Wednesday, March 11, 2009

జారే భావాలు






శరీరంలో మూడొంతులు
నీళ్ళే, కళ్ళు కాస్త ఒలికితే
అంత బాధెందుకో ..

కళ్ళ కాగడాల్లో
చమురు నిండి చెక్కిళ్ళు తడిసినా
గుండె చీకట్లు పోవు.

మల్లె మాలల్లోనూ .. మందు సీసాల్లోనూ
ఒకటే వాసన..
మనసు బాగోక పోతే.

పశ్చాత్తాపం పరిహారమైనా
అది పడె మనసుకది
నరక యాతనే అవుతుంది.

నిశ్చలంగా ఉన్న నీళ్ళలో
పడ్డ పువ్వైనా రాయైనా
లేపే కలత తరంగాలు ఒకటే.

ఆనందంలోనూ, బాధలోనూ
తడిసే కళ్ళకు, గుండె భావం
అర్ధం అయినట్టా? కానట్టా ?

నోరు గుడ్డిది, కళ్ళు మూగవి
మనసు పిచ్చిది..
మనుషులు అసంపూర్ణులు.

మెదడు ప్రభుత్వం చేతిలో
సర్వాంగాలు పావులు
సజీవ సోషలిజం..

అనాధ చినుకుల అల్లరి
నేల చేరేలోపలే
అచ్చు మనలాగే .