ రూపం అగుపడదనో
అసలున్నావో లేవనో. ఒకటే భయం
ఐనా నీకోసమే శోధన నిను కానని వేదన

నువ్వంటే భయం
నీ వికృత రూపం చూడలేమనో
నీ నీడల కరాళ నృత్యం చూసో
అసలేరూపం నీకు లేదనో. ఒకటే భయం
ఐనా నీకోసమే పోరాటం, తీరని ఆరాటం

నువ్వంటే భయం
అంది ఆత్మ సాక్షితో నిలవలేననో
తెలిసి నన్నే ద్వేషిస్తామనో
పొందక బంధం తెంపలేమనో, ఒకటే భయం
ఐనా నీకోసమే ఈ చూపులు, పడి గాపులు

నిజం నువ్వంటే భయం
అవును నిజం నువ్వంటే భయం .

Friday, January 16, 2009

కుండ

మడిలో మట్టి మలిచేందుకు సిద్ధమవుతుంది
కుమ్మరి చక్రం తిరుగుతుంది జన్మ దాని వరమవుతుంది
ముద్ద మారి కుండవుతుంది

కొలిమిలో మండుతూ కొన్ని మరలి మడి చేరుతూ మరికొన్ని
తడి ఆరేవి కొన్ని విరిగి మిగిలేవి ఇంకొన్ని
నిండి అందాన్నిచ్చేవి కొన్ని, నిండుకుని వెక్కిరించేవి కొన్ని
కాశీలో కాలం చేసేవి కొన్నైతే కల్లు పాకలో తూలి తొణికేవి మరికొన్ని
కుంభాలై స్వాగతించేవి కొన్ని దిష్టిబొమ్మగా బెదరగొట్టేవి కొన్ని
కలశమై శుభాలిచ్చేవి కొన్ని కాటిదాకా వచ్చి కన్ను మూసేవి కొన్ని

తనను చేసిన చేయీ ఒకటే ఆటను వాడిన మట్టీ ఒకటే
తనును మింగిన దాహమే, తాను లొంగిన భావమే
దాని బ్రతుకుకు బావుటా !!

Thursday, January 15, 2009

తనివి

తనివి తీరు సఖియా
నీ మనసు నిండు చెలియా
గత జన్మ బంధమీ అనురాగం
విడిపోని గంధమీ అభిమానం

ఉన్నది ఎడారి ఐనా గానీ
నీతో ఉంటే వసంత మేగా
నింగిన మబ్బులు నిండిన గానీ
నిండగు పున్నమి ముంగిలి లేదా ! తనివి..

వెచ్చని కౌగిలి కరిగిపోయినా
తరగని కాలము మనదరి లేదా
తీయని హృదయపు తేనెలుడిగినా
మధువులు ఊరే అధరము లేదా ! తనివి..

శృతి రాసిన "తనివి తీరలేదే" http://manaanubhoothulu.blogspot.com/2009/01/blog-post_15.html
కు నా స్పందన

మళ్ళీ వస్తా

నా తలపుల చేష్టలు తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం ఎరగనప్పుడు
నా నిఘంటువులెందుకు ? నీ జీవిత బాస లెందుకు ?

తెలిసిన భాషలొ వచ్చిన భావం చెప్పాననుకున్నా
నువు నా మాటలవెనకన అర్ధం తవ్వి
గుండెని తడిమానని గంతులు వేస్తావనుకున్నా
అందుకు మురిశా.. కానీ మరువం,

వ్యక్తం చేసే తీరు నచ్చక విరక్తి తోనువ్వు విరుగుతావంటే
ఎప్పటిలానే భావం గొంతును నొక్కేవాడిని
ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడిని.
నాకది కొత్తేం కాదు

ఎప్పుడుతెలుసుకుంటావు అని అడిగావుగా ?
నన్నంత అర్ధం చేసుకున్నావన్న మాట
అదితెలెసేగా, వచ్చిన భావాల్ని నిఘంటువులెతికి మరీ
ధైర్యం కూడగట్టుకుని చెప్పచూసింది

నా మూగ రోదనలకిక సమయం లేదని
కరిగే కాలం చేతికి రాదని తెలిసేగా మరువం
మనసు విప్పినది. ఎప్పటి లాగే గుండె గాయపడినది
మిన్నిరిగిపడి మూలుగుతున్నది

మరో ప్రయత్నం చేసే లోపల ఇదిగో మరువం నీకో సలహా
గుండెలో ప్రేమే మెండుగ ఉంటే మూగ చూపులే కావ్యం చెప్పును
ఇప్పటికైనా చెప్పేదాంట్లో తప్పులు చూడకు. ఐనా నీకోసం,
నా బాష మార్చుకుని మళ్ళీ చెప్తా. మళ్ళి మళ్ళి వస్తా.


ఉష గారు http://maruvam.blogspot.com/2009/01/blog-post_15.html రాసిన కవితకు నా స్పందన.

Wednesday, January 14, 2009

ఎదురు చూపు - చివరి భాగం

మెరిసిన మెరుపుల వెలుగున కనబడు
మసకల వెనకన కదులుతు నడచెడి
ఎవరి రూపమో పోలిక కనుగొన
ఆరు కన్నులూ ఆబగ వెదికెను

దాపుల కొచ్చిన రూపును చూసి నాన్నది కాదని కన్నులు దించి
నిస్పృహ చెంది ఉస్సురు మంటు అమ్మ కొంగుకు వేళ్ళాడారు

వచ్చిన వారిని విషయము అడగగ తలుపుల దగ్గిర కెళ్ళిన ఆమెకు
ఇల్లును ఖాళీ చేసి వెళ్ళమని పరిసర మంతయు నీట చిక్కెనని
నీతులు చెపుతూ హెచ్చరించిన ఆతని మాటలు పోటుగ తగిలెను
అడుగుల కిందన నేల కదిలి కంటిలొ సుడులుగ తిరిగిన నీటిని
బిడ్డల చూపులె అడ్డ కట్టలై ఆమె గుండెలలో జార్చి నిలబడె

అతని రాకకై ప్రార్ధన చేస్తూ భయపడ వద్దని బిడ్డలజెప్తూ
ఆశను వదలక బాధలనోర్చి బావురు మనక ధైర్యము చూపె

ఇంతలో ఆవల అడుగుల సవ్వడి
వడి వడి పరుగున నడిచెడి నీడది
ఆశల మెరుపులు నింగిని తాకెను
ఆతృత దారిన వెలుగై పాకెను
ఈదురు గాలులు ఆత్మ ఘోషలై
ఆత్మీయతలే కురిసే వానగ
దాపుల కొచ్చిన ఆకృఉతి తనదని
పోల్చిన పిల్లల కేకల వెనకన
కార్చిన కన్నులధారలు ఆగగ
ముసిరిన మబ్బులు తేలిక వీడెను !!

!!సమాప్తం !!

ఇక్కడ నేను వాడిన పోలికలు -- ఇవ్వటానికి ఇబ్బందిగా ఉన్నా చదువరులకు మరింత ఆసక్తి కలిగించడంకోసం రాస్తున్నాను.

రాత్రి = one incident -- they come and go on a regular basis in life
వాన = reactions to that incident - they change depending on situations
ముసురు = resulting gloomyness - some times heart braking
మెరుపులు =ability to reason things -- ingloomyness we need to them to give some light
ఆరిపోయిన లైటు = reasonless నమ్మకం - పిచ్చి నమ్మకం అంటాము అది
పిల్లలు = ఆశ ఆతృత they are innocent and usually cause more pain
భార్య = గుండె నిబ్బరం, ఆధ్యాత్మికత the one which make things calmdown and give some
time to think
భర్త = opportunity or అవకాశం to get out of the gloomyness
అపరిచితుడు = others who interfere in our situations and give their interpretations
సాయంత్రం = a moderate middle class life
సముద్ర తీరం = people living in shadows of gloomyness
ఒంటరి ఇల్లు = helpless individual
నల్ల మబ్బులు = difficulties
తుఫాను హెచ్చరిక = a warning that some difficulties are going to come


Trinath wrote a beautiful english poem on the same concept. To enjoy the beauty of it, pl. visit    http://musingsbytrinath.blogspot.com/2008/11/hinged.html.  it is mere coincidence that we both selected the same topic. but Trinath gaaru expressed it in a better and beautiful way.
Tuesday, January 13, 2009

వింటర్ బ్లూస్ ...

ఎండు చెట్టు కొమ్మ లన్ని
వెండి పూత పూసు కుంటె
గువ్వ పిట్ట గూడు లోన
గోల చేసి వూరు కుంది

నేల తల్లి ఒంటి మీద
ముగ్గు బుట్ట లెన్నో పెట్టి
ఒక్క తన్ను తన్ని నట్టు
తెల్ల బోయి మిన్న కుంది

చెట్టు లన్ని రంగు లద్ది
బోరు కొట్టి నట్టు వుంది
ఊరు అంత వెల్ల గొట్టి
దేవు డూదె చల్ల గాలి

గడ్డి పూస లేని చేలు
ఒట్టి పోయి నట్టు ఉంటె
లేడి కూన ఆడ చేరి
తిండి లేక బోరు మంది

ఏటి లోన నీరు కూడ
గడ్డ గట్టి నిండు కుంది
తాగ చుక్క నీరు లేక
నేల నోరు ఏండు కుంది

మంచు రాలి ఆగి నాక
కప్పు వెంట కారి కారి
సూది లాగ రూపు కట్టి
తెల్ల పళ్ళు చూపె చూరు

రోడ్డు పక్క కుప్ప జేరి
గడ్డి వాము అంత కూడి
కాళ్ళు కింద పెట్ట జారి
కుంటు వారి తీరు చూడు

బండి ఎక్కి పారి పోవ
తాను మంచు కుప్ప దూరి
పైకి నన్ను లాగ మంటు
దీన గాధ చెప్ప సాగె

ఎందు కీడ కొచ్చి నాను
మంచు తోడ చావ గోరి
ఇండి యాలో ఉండి పోతె
వెచ్చ గానె ఉండి పోదు

తిన్న తిండి లోన చేరి
చల్ల గుండి ఆక లైదు
వేడి నీరు తాగి నాకు
దాహ మింక తీర రాదు

మాయ దారి పచ్చ నోటు
తస్స దీని దుంప కొయ్య
చిక్కు లెన్ని తెచ్చి పెట్టి
మంచు వెల్ల నాకు కొట్టె

తట్ట బుట్ట సద్ది ఇంక
ఇంటి దారి పట్ట బోతె
ఫ్లైటు రేటు పైకి పోయి
చుక్క లెంట చేరె నేడు

ఎర్ర బస్సు ఈడ రాదు
ఊరు మాది దాపు లేదు
ఎండ రోజు లొచ్చు దాక
వేచి ఉండ వచ్చె నాకు

తప్పు లుంటె దిద్ది పెట్టి
ఒప్పు కుంటె భేషు కొట్టి
తప్ప కుండ నాకు జాబు
పెట్ట కుండ పోరు మీరు

ఎదురు చూపు - ఒకటవ భాగం

వణుకుతున్న కిటికీ తలుపులు గొళ్ళెమేయమని చేసే గొడవ ...
రోజు మారకముందే చిరిగి ఎగిరేలా హడలుగొట్టే గోడ కాలెండరు ...
ఇల్లంతా తనదన్నట్టు సొదా చేస్తూ ఈలలు వేసే ఈదురు గాలి...

అలిసి నేలరాలి, అంచు చేరిన అలల్లా తిరిగి ఎగిరే దుమ్ము వృత్తాలు ...
తిండిదొరక్క పల్లెపై పడ్డ గున్న ఏనుగుల్లా నింగి చేరిన నల్ల మేఘాలు...
దూరంగా చావు డప్పులా వస్తు పోతు వినిపించే తుఫాను హెచ్చరిక...

సముద్ర తీరమది
దూరంగా ఒంటరి ఇల్లది
ఒకప్పటి సాయంత్రం కధ ఇది

అటునిటు తిరుగుతు ఆతృత చెందుతు అడుగుల సవ్వడి కొరకై వెదుకుతు
వడివడి పరుగిడి ద్వారము చెంతన తనపతి కానక వికలం అగుసతి

మారాం చేస్తూ నాన్నేడంటూ గారాం పోతూ రాడేఅంటూ
మాకూ నాన్నే కావాలంటూ కొంగుల్లాగే బిడ్డల్నాపి పోరా
పోరా పోపొమ్మంటూ విసుగును చూపి కసిరే అమ్మ

హోరును పెంచిన ఈదురు గాలులు, జోరును సాగిన వాన ధారలు
కడలిలొ పెరిగిన అలల జలాలు, సడలిన పిల్లల గుండె బలాలు,
పెరిగిన ఆతృత మనసులనుండి ఆప్యాయతగా పారిన సమయం
నింగిన నిండిన నల్లని మబ్బులు, ఇమడక గుండెలొ జారిన తరుణం

అమ్మ రెక్కలో దూరిన పిట్టలా, భయపడి నక్కిన పిల్లలు పక్కన
అమ్మను చూస్తూ నాన్నేడంటూ వణికే స్వరమున మళ్ళీ అడిగితే
జవాబు తెలియక తనకీ కానక సతమతమయ్యెను పాపం ఆమె
నిండిన కన్నుల జారే ధారలు వీధికి అద్దిరి అందరి చూపులు

మెరుపు దెబ్బకి ముక్కలు కాగా నింగి తునకలు శబ్దం చేస్తూ
పెరటి మూలగల విద్యుత్‌ పెట్టెపైగూలి చూపెనిక కాంతుల చిందులు
అప్పటివరకు వెలిగిన దీపము ఎదురు చూపుల గుంపున కలిసి
ఎవరికోసమో తెలియక పోయినా వీధిని చూస్తూ నిలబడి ఉంది.

బయట చీకటి ఇంట చీకటి
కంటి రెప్పలను దొప్పలు చేసిరి
ఆశను నూనెగ అందున నింపిరి
ఆతృత ఒత్తిగ అందుకు నేసిరి
మండె గుండెల జ్వాలను తీసిరి
ప్రేమను దీపము నట్టింటెట్టి

తండ్రి కోసమా తనయుల చూపులు
భర్త కోసమా అమ్మడి ప్రార్ధన(సశేషం ... )

వాన ఆగేనా ? కలత తీరేనా ?
ఆశతీరేనా ? అతను వచ్చేనా ?

రెండో భాగంలో చూడండి

Monday, January 12, 2009

పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా

పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా

బొమ్మలతొ కొల్వులంట ముంగిట్లో ముగ్గులంట
హరిదాసుల పాటలంట గంగిరెద్దు ఆటలంట
పిల్లగాండ్లకు శెలవలంట ఇళ్ళుబాగ అలికిరంట
పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా

ముగ్గుల్లో గొబ్బెలంట రంగులద్దు పడతులంట
గార్లుబూర్లు చేస్తరంట భోగిపళ్ళు పోస్తరంట
పంట ఇంటి కొస్తదంట సంబరాలు చేస్తరంట
పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా

కొడకా అది మనకుగాదు ఆదారిన నువ్వుబోకు

పండగంటు పేరు పెట్టి తెగ తిందురు మారాజులు
మనకేమో పొట్టనిండ తిన్న దినమే పండగరా
ఆట పాటలంటావా అదిలేని దినమేదిర?
లేనిరోజు పస్తులుంట మరిచినావురా బిడ్డా ?
భోగిమంటలంటావా? చలికాగుదురంటావా ?
కడుపుమంట రగులుతుంటే చలిదాపుకు రాదు గదర
గారె బూరెలంటావా? మారాజులు మెక్కినాంక పాసికూడు తెద్దువులే !!

కొడకా అది మనకుగాదు ఆదారిన నువ్వుబోకు
కంటినీరు తుడువు బిడ్డ నాటకాలు ఆపు బేట
బయట ఉన్న నూకలోని పురుగులూది లోపలెట్టు
మనకొంపకు వచ్చేటి పంటదిరా ముద్దు బిడ్డ
నేలపాలు సేయమాక వీపుమోత మోగిపోద్ది
గంజి నీకు కాసిత్తా గమ్మున కునుకేయి పోయి !!

వాడి కడుపు మంట తెచ్చే
భోగి మంటల వేడి నాకు
వాడి మాటల తీరు తెచ్చే
ఎద్దు గంటల హోరు నాకు

వాడి ఆకలి కేక తెచ్చే
వేడి గారెల త్రేన్పు నాకు
వాది బాధల మూల్గు లిచ్చే
దాసు భజనల గుర్తు నాకు

వాడు చెరిపిన కంటి నీరే
చేదు నిజమై కలము కదిలెను
పండుగన్నది ఒకరి సొత్తుగ
మిగల రాదని నీతి తెలుపగ

తోటి వారికి సంబరాల్లో పాలు పంచుతు చేయి నిస్తే
బక్కచచ్చిన ఎన్నో మనసులూ పండుగలకు ఎదురు చూస్తాయి !!

నేను ఎప్పుడొ రాసిన కవితను తిరిగి కాస్త కొత్తదనాన్ని చేర్చి మళ్ళి సందర్భం వచ్చింది కనక అందిస్తున్నాను

ఆనందాన్ని అందరికీ పంచుదాం అదే నిజమైన పండగ

మీకందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు కందం ఆంగ్లానికద్దితే ?

తెలుగు కందం ఆంగ్లానికద్దితే
అంతే అందం అబ్బుతుందోచ్‌ !!!

మాన్యులు తప్పులుంటే మన్నించగలరు,

కం:
ఫర్‌ సింపుల్‌ హాపీనెస్‌
బి ఇట్‌ యువర్స్‌ ఆర్‌ అథర్స్‌ డుగుడ్‌ ఓన్లీ
థిస్‌ సింపుల్‌ ఏక్ట్‌ విల్‌
డెఫినెట్‌లీ చేంజి వరల్డ్‌ ఫర్‌ గుడ్‌ స్లోలీ !!

for simple happyness
be it yours or others do good only
this simple act will
definitely change world for good slowly


ఇది ఏ పద్యమో తెలీదు కానీ
ఫ్లోలో వస్తే రాసి సద్దుకుపోయా

కందంబబ్బెను నాకని
అందంగా మాట చెప్ప ఆంగ్లము నైనన్‌
పొందిగ్గా రాయగల్గితి
చిందుల్నిక వేసినాను నైబర్లు అర్వన్‌Friday, January 9, 2009

వయసు

వయస్సెంత కఠినత కలది
బ్రతుకు గాధలొ బాధల్నేరి
మడతలు చేసి ముఖానికద్ది
మనిషిని ముదుసలి చేసేస్తుంది

చేతిని కాలిని ముఖాన్ని సైతం
వదలక వికృత ఆకృతులలికి
దరహాసాన్నీ వీడక మార్చినా
నిస్తేజులమై నిలబడి చూస్తాం

మొదటి మడత కధా అందంగానే
వెచ్చని ప్రేమలా, నెచ్చెలి ముద్దులా
గుండెగదులలో దాక్కుంటుంది
వీడక నీడగ కడపటి దాకా తోడిస్తుంది

గడిచేకాలం బ్రతుకు గాధలకు
మకిలిని చేర్చి ఇకిలిస్తున్నా
వయసు మాత్రమే అద్దంలాగా
గడిపిన బ్రతుకుకు సాక్షవుతుంది

http://musingsbytrinath.blogspot.com/2009/01/ag.html కి అనువాదము.

vayassenta kaThinata kaladi
bratuku gaadhalo baadhalnEri
maDatalu cEsi mukhaanikaddi
manishini mudusali cEsEstundi

cEtini kaalini mukhaanni saitam
vadalaka vikRta aakRtulaliki
darahaasaannii veeDaka maarcinaa
nistEjulamai nilabaDi cuustaam

modaTi maData kadhaa andamgaanE
veccani prEmalaa, necceli muddulaa
gunDegadulalO daakkunTundi
veeDaka neeDaga kaDapaTi daakaa tODistundi

gaDicEkaalam bratuku gaadhalaku
makilini cErci ikilistunnaa
vayasu maatramE addamlaagaa
gaDipina bratukuku saakshavutundi

ఎంటి silentగా ఉన్నావు ?

ఎంటొ అంత silentగా కూర్చున్నావు
something ఏమన్నా చెప్పొచ్చుగా ?
after a long time కల్శామా ?
కనీసం shake hand ఐనా ఇవ్వొచ్చుగా?

కళ్ళు దించుకుని కామోషై పోయావు
atleast కన్నెత్తైనా చూడొచ్చుగా ?
నాకేంటొ ఇది strangeగా అనిపిస్తుంది
కనీసం ఒక joke ఐనా వెయ్యొచ్చుగా ?

ఆరాటంగా ఆశగా ఆబగా ఆతృతగా
you know, పరుగెట్టుకొచ్చా
నీతో చాలా చెప్పాలని అడగాలని
now see ఏమయ్యిందో
ఇద్దరు ఒంటరులం జంటగా కూర్చున్నాం
దీనికి ఇక్కడిదాక why to come?

smile ఐనా ఇవ్వొచ్చు
మరి కాస్త closeగా జరగొచ్చు

ఎంటొ అంత silentగా కూర్చున్నావు
something ఏమన్నా చెప్పొచ్చుగా ?

నీతో ఎప్పుడూ ఇంతే
నా చావుకొచ్చింది
సరే ఐతే leave it !!
నేనే ఏదో ఒకటి చేస్తా
ఏంటి అనా ఆ look ?
రేపటి కోసం waitinగమ్మా
ఇంకేంచేస్తాం

ఏకశ్లోకి నా జీవితం

ఆదౌ అల్మరు క్లాకు కూత వినడం కాఫీకై కూర్చోవడం
టీవీలోదూరడం ఖరాబు కనడం టైమెంతొ చూస్కోవడం
దేశాన్నితిట్టడం బ్రష్షేసి తోమడం బస్సుకై కాపేయడం
ఆఫీసు హస్కు ఐదైతె ఆపేయడం ఏతద్దినాజీవనం


Thursday, January 8, 2009

చావు

స్థబ్దతెరగని వ్యర్ధ బ్రతుకిది
సుద్ద దండగ బ్రతుకు కూడలి
ఉద్దరించగ వచ్చెనదిగో
సిద్దమెక్కర చావురైలుని

దీనికెంతో శక్తి ఉన్నది
పాపమంతా కడగ గలదు
చచ్చినోళ్ళకు మెప్పుతెచ్చే
మంచి గుణమే దీనికున్నది

ఊర్ధ్వ నీచములంటు లేవు
మధ్య రకమగు చావులేదు
హెచ్చు తగ్గుల బ్రతుక విసిగిన
మనిషికంత సమము ఇక్కడ

వేరు గతులతొ విలువలుడిగే
అన్ని చావున సమములే
కోరి నడుపును నిన్నుచూడు
దిక్కు తెలియని పధములొ

చలి గుప్పెట చిక్కి మిగిలిన
పొగమంచుర మన జీవితం
ఆ గుప్పెట సడలక మానదు
మన బ్రతుకిక కరగక ఆగదు


sthabdateragani vyardha bratukidi
sudda danDaga bratuku kuuDali
uddarincaga vaccenadigO
siddamekkara caavurailuni

deenikentO Sakti unnadi
paapamantaa kaDaga galadu
caccinOLLaku mepputeccE
manci guNamE deenikunnadi

uurdhva niicamulanTu lEvu
madhya rakamagu caavulEdu
heccu taggula bratuka visigina
manishikanta samamu ikkaDa

vEru gatulato viluvaluDigE
anni caavuna samamulE
kOri naDupunu ninnucuuDu
dikku teliyani padhamulo

cali guppeTa cikki migilina
pogamancura mana jeevitam
aa guppeTa saDalaka maanadu
mana bratukika karagaka ఆగాడు

ఇది ఇక్కడ పోస్ట్ చీసిna దానికి అనువాదం.
http://musingsbytrinath.blogspot.com/2008/12/death.html

రసాస్వాదనాలింగనాల్లో ముంచవా ?

నిను చూడగానే...
అప్పటిదాక లేని ప్రాణం లేచి పరుగెట్టి వచ్చింది
ఈడ్చినా రాని కాళ్ళు నింగిలోకెగిరేసి నీకాడ నిలిచాయి
సగం చచ్చిన కళ్ళు ప్రాణాలు పూశాయి
ఆలింగనాలకై ఒళ్ళు పరవళ్ళు తొక్కింది

నిను చేరగానే...
ఒక పాలు చలి నేడు ఎక్కువయ్యిందేమో
అటుచూడు నీ నోరు పొగలు గక్కేస్తోంది
నిషాల్ని నింపేటి నీ ఒంటి ఆ తావి
కైపుల్ని రేపుతూ గుండెల్లో గిలిపెట్టె

ఈరోజు నీ మధువు నేగ్రోలనున్నాను
ఈనాడు నాగెలుపు తధ్యమే చిన్నారి
పొంగుల్ని తగ్గించి నా మాట మన్నించి
వలువల్ని విడిచేసి గుండెల్లో మఠమేసి


రసాస్వాదనాలింగనాల్లోన నేడు
ముంచవా
.
.
.
.
.
.
కాఫీ !!

Tuesday, January 6, 2009

అద్దం

అద్దమీరోజు నన్ను గుర్తించలేనంది
గురుతులేవో తనకి చెప్పుకోమంది
ఆనన్ను నాలోనే తవ్వుకోమంది
ననుచూసి నన్నే నవ్వుకోమంది

అనుభవాల జముళ్ళు రాసుకుని
కన్నీట దాహాలు తీర్చుకుని
బీడుల్లో నా బ్రతుకునీడ్చుకుని
గతపు అద్దంలోకి ఆశగా చూస్తే!! అద్దమీరోజు ..

జారిన బంధాలనల్లుకుంటూ
కాలపు చిట్టాలనేరుకుంటూ
వయసు ముఖానికద్దుకుంటూ
గతపు అద్దంలోకి ఆబగా చూస్తే... !! అద్దమీరోజు ..

కన్నీటి సీసాలు ఖాళీలుచేస్తూ
నషాలొ గమ్యాన్ని ప్రక్కనకుతోస్తూ
సుఖాన్ని ఎక్కడో కోలిపోయానంటూ
గతపు అద్దంలోకి బాధగా చూస్తే... !! అద్దమీరోజు ..

గుడిభూమి, ఇలవేల్పు, వేడి వయసులకూడి
అమ్మ కడుపే కాదు ప్రేగు బంధము నేడు
అరువుకైనా వచ్చు కొనితెచ్చుకోనగవచ్చు కానీ
అమ్మకానికి నన్నుకానక మోకరిల్లన నన్ను చూసి ...!! అద్దమీరోజు ...

ఆశ

రాత్రి బ్రతుకు పండినట్లుంది
తన చంద్రుని గుండెకు హత్తుకుని
తానొదిగి తమకంలో నిద్దరోతుంది

ఇటు చూడు వేదన బల్లమీద
ఆశ ఒంటరై ముఖం దాచుకుని
ఏడ్చి అలిసి బేలగా ఒదిగి కూర్చుంది

తోడు దొరకని ఆశకు ఈడు జారింది
నీ జాడ కానక తాను గోల చేసింది
నీడతోనే తన గోడు చెప్పుకుంటుంది

పండి రాలిన కలలు ఏరుకుంటూ
ఆశమంటకు చితుకులుగా వాడుకుంటూ
ఆరకుండా దాన్ని చూసు కుంటుంది

తెల్లవారే లోపు
కలలు సమసే లోపు
ఆశ ఆరేలోపు
నెగడు అణిగేలోపు
ఆశ పండేనో అడియాసై మండేనో

ee raatri bratuku panDinaTlundi
tana candruni gunDeku hattukuni
taanodigi tamakamlO niddarOtundi

iTu cuuDu vEdana ballameeda
O aaSa onTarai mukham daacukuni
EDci alisi bElagaa odigi kuurcundi

tODu dorakani aaSaku eeDu jaarindi
nee jaaDa kaanaka taanu gOla cEsindi
neeDatOnE tana gODu ceppukunTundi

panDi raalina kalalu ErukunTuu
aaSamanTaku citukulugaa vaaDukunTuu
aarakunDaa daanni cuusu kunTundi

tellavaarE lOpu
aa kalalu samasE lOpu
aa aaSa aarElOpu
aa negaDu aNigElOpu

aa aaSa panDEnO aDiyaasai manDEnO

Monday, January 5, 2009

దారి చూపు

అలిగిన చెలి కన్నుల మంటలోర్చగ వచ్చు
విరిగిన తన పల్కుల ముత్యాలేరగ వచ్చు
బిగిసిన నులి పెదవులు తంటాలు తెచ్చిపెట్టె
ఇరువురు సతులతో నెగ్గిన ఈశా దారి చూపు?

వినగలవా? విని మన గలవా ?

గుండె తప్పెట లయల దాగిన
ప్రేమ లొలికే నా పాట పిలుపో
కనుల కొలనుల కట్ట జారిన
వేచి విసిగిన నా ఆశ విరుపో
నిద్ర కాచిన తనువు కాగిన
నిండు మనసుల నా తపన అరుపో
ప్రేమ నిండిన గుండె వేసిన
ఆశ విరిగిన నా కంటి తెరుపో

ప్రశాంత నిశ్శబ్ద నిశీధిలో నైనా,
అశాంత రణరంగ మధ్యస్థలిలో నైనా
వినగలిగే మనసు ఉంటే
వినాలన్న ఆశ ఉంటే
నీ గుండె చప్పుళ్ళకు తాళంగా వినబడగలదు
వినగాలవా ?
నీ మనసును వినమనగాలవా ?
విని మనగలవా ?


gunDe tappeTa layala daagina
prEma lolikE naa paaTa pilupO
kanula kolanula kaTTa jaarina
vEci visigina naa aaSa virupO
nidra kaacina tanuvu kaagina
ninDu manasula naa tapana arupO
prEma ninDina gunDe vEsina
aaSa virigina naa kanTi terupO

praSaanta niSSabda niSiidhilO nainaa,
aSaanta raNaranga madhyasthalilO nainaa
vinagaligE manasu unTE
vinaalanna aaSa unTE
nee gunDe cappuLLaku taaLamgaa vinabaDagaladu
vinagalavaa?
neemanasuni vinamanagalavaa ?
vini managalavaa ?

Friday, January 2, 2009

నీ పిలుపు

ఏడు జలధుల ఆవల నుంచి
హల్లో అంటూ వచ్చిన పిలుపు
ఎదలో మల్లెలు కురిసేటట్టు
మరువపు తావిని విసిరేటట్టు
గుండెను తాకిన విచిత్ర వైనము
ఒక్క ముక్కలో చెప్పేదెట్లా ?

ఆ ఆనందానికి అవధులులేవు
ఏ కొలతలు దానికి సామ్యం కావు
బాగున్నావా ? ఆ ఒక్క మాటతో

బరువు బంధాలు బద్దలయ్యాయి
కళ్ళు చెమర్చి తేలికయ్యాయి
గుండెలు రెక్కలు తొడుక్కున్నాయి
నీ ఊసులు మనసులో నిండిపోయాయి
కాళ్ళు గాలిలో తేలిపోయాయి
నింగి అంచులు పరిచయమయ్యాయి

కొత్త వత్సర ఘడియలు నన్ను
ప్రేమగా గుండెకు హత్తుకున్నాయి
తడిసిన కళ్ళను వేలితో తుడుచుకున్నాయిEDu jaladhula aavala nunci
hallO anTuu vaccina pilupu
edalO mallelu kurisETaTTu
maruvapu taavini visirETaTTu
gunDenu taakina vicitra vainamu
okka mukkalO ceppEdeTlaa ?

aa aanamdaaniki avadhululEvu
E kolatalu daaniki saamyam kaavu
baagunnaa ? aa okka maaTatO

baruvu bandhaalu baddalayyaayi
kaLLu cemarci tElikayyaayi
gunDelu rekkalu toDukkunnaayi
nee uusulu manasulO ninDipOyaayi
kaaLLu gaalilO tElipOyaayi
ningi anculu paricayamayyaayi

kotta vatsara ghaDiyalu nannu
prEmagaa gunDeku hattukunnaayi
taDisina kaLLanu vElitO tuDucukunnaayi

చినుకులు

శ్వాస
-----
చల్లగా నాలోకి జారుకుంటుంది
చేరి ఉపశమిస్తుంది
చలికాగి చిన్నగా పారిపోతుంది

రోడ్డు
-----

డుగులు మోసుకుంటూ
నిశ్చలంగా సాగుతుంది
ఆనందంగా ఓలలాడుతుంది

కవిత
----

కళ్ళలోకి దూరిపోయి తన
అందాలను గుండెల్లో చూసుకుంటుంది
స్పందించి కాగితంపైన ఆడుకుంటుంది

సూరీడు
----------
మునివేళ్ళతో గిచ్చి లేపుతుంటాడు
తలుపు సందులోనుంచి జారుకుంటాడు
లేచి చూసే సరికి మండుతున్నాడు