వందన మమ్మా భారత మాతా
నువ్వు నందన వనమా అది ఎప్పటి మాటా
కన్నుల ధారలు ఎండిన సుజలా
రొమ్ములు దన్నిన బిడ్డల సుఫలా
కకృతి శ్వాసల కలుషిత శీతలా
మతమత్తులు జల్లిన రుధిర శ్యామలా !! .. వందనమమ్మా..
కక్షలు చీల్చిన గుండెల జ్యోత్స్నా
చెదిరిన కలలతొ కంపిత యామినీ
పగిలిన పెదవుల వికృత హాసినీ
కలుషిత నేతల ఎంగిలి భాషినీ !! .. వందనమమ్మా..
ఎరువులు మింగి చచ్చే రైతులు. శ్యామల నువ్వని ఎప్పుడు పిలవను ?
బూతులు నిండిన నేతల కోతలు. సుమధుర భాషిణి ఏమైపోయెను ?
రక్తపు రంగులు పులిమిన వార్తలు. శుఖదవు నువ్వనిఎక్కడ చెప్పను ?
కుత్తుక కోతలె జీవన భృతిగ సోలే యువతను ముంగిట చూస్తూ
వరదవు నువ్వని ఎట్లా అరవను !! .. వందనమమ్మా
అయ్యో !
తోటి తమ్ములే నోటుల కోసం దేశాన్నమ్మిన గాధలు చూసి
నిండిన కళ్ళతొ ఆక్రోశంలో గుండెలు మండి రాశానమ్మా
అన్నం పెట్టిన అమృత మూర్తివి ఆకృతినిచ్చిన అక్షయ ధాత్రివి
రోదన వశమున బాధ్యత వీడి ఎంతటి మాటలు అన్నా నమ్మా !!
ముష్కర హస్తాల్లోనూ చచ్చి దొరలకు దాశ్యం చేస్తూ వచ్చి
శృంఖల చేదన చేసిన జాతే నిలువున కాల్చుకు తిన్టూ ఉంటే
కృశించిపోతూ విషాన్ని మింగుతూ పరుషాలాడని మహా తల్లిని
నీ ఎదురు తిరిగని నైజం చూసి క్షమించేసే తత్వం చూసి
రోషం పెంచి మంచిని తెచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ
దులుపుకు పోయే తరుణం కాక తెల్లని రక్తం నాలో లేక
గుండెను పిండే మాటలు దొర్లెను కావుము తల్లీ కరుణతో నన్ను
దేశము అంటే ఎవరో కాదని రాశిగ పోసిన మనిషుల విలువని
దేశము అంటే మట్టి కాదని జనతను తెలివికి తెచ్చిన నాడు
రోషము పెరిగి దోషం కడిగి కాషాయాన్ని పక్కన వదిలి
కక్షలనొదిలి చేతులు కలిపి ప్రగతి పధానికి పునాదులేసి
తరతమ బేధం మచ్చుకి లేక పురోగమిస్తూ కదం తోక్కుదురు
అది సుజలగ సుఫలగ నిను చూసే తరుణము
అది సుఖదగ వరదగ నిను చేసే సమయం
వందన మమ్మా భారత మాతా నువు నందన వనముగ మారే దప్పుడు !!
ఆత్రేయ గారు. మీకవితలలో ఎంతటి వైవిధ్యం చూపిస్తారో. మీకు మీరే సాటి. మీరు ఒక పజిల్. ఇంకా మీనుండి అద్భుతాలను ఆశిస్తునాను.
ReplyDeletecaalaa caalaa baagundi. nijam ceppaaru mana dEsham gurinci
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteపిచ్చోడు గారు
ReplyDeleteసంయమనం వహించండి. ఇంతవరకూ మీరు పరుషంగా కామెంటిన సందర్భం చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఎంతో సరదాగా, ప్రజ్ఞతో కామెంటే మీనుంచి వచ్చిన ఈకామెంటు ను బట్టి, పై కవిత మీలో ఎంత ఆవేశాన్ని రగిలించిందో అర్ధం అవుతున్నది. i take it in right spirit only.
ఇక కవిత విషయానికి వస్తే ఇటువంటి ప్రక్రియ సాహిత్యానికేమీ కొత్తకాదులెండి. వందేమాతరగీతం వరస మారుతున్నదీ అంటూ ఓ సినీ గీతం ఉండనే ఉంది. రెహ్మాన్ గారిపై రేగిన వివాదం అందరకూ తెలిసినదే.
ఒకప్పటి దిగంబరకవులు భరతమాత చనుద్వయాలనీ వదిలిపెట్టలేదు.
ఒక గొప్ప గీతాన్ని హాస్యం కోసమో, తెగుడుతూనో పేరడీ చేయటం తప్పేమో కానీ వాస్తవ పరిస్థితుల చిత్రణకై దానిలోని పదాలను ఉపయోగించుకోవటం తప్పుకాదనే నా అభిప్రాయం.
అలా చేయటం ద్వారా మాతృగీతంలోని సుందర దృశ్యం ఎలా కాలిపోయిందో, చిద్రమయిందో పాఠకుని మదిలో ఒక రూపం దిద్దుకొనేలా ముద్రించటం జరుగుతుంది.
దీనికీ జాతీయగీతానికి/ పతాకానికి/దేశభక్తికీ లింక్ చేయటం భావ్యం కాదేమో.
ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మాతృగీతం పట్ల మనకుండే గౌరవం వల్ల. ప్రస్తుత కవితలో ఆ గీతం పట్ల ప్రకటించిన అగౌరవమైతే నాకు కనిపించలేదు. రెంటికీ మధ్య కవి ఒక కంట్రాస్ట్ చెప్పయత్నించినట్లుగానే తోస్తోంది.
బహుసా మీ కామెంటు చూసి ఆత్రేయగారు పాప ప్రక్షాళన చేసుకొన్నట్లు గానే చివరి పాదాలు చెప్పినట్లున్నాయి.
అభినందనలతో
బాబా గారూ,
ReplyDeleteనేను నిజానికి ఆత్రేయ గారి అభిమానినండీ(నేను చెప్పేది ఈ ఆత్రేయే నండీ). నేను రెగ్యులర్ గా వీరి బ్లాగు చదువుతాను. కవిత అంతా ఎంత బాగా రాశారండీ! కానీ...
"కన్నుల ధారలు ఎండిన సుజలా
రొమ్ములు దన్నిన బిడ్డల సుఫలా
కకృతి శ్వాసల కలుషిత శీతలా
మతమత్తులు జల్లిన రుధిర శ్యామలా !! .. వందనమమ్మా..
కక్షలు చీల్చిన గుండెల జ్యోత్స్నా
చెదిరిన కలలతొ కంపిత యామినీ
పగిలిన పెదవుల వికృత హాసినీ
కలుషిత నేతల ఎంగిలి భాషినీ !! .. వందనమమ్మా"
భరతమాతకు ఇలాంటి వర్ణనా??? ఆమె నవ్వును, భాషణను ఇంత వికృతం చేయొచ్చా! అమ్మ కదండీ..... ఏమో అండీ నాకు బాధ వేసింది. పరుషంగా మాట్లాడి ఇంతమందిని బాధ పెట్టినందుకు క్షంతవ్యుడను. ఉంటాను.
మన దేశం మరీ అంత హీన స్థితికి దిగజార లేదు, అది జరగదు కూడా
అయ్యబాబోయ్.... దీని గురించి ఆలోచించే కొద్దీ......... నేను సార్థకనామధేయుడ్ని ఐపోయేలా ఉన్నాను. వద్దు వద్దు ..... ఉంటాను ఉంటాను......... సారీ సారీ.......... బై బై
బాబా గారు ధన్యవాదాలు. మీరు చెప్పినంత సున్నితమైన భాషలో నన్ను నేను వివరించుకోలేక పోవచ్చు. నా వెన్ను కాసి ఉన్నందుకు మరో సారి ధన్యవాదాలు. పిచ్చోడు గారి కామెంట్లను నేను చూసే లోపలే ఆయన వాటిని తీసేశారు. ఉంచి ఉండాల్సింది. నేను భారత మాతకు అవి అన్ని జరిగినట్టు చూసి స్పందించాను. ఆయన నా రాత చూసి స్పందించారు. నా కవిత ధన్య మయినట్టే.
ReplyDeleteపిచ్చోడు గారు, మిమ్మల్ని కవిత బాధ పెట్టి ఉంటే, దాంట్లోని నిజాలు గుచ్చి ఉంటే, నా కవిత తన పని తను చేశినట్లే. ఇక పోతే మీరు అన్నట్టుగా నేను అమ్మను తిట్టలేదక్కడ. మీరు ఊటంకించిన పాదాలకు నా వివరణ
"కన్నుల ధారలు ఎండిన సుజలా ----------- నదులు ఎండిపోయాయని -- సుజల అంటే జలాలు పుష్కలంగా ఉన్న భూమి అని
రొమ్ములు దన్నిన బిడ్డల సుఫలా ------------ వెన్నుపోటు పొడిచిన కొడుకులుల్తో దేసం నిండిపోయింది అని --- సుఫల అంతే మంచి ఫలములు కలది అని.
కకృతి శ్వాసల కలుషిత శీతలా --------------- మలయజ శీతల అంటే చల్లని కొండగాలతో అహ్లాదాన్ని కలిగించేది అని -- కానీ దేశం కకృతి శ్వాసలతో నిండిందని నా భావం
మతమత్తులు జల్లిన రుధిర శ్యామలా --- శ్యామలా అంటే పచ్చటి పొలాలతో కళకళ లాడేది అని -- కానీ మతోన్మాదుల వల్ల ఎర్రగా మారిందన్న భావమిక్కడ
కక్షలు చీల్చిన గుండెల జ్యోత్స్నా ------- ముక్కలై మిగిలిన దేశం
చెదిరిన కలలతొ కంపిత యామినీ ------ నిరుద్యోగం, ఆకలితో అలమటించే యువత
పగిలిన పెదవుల వికృత హాసినీ -------- భ్రష్టు పట్టిన భాషా విధానం
కలుషిత నేతల ఎంగిలి భాషినీ !! ------- ఎన్నటికీ జరగని నేతల వాగ్దానాలు..
ఇలా ప్రతి పాదంలోనూ.. దేశంలో నిండిన అరాజకాన్ని ఎత్తి చూపాను గానీ
సూటిగా భారత మాతను ఏమీ అనలేదు.
ఐనా, మీలాగానే నాకూ బాధేసింది. రగిలిన గుండె ఒక వైపు, ఏమీ చేయలేని నిస్సహాయత ఒక వైపు, కర్కశమైన మాటలన్నానే అన్న అవేదన, పస్చాత్తాపం
చివరి కొన్ని వాక్యాలలో ఇమిడ్చాను.
దేశం ఎప్పు నందన వనమవుతుందో చెప్తూ ఆశను వ్యక్తం చేశాను.
మీ స్పందన సబబే, దాన్ని తీసేయకుండా ఉంచాల్సింది, నా సమర్ధిపుతొ తక్కెడ సమమయ్యేది. మీ అభిమానానికి ధన్యవాదాలు.
శృతిగారు, మీ స్పందనా బాగుంది. ధన్యవాదాలు.
అనానిమస్సు తమ్ముళ్ళూ ధన్యవాదాలు. ఈ సారి పేరుతో రండి, పేరు పేరునా ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు దొరుకుతుంది.