Monday, December 29, 2008

అడవితల్లి ఒడిలో

చింత చెట్టు ఊడలల్లో
పసిబిడ్డడి ఊయల - వ్యత్యాసాల ఊపుకి ఊగుతుంది
ఆకలి పుడకల కొంపలో
వేదన చితుకుల పొయ్యి - ఆకలి మంట మండుతుంది
వ్యతిరేకత మూకుడులో
బ్రతుకు అంబలి కాగుతుంది - ఎవరి ఆకలో తీరనుంది

గుప్పెట్లో దాచిన గుక్కెడు దాహంలా
కడుపు నిండని నిన్న, ఈరోజు మళ్ళీ
వాడి గుడిసెలోకి జారుతుంది - యముని పాశంలా

ఊదుగొట్టం లోకెళ్ళిన ఊపిరి
పొగలా గూడెం నిండుతుంది
వేగులా ఉనికిని తూటాలకిస్తుంది - ఎన్కౌంటరు పావురం ఎగురుతుంది

వాడి రేపు ఎర్రక్షరాల్లో పేపరెక్కుతుంది,
రంగు పీలికలై కాకీ చొక్కాకి అంటుతుంది
ఖద్దరు చొక్కా చేతులు కడుక్కుంది - ఎండిన డొక్క బావురంటుంది

పేదరికపు గీత పైకెగిరి జాతి పురోగతి చాటుతుంది
ఈ గాయం మానకముందే

అడవిలో చింత చెట్టుకింద
మరో ఊయల వేళాడుతుంది
మరో గాడిపొయ్యి మొదలవుతుంది
వాడి గద్గద స్వరం రేగుతుంది
అడవితల్లి ఒడిలో వేగు పొగ ఎగురుతుంది
గద్దరు స్వరం సాగుతుంది
తూటాల తప్పెటా సాగుతుంది

వస్తావు కదూ ?

మంచు ముసుగులో వసంతం కోసం
నగ్నంగా తపస్సు చేసే మానులా
ఋతువు ముసుగులో తొలకరి కోసం
ఆబగా ఎదురు చూసే చకోరంలా (/ఆలుచిప్పలా)
నేల ముసుగులో పుఠం కోసం
మకిలిలా ఎదురు చూసే బంగారంలా
ఆశ ముసుగులో నీకోసం
ఉలి తగలని శిలలా ఎదురు చూస్తున్నాను
కాల చక్రం నావైపు మొగ్గదని తెలుసు
ఐనా నీకోసం ఎదురుచూస్తున్నాను
వాటిని చేరిన అచంచల నమ్మకం
నా రెప్పల వెనక నీళ్ళ పొరలా ఆవహించింది
వాటినార్పి ఆశను చెక్కిళ్ళపై జార్చలేను
ఆర్పక నీ రాక మసక చేసుకోలేను
కదలని నా కళ్ళలోగిళ్ళు
సంక్రాంతి ముంగిళ్ళై రంగులమర్చుకుంది
వస్తావన్న ఆశ ఇంకా నా కళ్ళనిండా ఉంది
వస్తావు కదూ ?



mancu musugulO vasantam kOsam
nagnamgaa tapassu cEsE maanulaa
Rtuvu musugulO tolakari kOsam
aabagaa eduru cuusE cakOramlaa
nEla musugulO puTham kOsam
makililaa eduru cuusE bangaaramlaa
aaSa musugulO neekOsam
uli tagalani Silalaa eduru cuustunnaanu
kaala cakram naavaipu moggadani telusu
ainaa neekOsam edurucuustunnaanu
vaaTini cErina acancala nammakam
naa reppala venaka neeLLa poralaa aavahincindi
vaaTinaarpi aaSanu cekkiLLapai jaarcalEnu
aarpaka nee raaka masaka cEsukOlEnu
kadalani naa kaLLalOgiLLu
sankraanti mungiLLai rangulamarcukundi
vastaavanna aaSa inkaa naa kaLLaninDaa undi
vastaavu kaduu ?