Thursday, March 12, 2009

చినుకులు


రెండు చుక్కలు జారి
భావానికి రుచి పెంచాయి
ప్రకృతి ఎంత రమణీయం ?

మనసు ఎడారిలో
కంటి చెలమలు.. జ్ఞాపకాలు
కాక్టస్సులై మొలిచాయి..

గడ్డిపోచ మీద చినుకు,
వేచి ఉంది. రెండో దానికి స్థానమివ్వడానికి
రెప్పమీద ఉప్పు బొట్టులా

సముద్రుడి నోటి నిండా
ఉప్పు నీరే... జాలేస్తుంది..
ఎన్ని బాధలు పడ్డాడో ?

కవులకి రుచుల మీద
పెద్ద పట్టులేనట్టుంది.
అందుకే భావాలు చేదంటారు.

ఆశాసౌధాలు.. గాలి మూటలు
నీటి రాతలు.. రుచి ఒక్కటే ఉన్న
భావానికి ఎన్ని పేర్లో ..?

"ఏడిసి నట్టుంది "
ఎంత తేలికగా వాడతాం ..
జీవిత పాఠమేమో ?

దిగులో గని లాంటిది
తవ్వే మట్టెక్కువ, దిగే లోతెక్కువ
అసలు బ్రతుకు పైనే వదిలేస్తాం

తడి కళ్ళల్లో తేలాడిన
పదాలు, రెప్ప వాలే సరికి
కాగితం పైకి ఉరికాయి

నింగి నేల నెరుగు
కన్ను పెదవి నెరుగు
నీరు పల్ల మెరుగు

పెనవేసుకున్న చూపులు
చెయ్యగలిగిందేమీ లేకేమో
చటుక్కున కరిగిపోయాయి

ఆశ తీరక కన్నీరొలికినా
రగిలే ఆశపై నీరు చిలికినా
ని(నీ) రాశేగా..మిగిలేది

చావు పదవి గెలవటానికి
బ్రతుకంతా కష్టపడాలి.
అదొస్తే జనాలేడుస్తారు.. ఈర్ష్య !!