Tuesday, January 13, 2009

ఎదురు చూపు - ఒకటవ భాగం

వణుకుతున్న కిటికీ తలుపులు గొళ్ళెమేయమని చేసే గొడవ ...
రోజు మారకముందే చిరిగి ఎగిరేలా హడలుగొట్టే గోడ కాలెండరు ...
ఇల్లంతా తనదన్నట్టు సొదా చేస్తూ ఈలలు వేసే ఈదురు గాలి...

అలిసి నేలరాలి, అంచు చేరిన అలల్లా తిరిగి ఎగిరే దుమ్ము వృత్తాలు ...
తిండిదొరక్క పల్లెపై పడ్డ గున్న ఏనుగుల్లా నింగి చేరిన నల్ల మేఘాలు...
దూరంగా చావు డప్పులా వస్తు పోతు వినిపించే తుఫాను హెచ్చరిక...

సముద్ర తీరమది
దూరంగా ఒంటరి ఇల్లది
ఒకప్పటి సాయంత్రం కధ ఇది

అటునిటు తిరుగుతు ఆతృత చెందుతు అడుగుల సవ్వడి కొరకై వెదుకుతు
వడివడి పరుగిడి ద్వారము చెంతన తనపతి కానక వికలం అగుసతి

మారాం చేస్తూ నాన్నేడంటూ గారాం పోతూ రాడేఅంటూ
మాకూ నాన్నే కావాలంటూ కొంగుల్లాగే బిడ్డల్నాపి పోరా
పోరా పోపొమ్మంటూ విసుగును చూపి కసిరే అమ్మ

హోరును పెంచిన ఈదురు గాలులు, జోరును సాగిన వాన ధారలు
కడలిలొ పెరిగిన అలల జలాలు, సడలిన పిల్లల గుండె బలాలు,
పెరిగిన ఆతృత మనసులనుండి ఆప్యాయతగా పారిన సమయం
నింగిన నిండిన నల్లని మబ్బులు, ఇమడక గుండెలొ జారిన తరుణం

అమ్మ రెక్కలో దూరిన పిట్టలా, భయపడి నక్కిన పిల్లలు పక్కన
అమ్మను చూస్తూ నాన్నేడంటూ వణికే స్వరమున మళ్ళీ అడిగితే
జవాబు తెలియక తనకీ కానక సతమతమయ్యెను పాపం ఆమె
నిండిన కన్నుల జారే ధారలు వీధికి అద్దిరి అందరి చూపులు

మెరుపు దెబ్బకి ముక్కలు కాగా నింగి తునకలు శబ్దం చేస్తూ
పెరటి మూలగల విద్యుత్‌ పెట్టెపైగూలి చూపెనిక కాంతుల చిందులు
అప్పటివరకు వెలిగిన దీపము ఎదురు చూపుల గుంపున కలిసి
ఎవరికోసమో తెలియక పోయినా వీధిని చూస్తూ నిలబడి ఉంది.

బయట చీకటి ఇంట చీకటి
కంటి రెప్పలను దొప్పలు చేసిరి
ఆశను నూనెగ అందున నింపిరి
ఆతృత ఒత్తిగ అందుకు నేసిరి
మండె గుండెల జ్వాలను తీసిరి
ప్రేమను దీపము నట్టింటెట్టి

తండ్రి కోసమా తనయుల చూపులు
భర్త కోసమా అమ్మడి ప్రార్ధన



(సశేషం ... )

వాన ఆగేనా ? కలత తీరేనా ?
ఆశతీరేనా ? అతను వచ్చేనా ?

రెండో భాగంలో చూడండి

4 comments:

  1. ఇంత చిన్న సంఘటన ఇంతాగాపొడిగించి చదువాలనే ఆసకు హద్దులులేకుండాచేసారే..తీపితియ్యనిదనం ఇంత అని చెప్పలేనంత బాగావుంది మీ వివరణ..అనుక్షణం అర్దాలు ఆసక్తికరం..

    ReplyDelete
  2. దొప్పను చేసిన కాంటికి తెలుసా
    కాటువేసే కటిక చీకటని
    నూనెగ మారిన ఆశకు తెలుసా
    జారిపడే గతుకుల బ్రతుకని

    తెలిసినదొక్కటే

    కలసి రాని కాలాన్ని తోడుగా
    రమ్మని
    గుండే వాకిట ఆశల నెగడు
    వేసి
    గాలమేసి అదృష్ట తిమింగలాన్ని
    అందుకోవడం
    గెలుపెవరిదో వేచి చూద్దాం
    రేపటి వెలుగెవరిదో తొంగి చూద్దాం

    ReplyDelete
  3. వర్మగారు శృతిగారు మీ స్పందనకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు చదివిన వివరణల వెనక కనపడని వివరణ ఉంది. ఏమిటంటారా..

    మొదటి లైను.

    వణుకుతున్న కిటికీ తలుపులు కనురెప్పలు
    అవి అలిసి విశ్రాంతి తీసుకోమంటున్నాయి ... వారి ఆతృత చెపుతున్నాయి
    గోడ కాలెండరు - అదిరే వారి గుండెలు - ఈ రాత్రి దాటక ముండే
    తన వారు రావాలని తను పగలక మిగలాలన్న ఆత్రం చూపుతుంది
    వాళ్ళు తీసే వేడి శ్వాస వాళ్ళ ఇల్లంతా తిరుగుతూ శబ్దం చేస్తూ
    బయటకొచ్చే వాళ్ళ నిట్టూర్పులు. వారి నిరాశ పెంచుతొండి
    దుమ్ము వృతాలు పరి పరి విధాలుగా రేగి చల్లారి సమాధాన పడే
    వాళ్ళ ఆలోచనలు..

    ఇలా... పోలికలు చేసుకుంటూ పోతే ఇక్కడ ఉన్న కొన్ని పదాలే పెద్ద కధనే
    చెపుతాయి.

    కవిత వివరించి మీ ఆలోచనలను కించ పరచ దలుచుకోలేదు. ఇక పజిల్‌ మీరే విప్పుకోండి.

    మీకు మరో సారి ధన్యవాదాలు.

    ReplyDelete
  4. ఆత్రేయ గారు,
    తప్పుగా అనుకోవద్దు. మీ భావాన్ని అర్దం చేసుకున్నాను. అందుకే చీకటిలొ ప్రమాదాన్ని గుర్తించనంతగా, ఆశతో, తమచేతుల్లో ఏమిలేదని తెలిసినా మంచి కోసం ఎదురు చూస్తున్నారని నా భావం. ఆ అదృష్టమే ఎదురు చూపుల పాలిటి తిమింగలమని అనుకుంటున్నాను.
    పొరపడి ఉంటే క్షమించండి.
    ఊరుకోండి గురువు గారు! మీరు మమ్మల్ని కించపరచడం లేదు, విషయం వివరిస్తున్నారు. ఇలా వెళ్లాలి అని ఒక దారి చూపిస్తున్నారు.
    మీ వివరణకు శిరసాభి వందనాలు

    ReplyDelete