Tuesday, March 17, 2009

వాన


నిండు చూలాళ్ళల నల్ల మబ్బులు 
మెల్లగా.. మండుటెండలో ..
చల్ల గాలి చేయినందుకుని.. 
సిగ్గు మెరుపుల సాన్నిధ్యంలో,
మూల్గు ఉరుముల నేపధ్యంలో..
మగ్గిన పండు సూరీడ్ని చంకనెత్తుకుని 
నింగి నిండా అల్లుకుంటూ..
మా ఊరొచ్చాయి.

పులకరింతల సమయమిదనేమో..
మండే సూర్యుడూ.. నిండు చంద్రుడై
చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.
చక్కని అందాలొలికిస్తున్నాడు.

చప్పట్లు కొడుతూ చెట్టు కొమ్మలూ..
తలలనూపుతూ పూల రెమ్మలూ
గంధాలొలికే మెల్ల గాలులూ
కిలకిలలాడుతు పక్షి గుంపులు..
తాకాలంటూ తహతహలాడే నేల కణాలూ..
అలలను రేపిన పంట పొలాలు..
పిలవక వచ్చిన తూనీగ బంధువులు..

మబ్బుల ప్రసవం కోసం 
ప్రకృతి రంగం సిద్ధం చేసింది.

ఆహ్వానించే పిల్లల నోళ్ళు..
ఆహ్లాదంగా ఎగిరే తువ్వాయి
వింజామరలతొ నెమళ్ళ నాట్యం..
శుభాన్ని పలుకుతు గిత్తల గంటలు..
చల్లగ జారే  బిడ్డల కోసం
మా ఊరూ రంగం సిద్దం చేసింది.

అందరు సిద్ధం అవడం చూసి..
నింగిన రంగుల జెండా ఎగిరే సరికి..

తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మబ్బుల లాస్యం
ఫెళ ఫెళ లాడుతు ఉరుముల జోస్యం
తకధిమి తకధిమి ప్రకృతి నాట్యం..

స్వార్ధ సంగీతం



స్వేచ్చకోసం..
వెదురు గుండెల గాయాపు ఘోషను వింటూ.. 
మధురమంటాం.. వేణు నాదమంటాం..
కన్నులు మూసి ఆస్వాదిస్తాం.

స్వేచ్చకోసం..
గంట లోలకపు బరువు అరుపులు వింటూ .. 
పవిత్రమంటాం .. ఘంటారావమంటాం
చేతులు మోడ్చి ప్రార్ధన చేస్తాం.

స్వేచ్చకోసం..
ఘజ్జలొ చిక్కిన గోళీ కేకలు వింటూ.. 
తలలాడిస్తాం.. రవళులు అంటాం
కదాన్ని కలిపి నాట్యం చేస్తాం.

స్వార్ధంకోసం..
తొలిచిన గుండెల తంత్రులు మీటి .. 
తన్మయులవుతాం .. విణాగానమంటాం
కృతులను చేర్చి కృతార్ధులవుతాం.

స్వార్ధంకోసం..
కాల్చిన తోలును కర్రతొ బాది..
గంతులు వేస్తాం.. ఢంకానినాదమంటాం
గొంతులు కలిపి గీతాలంటాం.

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః
నిజమే.. కానీ..
వాటి గాయాలకి .. చెమర్చే కళ్ళెన్నీ ?