ఇక నేనేం చెప్పను
నేనింకేం చెయ్యను ..
ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..
నా మనసు మొక్క మనుగడ కోసం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. విధినేమనను ?
నా ముళ్ళపైనే నీ కళ్ళు..
నీ మునివేళ్ళపైనే నా ముళ్ళు..
నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు కావూ .. ?
నీవన్నీ నావనుకున్నా.. నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ... ? అబ్బా..
ఇప్పుడే నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది.. గుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం. మరో ఎర్ర గులాబీ పూసింది ?
వేటగాడినా.. ?
నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న ..
పండుటాకును నేను...
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా
నా గత జ్ఞాపకాల కంపను నేను..
పరిమళం గారు రాసిన కవితకు నా స్పందన
http://anu-parimalam.blogspot.com/2009/03/blog-post_30.html