Tuesday, September 29, 2009

దాహం


అనుభవాల శిధిలాలనూ,
గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన
సౌధాల మధ్యగా..
అనుబంధాలు అణచి మొలిచిన
వృక్షాల మధ్యగా..

ఆ నీడకు మురిసేదెలా ?
ఈ అందాలను ఆస్వాదించేదెలా ?

ప్రతి మలుపు వేసుకున్న
మేలిమి ముసుగు వెనక
దేనికోసమో వెదికే కళ్ళకు
ఏమి చెప్పను ?

క్రొత్త దారుల్లో..
పాత గుర్తులు దేవుకుంటూ..
నిర్లిప్తంగా..నా పయనం !

ఈ సాగర సరంగు దాహమెప్పటిదో!
తీరమెప్పటికో !!?


Thursday, September 10, 2009

వానా వానా...




నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటె
పిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..

గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటె
తాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ...

ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లు
వెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.

వాన నాప పురిని విప్పి అడ్డుకున్న నెమలి గారి
ఈక తడిసి తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి,

చుట్టుతిరిగి చూరు చేరు పిచ్చికమ్మ ఆపలేక
తలను తీసి రెక్కలోన దాచి పెట్టి నవ్వుకుంది !!

ఈనెల ఈమాటలో http://www.eemaata.com/em/issues/200909/1462.html


Wednesday, September 9, 2009

నాకింకేమీ వద్దు !


అసంకల్పితంగానే ఎంత మారాను ?
అయిష్టంగానే ఎన్ని కోల్పోయాను !!

ఆ లేత చేతులూ, నిర్మల హృదయం..
అమాయకత్వం.. ఏవీ ?

ఒద్దనుకున్న సంగమానికి
ఏమిటీ ఒరవడి ? ఎందుకీ పరుగు ?

ఆశల పగ్గాలకి చిక్కిన..
అసంతృప్తి బ్రతుకు పయనం.. ఎవరికోసం ?

ఈ ప్రస్తుతమొద్దు..
చూడని భవిష్యత్‌ వసంతాలసలొద్దు..
గతించిన గతంలోకి పున:ప్రవేశమిక వద్దు..

జనసముద్రంలో నాకై తపనతో విదికే
ఓ రెండు కళ్ళకోసం నేవేచిన
నా పసితనం చాలు..

నాకింకేమీ వద్దు !!

కౌముదిలో ఈ మాసం చిన్న మార్పులతో.. http://koumudi.net/Monthly/2009/september/index.html

Monday, September 7, 2009

దొరకని ప్రేమ..


చిరు దీపపు వెలుతురులు
అటు వైపూ .... ఇటు వైపూ.

తక్కెడలోని బరువులు , అవిశ్రాంతంగా..
ముల్లును కదుపుతూనే ఉన్నాయి..

రెండు విల్లులు విడిచిన
ఒకటే బాణము..
తపనలు తెలియకేమో ..
తగల కుండా .. దూసుకు పోయింది.

జారి పడ్డ ఈకలు ఏరుకుని
రంగులో ముంచి
రంగరించుకుంటున్న నాకు,

కరిగిన రాత్రి,
రెల్లు గడ్డి మీద...
చల్లగా తగిలి
మేల్కొలిపింది.