Monday, April 13, 2009

మూస బ్రతుకులు



దిక్కు దిమ్మెల మధ్య
జెట్టు విమానాలు కట్టిన
తెల్లాని వెలుగు తంతృల మీద
రంగు చీరలు ఆరేసిన చాకిరేవులాగా
కనబడుతున్నదా ఆకాశం ...

రేవులో ఎన్ని చీరలు వెలిశాయో
కారి కిందున్న కొలనూ రంగుల మయమయ్యింది

ప్రకృతి పగలంతా శ్రమపడి ఆరేసిన
రంగుల్ని, ఓ దొంగ, చెట్టుపుట్టలు , ఆకాశంతో సహా,
కాజేసి అటువైపు కుప్పలు పోస్తున్నాడు ..

వూరి జనం వీధి దీపాల కాంతిలో,
చమురు లాంతర్ల వెలుగులో,
పోయిన రంగుల్ని వెదుక్కుంటున్నారు..

నిరసనగా చెట్లపైన గువ్వపిట్టలన్నీ
కలిసికట్టుగా నినాదాలు చేస్తున్నాయి..

ఇవేవి పట్టనట్టు రంగు చీరల మూటగాడు
పడమటి కొండల వేనక్కి జారుకున్నాడు.

తెలిసిన దొంగ అనో, రేపొస్తాడులే అనో
అందరూ పట్టనట్టే.. ముసుగులు తన్నేందుకు
సిద్ధమవుతున్నారు.. మూస బ్రతుకుల్లో ఒదిగిపోతున్నారు