
గుర్తుకొస్తుంది..
నీ చెక్కిళ్ళ తడిలో
రగిలిన బడబాగ్ని..
కాగితమెక్కడం..
మరువలేనుగా..
చెలమ ఒడ్డున మొలిచిన
చిలిపి మొగ్గలు
మాలలవడం ..
జ్ఞాపకముండిపోదూ..
అడవినడకన
అదిరి ఆగిన అడుగులు
తాళమవడం ..
తలపుకు రావడంలేదూ ..
ఆశ సంధించిన శుభోదయాలూ..
బాధ ముంచిన సాయంకాలాలూ..
ఇవన్నీ..
చిత్తడి అడవిలో..
బెరడు గంధంలా ..
చీకటి పొదల్లో
కీచురాళ్ళ గానంలా ..
అజ్ఞాతంగా..
తాకుతున్నాయి..
జారిపోతున్నాయి..
బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
ఆస్వాదించాలనుంది..
వీటి కోసమైనా..
తిరిగి బ్రతకాలనుంది.
నీతోడు పొందాలనుంది.