ప్రపంచమేలే ధరణీ నాధుడు
కొండ బండలో నాకగుపడరాడు
పాపం పుణ్యం ఎరుగని పాపడు
ఫక్కున నవ్వి పళ్ళికిలిస్తూ
ప్రక్కన చేరి కన్నులు కలిపితే
అప్పుడగుపడుతాడేఈశ్వరుడైనా ..
చక్కగ తలపై లాలబోసుకుని
తుడిచే తలను నిలపక తిప్పుతు
ఆ బుజ్జి చేతుల పికబూ లల్లోనే
అగుపడుతాడేఈశ్వరుడైనా ..
గోడబట్టుకుని నిల్చుట నేర్చి
ఒడుపును విడి చతికిల బడి
ఆ బుంగ మూతి దొంగేడుపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..
తపతప మని అడుగులు వేస్తూ
త్వరగా పరుగిడి బోర్లా పడి
తిరిగిలేచి విసిరే గర్వపు చూపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..
తప్పని నరకము బ్రతుకున గంటూ
అమ్మా అన్న ఆర్తి పిలుపుకు పరుగున వచ్చి
తలనొడిలో చేర్చి నిమిరే కంటిలొ
రాలేచుక్కలో అగుపడుతాడేఈశ్వరుడైనా..
ఆకలి కడుపులు ఎండిన రొమ్ములు
బువ్వడిగే ఓపికలేక..లోతుకళ్ళతో లోకంచూసే
బీద తల్లికి అన్నం పెట్టి అక్కున చేర్చే
ఆ ఆగంతకుడిలో అగుపడుతాడేఈశ్వరుడైనా..
ప్రేమ పంచన, ప్రకృతి అంచున
ప్రాగ్దిశ ఝామున, పశ్చిమ సంధ్యన
పాప నవ్వులో విరిసిన పువ్వులో
కరిగిన గుండెలో, తడిసిన కంటిలో
అగుపడుతాడేఈశ్వరుడైనా..
అగుపడుతాడేఈశ్వరుడైనా..
ఎక్కడ లేడని.... కానీ..
నాకగుపడేదా చెప్పిన చోట్లే ...