Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

Wednesday, August 26, 2009

పిలుపు


చెరిగిన బొట్టునెవరో
తిరిగి దిద్దినట్టనిపించింది

గుడిలో గంట
మరల మ్రోగినట్టనిపించింది

మెలికలు తిరిగిన నడక
అదిరి ఆగి నిలిచిన లేడి
నిలకడగా.. కదిలినట్టనిపించింది

రెప్ప తెంచుకుని
మనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
తలను మూర్కుని తనువు చాలించినే
చూపులు.. ఈసారి పూసినట్టనిపించింది.

నీ పిలుపుతో.. చెలీ..
శవం బ్రతికినట్టనిపించింది..
శిల కరిగినట్టనిపించింది.

Tuesday, August 11, 2009

గొడుగు



వానలెన్ని చూసిందో
ఎన్ని ఎండల కాగిందో
బలహీన మయిన బొమికలతో
బేలగా చూస్తుంది..

కానీ ఆ ముఖం మీద
రంగు పూలు మాత్రం
పొడుచుకున్న పచ్చలా
శాశ్వతంగా పలుకరిస్తున్నాయి

కరుకు కాలం
ఎన్ని కరిగించలేదు ?
చిరుగాలి కూడా.. ఇప్పుడు
తనని కృంగదీస్తుంది..
కణుపులిరిగిన చేతిలా
వ్రేలాడ దీస్తుంది.

ఈ వానలో.. మట్టి ముద్దగా
మిగిలిన నేను..
తలదాచుకోవాలనే ఈ పరుగు..

తనతల నేను దాచుకోవడానికో.. ?
నా తల తనలో దాచుకోవడానికో.. ?
పారుతున్న కాలమే సాక్షి !!


త్రినాధ్‌ గారు తన బ్లాగులో రాసిన ribs అన్న కవితను నాకనుగుణంగా మలచి రాసినది. ఆ కవితను ఇక్కడ చూడండి.
http://musingsbytrinath.blogspot.com/2009/07/ribs.html

Monday, July 20, 2009

గుండె గుడి


మనసు కొండ మీది మందారాన్ని
పూజ వస్తువుగానే పొదువుకున్నాను..
నిరీక్షణలో కరిగిపోయిన కాలాన్ని
నీరాజనంగానే అద్దుకున్నాను...

నిన్ను కోరిన మనసు మధనను
ప్రసాదమంటూ సమాధానపడ్డాను..
తపన మిగిలిన తడికన్నులను
నిర్మాల్యమని తృప్తిపడ్డాను..

మాటల గారడీలో
పెదవుల వెనక నలిగిన నిజాలనూ..
ఎదురు చూసిన రెప్ప చూరుల
వెంట ఆవిరయిన ఆశ క్షణాలనూ..
గోటి మొనతో మీటి..

గుండె గుడిలో వెలిసిన దేవతకు
మంగళహారతి అనుకున్నాను.

Tuesday, May 5, 2009

మనలానే !!


ప్రమిద క్రింద చీకటిలా
దోబూచులాడుతూ ..
ఆ నీడన స్థిరత్వం వెదుక్కుంటూ..

సెలయేరులో గులకరాళ్ళలా
ఒదిగిపోయి.. కాలంతో కోసుకుపోతూ
మృదుత్వం మొహాన పులుముకుంటూ..

రహదారిలో మైలురాయిలా
నిస్వార్ధంగా.. దారి చూపుతూ ..
చేతనలుడిగి పాతుకుపోతూ..

ఒకదానికొకటి తోడుగా.. ఎప్పటికీ.. 
ఐనా..ఎన్నటికీ కలవని బంధాలవి ...

మనలానే !!

Thursday, April 16, 2009

అర్ధాంగివయ్యేదానివి.


నన్ను నన్నుగా చూస్తావు చూపిస్తావు ...
నువ్వు నేనై పోతావు ..

నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే
నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.

నీకెంత దూరమైనా..
నిను చూడక పోయినా..
నాకోసం అలానే..
ఆబగా ఎదురు చూస్తూ..నిల్చుంటావు
నీగుండె పగిలినా.. నిశ్చలంగా..
నన్ను నీ గుండెల్లోనే దాచుకుంటావు

ఎద్దేవా చెయ్యకుండా..
నాలో ఎన్ని తప్పులు చూపి దిద్దుకోమన్నావు..
నన్ను మెరుగు చేయాలన్న తపన నీది
అది ఒకటే తపస్సు నీకు
మళ్ళీ మళ్ళీ చెప్పడానికైనా వెనుకాడవు
ఏమనుకుంటానో అనీ చూడవు.
ఎందుకీ అనురాగం ? ఏమిటీ అనుబంధం ?
ఇంత ఆప్యాయతా ? ఎందుకూ ?

కాల గతిలో నేను కొట్టుకుపోయినా
తిరిగొచ్చినా.. రాకపోయినా..
నీ దరి చేరినా.. చేరక పోయినా..
అలా నాకోసం ఎదురు చుస్తూ..

ఎందుకు ?
నీకంటూ ఏ ఆశలుండవా ?
నీ బ్రతుకు నీకు లేదా ?
నాతోనే ఎందుకు పెనవేసుకున్నావు ?

ఇలా నిర్జీవంగా.. నిశ్చలంగా..
నిర్మలంగా.. నాకోసం..
నేను నీకేమి చేశానని ?
ఎలా ? ఎందుకు ?..

నా గుండె కరిగిపోతోంది..
మనసు అట్టుడికిపోతోంది..
నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ?

నీకేమి చెయ్యగలను ?
అద్దమయిపోయావు ... అమ్మాయివైతే
అర్ధాంగివయ్యేదానివి.

Monday, March 30, 2009

వేటగాడినా.. ?


ఇక నేనేం చెప్పను
నేనింకేం చెయ్యను ..

ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..

నా మనసు మొక్క మనుగడ కోసం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. విధినేమనను ?

నా ముళ్ళపైనే నీ కళ్ళు.. 
నీ మునివేళ్ళపైనే నా ముళ్ళు..

నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు కావూ .. ?
నీవన్నీ నావనుకున్నా.. నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ... ? అబ్బా..
ఇప్పుడే నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది.. గుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం. మరో ఎర్ర గులాబీ పూసింది ?


వేటగాడినా.. ? 
నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న .. 
పండుటాకును నేను... 
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న 
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా 
నా గత జ్ఞాపకాల కంపను నేను..


పరిమళం గారు రాసిన కవితకు నా స్పందన
http://anu-parimalam.blogspot.com/2009/03/blog-post_30.html


Tuesday, March 17, 2009

స్వార్ధ సంగీతం



స్వేచ్చకోసం..
వెదురు గుండెల గాయాపు ఘోషను వింటూ.. 
మధురమంటాం.. వేణు నాదమంటాం..
కన్నులు మూసి ఆస్వాదిస్తాం.

స్వేచ్చకోసం..
గంట లోలకపు బరువు అరుపులు వింటూ .. 
పవిత్రమంటాం .. ఘంటారావమంటాం
చేతులు మోడ్చి ప్రార్ధన చేస్తాం.

స్వేచ్చకోసం..
ఘజ్జలొ చిక్కిన గోళీ కేకలు వింటూ.. 
తలలాడిస్తాం.. రవళులు అంటాం
కదాన్ని కలిపి నాట్యం చేస్తాం.

స్వార్ధంకోసం..
తొలిచిన గుండెల తంత్రులు మీటి .. 
తన్మయులవుతాం .. విణాగానమంటాం
కృతులను చేర్చి కృతార్ధులవుతాం.

స్వార్ధంకోసం..
కాల్చిన తోలును కర్రతొ బాది..
గంతులు వేస్తాం.. ఢంకానినాదమంటాం
గొంతులు కలిపి గీతాలంటాం.

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః
నిజమే.. కానీ..
వాటి గాయాలకి .. చెమర్చే కళ్ళెన్నీ ?



Monday, March 2, 2009

క్షమించవూ...


తప్పెవరిదైనా చెలీ తపనిద్దరిదీ
తగువేదైనా సఖీ మధనిద్దరిదీ..

కదిలే పాదాల మధ్య పెరిగే దూరాలు మనవే
రగిలిన వాగ్యుద్ధాల మధ్య నలిగే హృదయాలూ మనవే
మూగ బాసల సంభాషణల్తో నిండిన అగాధాలు మనవే
కనుసన్నల సంజాయిషీలలో పెరిగిపోయిన అపోహలూ మనవే ! .. తప్పెవరిదైనా...

అలిగి అటు తిరిగిన నేత్రాల్లో పొగిలే చలమలూ మనవే
విరిగిన పెదవుల సందుల్లో వంగిన భావాలూ మనవే
కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే
మన కలల ఖైదుల్లో జీవిత బందీలూ మనమే! .. తప్పెవరిదైనా...

మనమల్లుకున్న స్పర్ధల సాలె గూళ్ళల్లో
బరువెక్కిన గుండెలు వేళ్ళాడాల్సిందేనా ?
మనం కట్టుకున్న దర్పాల కోటబురుజుల్లో
బందీగా భావాలిలా పతనమనాల్సిందేనా ? ! .. తప్పెవరిదైనా...

తప్పులు పట్టే తత్వాన్నొదిలి
ఒప్పును చెయ్యగ పరుగున చేరా
అక్కున చేర్చగ చేతులు చాచి
రెక్కలు గట్టుకు దగ్గిర వాలా ! .. తప్పెవరిదైనా...


Tuesday, February 17, 2009

అమాయకంగా ఆ ప్రశ్నలేమిటి ?

చిరుగాలికి రెపరెప లాడుతు
నీ కళ్ళకు అడ్డంపడుతు
నా చూపుతొ దోబూచాడే
ఏ కడలి ఎరుగని నీ కురుల అలలకు
అడ్డం కట్టు..

చెప్పేందుకు తికమక పడుతు
నీ మాటలు తడబడనిస్తు
నా మనసును గిలిగింతెట్టే
ఏ తుమ్మెద ఎరుగని మధు కలశాలను
అదుపులో పెట్టు..

చిరు సిగ్గులు కురిపించేస్తూ
సంధ్య కాంతులు విరజిమ్మేస్తూ
మనసు భావాలకు అద్దంపట్టే
ఏ ముఖము ఎరుగని నీ చెక్కిలి అద్దము
దూరం పెట్టు...

అల్లలాడుతూ కవితలు రేపుతూ
అలకకి కూడా అందానిస్తూ
మనసు హాయిలో ఓలలాడించే
ఏ నింగి ఎరుగని తారలా కన్నులు
అబ్బ! ... అవతలికి తిప్పవూ..

చెలివని నీకు చనువును ఇస్తే
చేసే చేష్టలు అన్నీ చేస్తూ
నేనేం తప్పుని చేశానంటూ
అమాయకంగా ఆ ప్రశ్నలేమిటి ?

==================================


cirugaaliki reparepa laaDutu
nee kaLLaku aDDampaDutu
naa cuuputo dObuucaaDE
E kaDali erugani nii kurula alalaku
aDDam kaTTu..

ceppEnduku tikamaka paDutu
nee maaTalu taDabaDanistu
naa manasunu giliginteTTE
E tummeda erugani madhu kalaSaalanu
adupulO peTTu..

ciru siggulu kuripincEstuu
sandhya kaantulu virajimmEstuu
manasu bhaavaalaku addampaTTE
E mukhamu erugani nii cekkili addamu
duuram peTTu...

allalaaDutuu kavitalu rEputuu
alakaki kuuDaa andaanistuu
manasu haayilO OlalaaDincE
E ningi erugani taaralaa kannulu
abba! ... avataliki tippavuu..

celivani neeku canuvunu istE
cEsE cEshTalu annee cEstuu
nEnEm tappuni cESaananTuu
amaayakamgaa aa praSnalEmiTi ?

Thursday, January 29, 2009

ప్రేమ

చెలియ చింతన చెక్కిళ్ళు కడిగె
మనిషి చింతన కన్నీళ్ళ మునిగె
మనసున మొలిచెను పచ్చని ఆశలు
గతమును విడమనె వెచ్చని బింబము

విధి పరిచిన వల ఈ గతము
గడచిన ఘడియలు వేసిన ముడులవి

రమ్మని పిలిచెడి ప్రేమొక ఎర
పదునగు కత్తిని దాచిన ఒర

అందని ప్రేమకు బ్రతుకుని చంపకు
అందిన ప్రేమను బ్రతుకని చెప్పకు
బ్రతుకున ప్రేమొక భాగము ఎరుగుము
గతమొక బాధల బ్రమయని తెగడుము

చెమరిన కన్నులు తుడిచే సమయం
బ్రతుకును ముందుకు నడిపే తరుణం
గగనపుటంచులు తాకే సమయం
అదిగో చూపెను కనబడు ఉదయం
http://pruthviart.blogspot.com/2009/01/blog-post_28.html కు నేను రాసిన స్పందన

Thursday, January 15, 2009

తనివి

తనివి తీరు సఖియా
నీ మనసు నిండు చెలియా
గత జన్మ బంధమీ అనురాగం
విడిపోని గంధమీ అభిమానం

ఉన్నది ఎడారి ఐనా గానీ
నీతో ఉంటే వసంత మేగా
నింగిన మబ్బులు నిండిన గానీ
నిండగు పున్నమి ముంగిలి లేదా ! తనివి..

వెచ్చని కౌగిలి కరిగిపోయినా
తరగని కాలము మనదరి లేదా
తీయని హృదయపు తేనెలుడిగినా
మధువులు ఊరే అధరము లేదా ! తనివి..

శృతి రాసిన "తనివి తీరలేదే" http://manaanubhoothulu.blogspot.com/2009/01/blog-post_15.html
కు నా స్పందన

మళ్ళీ వస్తా

నా తలపుల చేష్టలు తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం ఎరగనప్పుడు
నా నిఘంటువులెందుకు ? నీ జీవిత బాస లెందుకు ?

తెలిసిన భాషలొ వచ్చిన భావం చెప్పాననుకున్నా
నువు నా మాటలవెనకన అర్ధం తవ్వి
గుండెని తడిమానని గంతులు వేస్తావనుకున్నా
అందుకు మురిశా.. కానీ మరువం,

వ్యక్తం చేసే తీరు నచ్చక విరక్తి తోనువ్వు విరుగుతావంటే
ఎప్పటిలానే భావం గొంతును నొక్కేవాడిని
ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడిని.
నాకది కొత్తేం కాదు

ఎప్పుడుతెలుసుకుంటావు అని అడిగావుగా ?
నన్నంత అర్ధం చేసుకున్నావన్న మాట
అదితెలెసేగా, వచ్చిన భావాల్ని నిఘంటువులెతికి మరీ
ధైర్యం కూడగట్టుకుని చెప్పచూసింది

నా మూగ రోదనలకిక సమయం లేదని
కరిగే కాలం చేతికి రాదని తెలిసేగా మరువం
మనసు విప్పినది. ఎప్పటి లాగే గుండె గాయపడినది
మిన్నిరిగిపడి మూలుగుతున్నది

మరో ప్రయత్నం చేసే లోపల ఇదిగో మరువం నీకో సలహా
గుండెలో ప్రేమే మెండుగ ఉంటే మూగ చూపులే కావ్యం చెప్పును
ఇప్పటికైనా చెప్పేదాంట్లో తప్పులు చూడకు. ఐనా నీకోసం,
నా బాష మార్చుకుని మళ్ళీ చెప్తా. మళ్ళి మళ్ళి వస్తా.


ఉష గారు http://maruvam.blogspot.com/2009/01/blog-post_15.html రాసిన కవితకు నా స్పందన.

Thursday, December 4, 2008

కొత్త జగతికి పునాదులేద్దాం

కన్నీళ్ళను తుడిచేసినా
చిరునవ్వులు పూయించినా
రహదారిన నడిపించినా
నీ కోసం కాదది నేస్తం

నీ కష్టం చూసి చెమరే కళ్ళివి
ఆ బాధను తెలిసి పగిలే ఎదయిది
నాన్న అన్నల ప్రేమల కన్నా
సడలక అల్లిన స్నేహమిది

గతమని బేలగ సద్దుకుపోకు
రుణమని చేతులు దులుపుకు పోకు
చీలికలయ్యే నీ బ్రతుకును చూస్తూ
చింతను ఒదిలి ఏల మనగల?

ఆరేదీపానికి అడ్డుగు పెట్టిన
చేతులు నెట్టుక్కు పక్కకు పోకు
స్నేహం అర్ధం తెలిసిన మనుషులు
కోటికి ఒక్కడు లేని జగతిది

మంటలొ నిన్ను ఒదిలై అంటె
వింటానని నీ కెంతటి ఆశ ?
నీ నీడను గుండెలొ నింపినవాడిని
వదిలై అంటే ఏమైపోను ?

ముత్యము వంటి నిన్ను ఒంటరిగ
పందుల ముందు ఒదలను నేస్తం
చేయిని కలిపి నాతో నడువు
కొత్త జగతికి పునాదులేద్దాం !!

శృతి గారి "వెళ్ళిపో నేస్తం " కవితకు నా స్పందన
http://manaanubhoothulu.blogspot.com/2008/12/blog-post_7433.html


kanneeLLanu tuDicEsinaa
cirunavvulu puuyincinaa
rahadaarina naDipincinaa
nee kOsam kaadadi nEstam

nee kashTam cuusi cemarE kaLLivi
aa baadhanu telisi pagilE edayidi
naanna annala prEmala kannaa
saDalaka allina snEhamidi

gatamani bElaga saddukupOku
ruNamani cEtulu dulupuku pOku
ciilikalayyE nee bratukunu cuustuu
cintanu odili Ela managala?

aarEdeepaaniki aDDugu peTTina
cEtulu neTTukku pakkaku pOku
snEham ardham telisina manushulu
kOTiki okkaDu lEni jagatidi

manTalo ninnu odilai anTe
vinTaanani nee kentaTi aaSa ?
nee neeDanu gunDelo nimpinavaaDini
vadilai anTE EmaipOnu ?

mutyamu vanTi ninnu onTariga
pandula mundu odalanu nEstam
cEyini kalipi naatO naDuvu
kotta jagatiki punaadulEddaam !!

Tuesday, December 2, 2008

చెంతకు రాకే చందన గంధీ !!

పట్టుపరికిణీ బొట్టూ కాటుక
బుగ్గన నొక్కు చక్కని నవ్వు
ఘల్లను గజ్జెలు సిగన మల్లెలు
సిగ్గును పంచుతు కళకళ లాడుతు
ముస్తాబయ్యిన తమరి ఊహలే

చిత్తరువయ్యి యెదలో చేరి
ఇంతటి అలజడి రేపగలిగితే
నాలో పైత్యము పెంచగలిగితే
నువ్వే కొంచెము కనికరమంది
చెంతన చేరి కుశలమడిగితే ?

తట్టుకునెను నిలబడగలనా ?
ఎండు కట్టెలా బిగుసుకుపోనూ
మాటలు రాక తడబడిపోనూ
అందుకె పెట్టక నన్నిబ్బంది
చెంతకు రాకే చందన గంధీ !!

paTTuparikiNee boTTuu kaaTuka
buggana nokku cakkani navvu
ghallanu gajjelu sigana mallelu
siggunu pancutu kaLakaLa laaDutu
mustaabayyina tamari uuhalE

cittaruvayyi yedalO cEri
intaTi alajaDi rEpagaligitE
naalO paityamu pencagaligitE
nuvvE koncemu kanikaramandi
centana cEri kuSalamaDigitE ?

taTTukunenu nilabaDagalanaa ?
enDu kaTTelaa bigusukupOnuu
maaTalu raaka taDabaDipOnuu
anduke peTTaka E ibbandii
centaku raakE candana gandhii !!

Monday, December 1, 2008

ప్రేమ - ప్రగతి

వేదన వేడిని సాధన చెయ్యి
ప్రగతి పధానికి పునాదినెయ్యి
విరిగిన గుండెను బలిచేసెయ్యి
బ్రతుకును గెలుపుగ మలిచేసెయ్యి

గడవని రాత్రులు గుండెను కోస్తే
భయపడి నడకను ఆపకు నేస్తం

మబ్బులు సూర్యుని కప్పినరోజు
ఉదయం నీకిక రాదని కాదు
చీకటి నిండిన గ్రహణము నాడు
పున్నమి చంద్రుడు రాడని కాదు

కాలం కాటుకు ఒగ్గిన తలతో
చీకటి మాటున అజ్ఞాతములో
మెల్లగ సాగే నడకల సవ్వడి
పరుగుగ మార్చే సమయం ఇప్పుడు

అబ్బురపెట్టే వెలుగు తోడుగా
మబ్బులు విడివడి ఉదయం అదిగో
గగనపు ఎత్తులు నీవే నంటూ
గ్రహణం వీడిన పున్నమి అదిగో

vEdana vEDini saadhana ceyyi
pragati padhaaniki punaadineyyi
virigina gunDenu balicEseyyi
bratukunu gelupuga malicEseyyi

gaDavani raatrulu gunDenu kOstE
bhayapaDi naDakanu aapaku nEstam

mabbulu suuryuni kappinarOju
udayam neekika raadani kaadu
ceekaTi ninDina grahaNamu naaDu
punnami candruDu raaDani kaadu

kaalam kaaTuku oggina talatO
ceekaTi maaTuna ajnaatamulO
mellaga saagE naDakala savvaDi
paruguga maarcE samayam ippuDu

abburapeTTE velugu tODugaa
mabbulu viDivaDi udayam adigO
gaganapu ettulu neevE nanTuu
grahaNam veeDina punnami adigO

మౌనం

మాటలు పెదవులు దాటకపోతే
తలపులు మదిలో లేవని కాదు
ఆశను ముఖతా తెలుపకపోతే
యెదలో అలజడి లేదని కాదు
భావము బయటకు పెగలకపోతే
భారము హృదిలో లేదని కాదు

రగిలిన గాయం మానేటందుకు
కాలం నదిలో అడ్డమీదుతూ
మౌనం మందును మనసుకు పులిమి
ముందుకు సాగే పయనం నాది

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

మౌనం మందును మనసుకు పులిమి
ఆగక సాగే పయనం నాది


maaTalu pedavulu daaTakapOtE
talapulu madilO lEvani kaadu
aaSanu mukhataa telupakapOtE
yedalO alajaDi lEdani kaadu
bhaavamu bayaTaku pegalakapOtE
bhaaramu hRdilO lEdani kaadu

ragilina gaayam maanETanduku
kaalam nadilO aDDameedutuu
mounam mandunu manasuku pulimi
munduku saagE payanam naadi

Opika paTTE samayam lEdu
aavali teeram darilO lEdu
ukkiri bikkiri cEsE alalaku
bhayapaDi aagE taruNam kaadu

mounam mandunu manasuku pulimi
aagaka saagE payanam naadi

Friday, November 28, 2008

గతం ఒడ్డు

గతం ఒడ్డున
ఏకాంతం తో నా నడక

ఏకాంతం ఎంత భారమో
అడుగుల గుర్తులు
లోతుగా కనిపిస్తున్నాయి

గతం నుండి కలలు
అలలై కాళ్ళు తడుపుతున్నాయి
ఆ గుర్తుల్ని తనలో
ఆబగా కలుపుకుంటున్నాయి

ప్రస్తుతం కాళ్ళ క్రిందినించి
కరిగి జారిపోతుంది
ఒక్క క్షణం ఆగుతాను
కాలం వేడికి కాళ్ళు ఆరిపోతాయి
కల కనుమరుగవుతుంది
కాళ్ళక్రింద మరో ప్రస్తుతం

నా అస్థిత్వపు గురుతులు
వెనక ఒదులుకుంటూ
ఆరే కాళ్ళను చూసుకుంటూ
ఏకాంతం తో నా నడక
తిరిగి మొదలవుతుంది

కలలు ఆగవు
కాలం ఆగదు
కాళ్ళూఅగవు
ఏది ఆగినా
రుణం తీరినట్లే


gatam oDDuna
Ekaantam tO naa naDaka

Ekaantam enta bhaaramO
aDugula gurtulu
lOtugaa kanipistunnaayi

gatam nunDi kalalu
alalai kaaLLu taDuputunnaayi
aa gurtulni tanalO
aabagaa kalupukunTunnaayi

prastutam kaaLLa krindininci
karigi jaaripOtundi
okka kshaNam aagutaanu
kaalam vEDiki kaaLLu aaripOtaayi
kala kanumarugavutundi
kaaLLakrinda marO prastutam

naa asthitvapu gurutulu
venaka odulukunTuu
aarE kaaLLanu cuusukunTuu
Ekaantam tO naa naDaka
tirigi modalavutundi

kalalu aagavu
kaalam aagadu
kaaLLuaagavu
Edi aaginaa
ruNam teerinaTlE

Wednesday, November 26, 2008

జననం

నీ అడుగుల దూరం పెరిగేకొద్దీ
ఎదలో అలజడి
గుండెల్లో ప్రసవ వేదన
కన్నుల్లో భారం
నీళ్ళు కట్టలు తెగుతాయి
ఓ కవిత జన్మిస్తుంది

నా చూపు తోడుగా
నీ పయనం
కనుమరుగవుతావు
చూపు కరువవుతుంది
బంధం బలపడుతుంది
మన రేపటి కోసం నిన్నట్లానే
నా ఎదురుచూపు మొదలవుతుంది
మరో కవిత జన్మిస్తుంది

రాత్రి నాకై ఎదురొస్తుంది
ఆసాంతం మింగేస్తుంది
మనసు కలల్లో ఊగేస్తుంది
ఆరాటం ఆపై శమిస్తుంది
నువ్వొస్తావు నేనుదయిస్తాను
మరో కవిత జన్మిస్తుంది



nee aDugula duuram perigEkoddee
edilO alajaDi
gunDellO prasava vEdana
kannula bhaaram
neeLLu kaTTalu tegutaayi
O kavita janmistundi

naa cuupu tODugaa
nee payanam
kanumarugavutaavu
cuupu karuvavutundi
bandham balapaDutundi
mana rEpaTi kOsam ninnaTlaanE
naa edurucuupu modalavutundi
marO kavita janmistundi

raatri naakai edurostundi
aasaantam mingEstundi
manasu kalallO uugEstundi
aaraaTam aapai Samistundi
nuvvostaavu nEnudayistaanu
marO kavita janmistundi

Monday, November 24, 2008

కలయిక

వేచిన సమయము పరుగిడి నడవగ
ఆగిన తరుణము వడివడి కదలగ
చూపులు కలపగ తడబడు అడుగుల
తావుకు నడిచితి మనసును తెలుపగ

అల్లరి తల్లికి నివ్వగ స్నేహము
తెల్లని మల్లెల నవ్వులు పూయగ
చల్లని కన్నుల సవ్వడి నీడన
మెల్లగ కళ్ళతొ నవ్విన తరుణము

తకధిమి తరిఝణు పదములు కదిలెను
సరిగమ పదఝరి కవితకు అమరెను
గొలుసులు సడలిన హయముల గతిగొని
మనసున కవితలు అటునిటు తిరిగెను

గడపిన రాతృల వేదన భారము
కదలని కాలపు రోదన గీతము
కరిగెను మైనపు ముద్దల లాగున
విరిసెను ఇందృని విల్లుల వైనము

తొలకరి అందిన చకోర చందము
తడిసిన బీటల బంజరు గంధము
మనసులు అల్లిన సుందర బంధము
ముదమున పొందితి కోరిన అందము !!


vEcina samayamu parugiDi naDavaga
aagina taruNamu vaDivaDi kadalaga
cuupulu kalapaga taDabaDu aDugula
taavuku naDiciti manasunu telupaga

allari talliki nivvaga snEhamu
tellani mallela navvulu puuyaga
callani cuupula savvaDi neeDana
mellaga kaLLato navvina taruNamu

takadhimi tarijhaNu padamulu kadilenu
sarigama padajhari kavitaku amarenu
golusulu saDalina hayamula gatigoni
manasuna kavitalu aTuniTu tirigenu

gaDapina raatRla vEdana bhaaram
kadalani kaalapu rOdana geetam
karigenu mainapu muddala laagaa
virisenu indRni villula vainam

tolakari andina cakOra candam
taDisina beeTala banjaru gandham
manasuna alliti sundara bandham
mudamuna ponditi kOrina andam !!

Thursday, November 20, 2008

ఇంకెన్నాళ్ళు

నిర్జన నిశీధి వీధులు కూడా
సకల కళాతోరణాలు
ఆనంద జనారణ్యాలు
... నువ్వు నా తోడుంటే !
కఠిన కర్కశ కరాళ రాత్రులు కూడా
సుస్మిత దరహాసోదయ
నిరీక్షణ సోపానాలు
.. నువ్వు నా తోడుంటే !

నువ్వు లేని ఈ నిర్జన
అపరిచిత జనారణ్యంలో
కరాళ దరహాసోదయ
పరిచయాలూ కరచాలనాలు
ఇంకెన్నాళ్ళు?


nirjana niSeedhi veedhulu kuuDaa
sakala kaLaatOraNaalu
aananda janaaraNyaalu
... nuvvu naa tODunTE !
kaThina karkaSa karaaLa raatrulu kuuDaa
susmita darahaasOdaya
niriikshaNa sOpaanaalu
.. nuvvu naa tODunTE !

nuvvu lEni ee nirjana
aparicita janaaraNyamlO
karaaLa darahaasOdaya
paricayaaluu karacaanaaluu
inkennaaLLu?