ఒకే దారిన పోతున్నాం
బ్రతుకు మూట భుజానేసుకుని
ఆశ వెలుగులో దార్లు వెతుకుతూ
అడియాశ మలుపులు వెనక వదులుతూ
తిరిగిన దారులు గుర్తు చేసుకుంటూ
ఒకే కాలాన్ని గడుపుతున్నాం
మన గతపు గంపల గాధలు పంచుకుంటూ
కొత్త కధలను అల్లుకుంటూ
తడబడు నడకలు సవిరించికుంటూ
ఒకరికి ఒకరు ఆధార మవుతూ
ఈ బంధానికి పేర్లు వెదికి
ఓడిన వారెందరో,
అలిసి ఆగిన వారెందరో
పేరు పెట్టి విరిగిన వారెందరో
పిలిచి దాని విరవటమెందుకు ?
మన బంధానికి పేరులొద్దు
ఒకరికి ఒకరు తోడుగా
ఎవరి గమ్యం వారు చేరుకుందామా ?
ఇలా కలిసి తిరిగిన అపరిచితులుగానే సాగి పోదామా ?
చివరికి మన గతాల్లోనే మిగిలి పోదామా ?
సమసి పోదామా ?