Tuesday, March 31, 2009

నీదీ ఓ బ్రతుకేనా ?


నీదీ ఓ బ్రతుకేనా
ముఖాన అచ్చేసిన అవే
పన్నెండు ఘటనలేగా..
నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా ?

ఐనా గడిచిన ప్రతి ఘటననీ
గర్వంగా గంటకొట్టి మరీ చాటిస్తావ్‌
చీకటి వెలుగులయి సమానంగా సాధిస్తావ్‌

ఎన్ని బ్రతుకుల వర్తమానలని
మింగి గతింప చేస్తావ్‌ ? విగత జీవుల్ని చేస్తావ్‌ ?
ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలు చేస్తావు?
ఎన్ని ఆశలు నిరాశలు చేస్తావ్‌ ?
నీదీ ఓ బ్రతుకేనా ?

కర్కశ మైన నీ ముళ్ళ ముఖాన్ని
గోడకు శిలువేసినా..
సుడిగుండంలా తిరుగుతూ
ప్రపంచాన్ని కబళిస్తావు ..

అవిశ్రాంతంగా.. అందరి బ్రతుకు వెనక
అగాధాలను తవ్వుతూనే ఉంటావు
నీదీ ఓ బ్రతుకేనా .. ?

నువు దాటిపోయేదాకా
నీ ముఖన్నెందుకు దాటేస్తావు ?
వస్తున్న అలికిడినీ ఎందుకు దాచేస్తావ్‌ ?
పిరికి పంద ... ఎదురొడ్డి ఓడిస్తామనేగా ..?
నీదీ ఓ బ్రతుకేనా ?

Monday, March 30, 2009

వేటగాడినా.. ?


ఇక నేనేం చెప్పను
నేనింకేం చెయ్యను ..

ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..

నా మనసు మొక్క మనుగడ కోసం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. విధినేమనను ?

నా ముళ్ళపైనే నీ కళ్ళు.. 
నీ మునివేళ్ళపైనే నా ముళ్ళు..

నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు కావూ .. ?
నీవన్నీ నావనుకున్నా.. నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ... ? అబ్బా..
ఇప్పుడే నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది.. గుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం. మరో ఎర్ర గులాబీ పూసింది ?


వేటగాడినా.. ? 
నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న .. 
పండుటాకును నేను... 
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న 
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా 
నా గత జ్ఞాపకాల కంపను నేను..


పరిమళం గారు రాసిన కవితకు నా స్పందన
http://anu-parimalam.blogspot.com/2009/03/blog-post_30.html


సిద్ధం


నీవు లేవన్న తిమిరాల నెదుర్కుంటూ
ఏకాంత దీపపు మసక వెలుతురులో
తలపులకు తాళంవేసి, ఇదే జన్మలో
మరో జీవితాం కోసం, సరికొత్త పధంకోసం
ఒంటరిగా సాగుతున్న పయనమిది..

గత గాధలు గుండె లోతుల్లో సమాధి చేసి,
మనసు గోడల బీటలు చూస్తూ
విధి రాతలవని పక్కకు తోసి
తడి కళ్ళతో చిత్తడి భవితలోని
కొత్త చిగురాకు కోసం పయనమిది..

ఓటమెదురైనా వెనుదిరగనని ..
తడికిక నా కళ్ళలో తావీయనని..
కోర్కెల అగాధాలను పరికించనని
ఒట్టెట్టుకుని.. నడక నేర్చిన శవమై
జీవం వైపుగా ఆగక సాగే పయనమమిది.

మానిన గాయాల్ని రేపడం,
నిను వదలని అలవాటేమో --
అలలారిన మనసు కొలనులో
జ్ఞాపకాలిసరడం నీ ప్రవృత్తేమో --
ఆరిన ఆశా దీపాన్ని తిరిగి
రగిలించడం నీకానందమెమో --

ఆరిన నా మన:కాష్టాలు
రగులుతున్నాయి చూడు..
ఆగిన నా రుధిరాశృవులు
జారుతున్నాయి చూడు..
సమసిన నా అంతరంగ తరంగాల
సునామీలు అవిగో చూడు..
నీ విజయ పతాకమై ఎగిరే, చిరుగుల
నా బ్రతుకు బావుటా చూడు..

నీ కళ్ళలో అదే చల్లదనం.. చంచలత్వం..
ఆ నవ్వులో అదే ఆనందం.. నిర్మోహత్వం..
నీ మాటలో అదే తీయదనం..నిర్మమతాత్వం..
ఆ గుండెలో అదే సౌందర్యం.. నిరంకుశత్వం..

నీ నవ్వు చెదరదంటే, నా గుండె
మరణ మృదంగ ఘోషలకు సిద్ధం !
నీ కన్ను చెమరదంటే, నా తలపులు
రుధిర ధారా తర్పణాలకు సిద్ధం !

వంశీ కృష్ణ గారు (http://kanushi.blogspot.com/ ) నాకు e-mail ద్వారా పంపిన చిన్న కవితలో వ్యక్తం చేసిన కొండంత భావానికి నా కొనసాగింపు..

"మానిన గాయాల్ని రేపడం
నీకు అలవాటేమో --
నీవూ లేని రోజులు గడుపుతూ
ఒంటరి క్షణాలని తోడు రమ్మంటు
గుండెనిండిన నీ తలపులకి
తాళం వేస్తూ ఒకే జన్మలో
మరో కొత్త జీవితం కై పోరాడుతున్నాను
" -- వంశీ కృష్ణ

వంశీ గారు మీ ప్రేరణకు ధన్యవాదాలు.

Friday, March 27, 2009

జ్ఞాపకాలు


నిన్నకి నేటికి మధ్య సన్నని
చీకటి సందులో, ఒదిగిన పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
రెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
కందిరీగల్లా కమ్ముకున్నాయి

గతపు తోటలు ఎన్ని తిరిగొచ్చాయో
మధుర ఘటనలు ఎన్ని తరచి వచ్చాయో
అధర సుధలతో నిదుర తుట్టెను
నింపుతూ తమకంగా తిరుగు తున్నాయి

Thursday, March 26, 2009

విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


బ్లాగు మిత్రులారా

మీకు మీ కుటుంబానికీ, శ్రేయోభిలాషులకు
విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు.


పచ్చ చీర కట్టి
కొత్త పెళ్ళికూతురులా ..
విరోధి వచ్చింది

మోడు బ్రతుకుల
ఆశ చిగుర్లు కట్టింది..
గోడు విన్నదోలేదో

వసంత రంగం మీద
మరో నాటకం మొదలు..
విరోధి నామంతో

ఆశలకెన్ని కలలో
ఏ విరోధి కలపండేనో..
ఎన్నికలొచ్చాయి

సర్వం ధరించాం
సర్వాన్ని జయించాం
వచ్చింది విరోధే

నందనం రావాలి
వికృతి నశించి
తిమిరాలు ఖరమయ్యాక

ఆశలో తప్పులేదు
పచ్చడి రుచి గుర్తుందిగా..
తీపొక్కటే లేదు

Wednesday, March 25, 2009

రోజు కాలం చేసింది.. రాత్రి ఉదయించింది.


సంధ్య సాయంత్రం ఎప్పటిలానే
పండు భానుడ్ని భుజానేసుకుని
పడమటి దిక్కుగా ప్రయాణమయ్యింది.

దారిలో చూడలేక చీకటి చేతుల్లో ముఖం
దాచుకుంటూ పొద్దు తిరుగుడు పల్లె జనాలు
బాధగా వన్నె తగ్గి తలలు వాల్చారు.

దూరపు కొండలన్నీ, ఈ రోజు, నిన్నలానే
బంగారు జరీ అంచు నల్ల దుప్పటి
కాళ్ళమీదనుంచి ముఖం పైకి లాక్కున్నాయి.

కన్నెర్ర జేసిన నింగి నుదిటిన స్వేద బిందువులు
మిణుకు మిణుకు మంటే, నోరెళ్ళబెట్టిన
చంద్రుడు పాలిపోయి సగం ముఖం దాచుకున్నాడు.

రోజు కాలం చేసింది.. రాత్రి ఉదయించింది.

నెనరులు.


కనుల కొలను కొలుకుల్లో పూసిన
ముత్యాల కలువలు, చెక్కిళ్ళు కూర్చిన
ధారల దారాల్లో ఇమడక, జారి, పెదవి
ద్వారాల్లో కరిగి మాయమవుతున్నాయి

విధి విసిరిన వేగానికి రెక్కలిరిగిన
మనసును, బంధాల లతల చేతులు
అడ్డుకోలేక, అధారమవలేక, అలసి
చేజార్చి తామిరిగి పూలవానలయ్యాయి

నారుపోసినోడు నీరు పోయడూ ...
నిజమే అదే కన్నీరు !! నెనరులు.

Sunday, March 22, 2009

మర్మం
మృత్యువు అందరూ చేరే గమ్యం ..
దాని దూరమే తెలియని మర్మం !!

బ్రతుకు బండిలో అందరి పయనం..
దాని వేగమే తెలియని మర్మం !!

బాధ్యత బరువే అందరి వీపున..
దాని భారమే తెలియని మర్మం !!

బాధల ఊబులే అందరి బ్రతుకున..
వాటి లోతులే తెలియని మర్మం !!

ఆశల వైపునే అందరి చూపులు ..
వాటి ఎత్తులే తెలియని మర్మం. !!

సుఖాల ఒడిలో అందరి నవ్వులు ..
వాటి అంతమే తెలియని మర్మం !!

దేవుడు ఉన్నాడందరి మదిలో ..
స్పర్శకు తెలియడు అదిఒక మర్మం !!

మర్మాలెనకనే వెదుకుతు పోతే ..
దాని మార్గమూ తెలియని మర్మమే !!

తెలిసిన సత్యం నిజమని ఎరిగి
తెలియని దానిని వెనకొదిలేశై .. !!
నిన్నటి రోజును గతమని మరచి
రేపటి రోజును విధికొదిలేశై ..!!

బ్రతికిన నేటిని శుచిగా గడిపితే
రాత్రికి పట్టిన ప్రశాంత నిద్రలో
కమ్మని కలలా ముడులను విప్పగ
ఉదయిస్తుందో మరో
ప్రపంచం !!

Friday, March 20, 2009

సగం చెక్కిన శిల్పంమూర్తిగ మలిచే అతనిని చేరి
తనకు తానుగా తనకర్పించి
ఉలి దెబ్బలను తనువున ఓర్చి
సగమే కరిగిన ఆ శిలలను చూస్తే

తొలిగిన ముక్కల గుట్టల మధ్యన
విరిగిన గుండె పెంకులు కనిపిస్తాయి
బండలయిన తన ఆశలు కనిపిస్తాయి
కరిగిపోయిన తన కఠినత అగుపడుతుంది
దయనీయమయిన ఓ స్థితి కనిపిస్తుంది.

తనుచేసిన తప్పిదం తనకే తెలియదు
ఏ ఉలి పొరపాటో ఆ శిల గ్రహపాటో
బండగా తన బ్రతుకంతమవుతుందని,
ఆశగ చేరిన ఆ కొండ రాయి, ఇపుడు
బండా కాదు. శిల్పమూ కాదు.

అనుకున్నట్టుగ అంతా జరిగితే
అర్చనలందుతు హారతులందుతు
అభిషేకాల్లో మునిగి తేలుతూ
ఇలవేలుపుగా ఇడుములు దీర్చుతు
ఏగుడిలోనో కొలువుండేది.

ఏపాపమెరుగని ఆ శిల, అదిగో
దుమ్ము ధూళుల అభిషేకాల్తో
మండుటెండల హారతులందుతు
చూసే నాధుడు కరువై పోయి
రెంటికి చెడిన రేవడి నేడు.

భువిలో..
అసలా అర్హతలున్న శిలలు ఎన్నో
సగమే మలిచిన శిల్పాలెన్నో
బండగ మిగిలిన గుండెలొ ఎన్నో
పూజలు అందే మూర్తులు ఎన్నో

Thursday, March 19, 2009

దేవుడెక్కడ ?ప్రపంచమేలే ధరణీ నాధుడు
కొండ బండలో నాకగుపడరాడు

పాపం పుణ్యం ఎరుగని పాపడు
ఫక్కున నవ్వి పళ్ళికిలిస్తూ
ప్రక్కన చేరి కన్నులు కలిపితే
అప్పుడగుపడుతాడేఈశ్వరుడైనా ..

చక్కగ తలపై లాలబోసుకుని
తుడిచే తలను నిలపక తిప్పుతు
ఆ బుజ్జి చేతుల పికబూ లల్లోనే
అగుపడుతాడేఈశ్వరుడైనా ..

గోడబట్టుకుని నిల్చుట నేర్చి
ఒడుపును విడి చతికిల బడి
ఆ బుంగ మూతి దొంగేడుపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..

తపతప మని అడుగులు వేస్తూ
త్వరగా పరుగిడి బోర్లా పడి
తిరిగిలేచి విసిరే గర్వపు చూపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..


తప్పని నరకము బ్రతుకున గంటూ
అమ్మా అన్న ఆర్తి పిలుపుకు పరుగున వచ్చి
తలనొడిలో చేర్చి నిమిరే కంటిలొ
రాలేచుక్కలో అగుపడుతాడేఈశ్వరుడైనా..

ఆకలి కడుపులు ఎండిన రొమ్ములు
బువ్వడిగే ఓపికలేక..లోతుకళ్ళతో లోకంచూసే
బీద తల్లికి అన్నం పెట్టి అక్కున చేర్చే
ఆ ఆగంతకుడిలో అగుపడుతాడేఈశ్వరుడైనా..

ప్రేమ పంచన, ప్రకృతి అంచున
ప్రాగ్దిశ ఝామున, పశ్చిమ సంధ్యన
పాప నవ్వులో విరిసిన పువ్వులో
కరిగిన గుండెలో, తడిసిన కంటిలో
అగుపడుతాడేఈశ్వరుడైనా
..

ఎక్కడ లేడని.... కానీ..
నాకగుపడేదా చెప్పిన చోట్లే ...

Wednesday, March 18, 2009

కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు

కుక్కలు.. నక్కలు.. పరాన్నభుక్కులు
ప్రక్కన నక్కిన పిశాచిమూకలు .

తేనెలు పూసిన నెత్తురు కత్తులు
జిత్తులు నిండిన అత్తరు మూటలు ..
నేతలు.. మన నేతలు ... .. 

దేశపు భవితను అడుసులొ తొక్కి
వేదన బ్రతుకులు మడుగులొ దించి
భూములు మింగి భోగాలందే ..! కుక్కలు .. నక్కలు.

ప్రణాలికలన్ని ప్రచురణ కొరకే
ప్రచారమంతా పరపతి కొరకే
ప్రజాపావులివి ప్రయోగపెలుకలు..! 

వాగ్దానాలకు హద్దుల్లేవు
వాగ్యుధ్ధాలకు అదుపుల్లేవు
అశ్లీలమశుధ్ధమసభ్య చేష్టల !  కుక్కలు .. నక్కలు.


నిజాయితీ అది తెలియని మాట
ప్రజాసేవ అది మరచిన మాట
జనాలు కొంటూ.. దేశాన్నమ్ముతూ..! కుక్కలు .. నక్కలు.

మగత నిద్రలో దాగిన నిప్పులు
మరిగే గుండెలొ ఒదిగిన అరుపులు
అగ్ని పర్వతమై  పగిలే రోజులు..
కుళ్ళును పూర్తిగ కడిగే రోజులు
వస్తున్నాయి వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి ..! 

తూర్పు కొండపై రుధిర జ్వాలలు
నింగిన చిందిన సింధూరాలు
పరుగులు తీసే చీకటి చేష్టలు..
సాక్ష్యాలివిగో.. సాక్ష్యాలివిగో.. ..! కుక్కలు .. నక్కలు.

ప్రపంచ రాజుల తలలను తరిగి
వెచ్చని నెత్తుటి రుచిని మరిగిన
పదునగు పరశుని భుజాన చేగొని
ఓంకారాన్ని ఢాలుగ మలచి
పరశురాముడే ప్రపంచమేలగ
ప్రభంజనంలా.. ప్రక్షాళనకై
ప్రచండ భానుడై.. వస్తున్నాడు.. ..! కుక్కలు .. నక్కలు.

Tuesday, March 17, 2009

వాన


నిండు చూలాళ్ళల నల్ల మబ్బులు 
మెల్లగా.. మండుటెండలో ..
చల్ల గాలి చేయినందుకుని.. 
సిగ్గు మెరుపుల సాన్నిధ్యంలో,
మూల్గు ఉరుముల నేపధ్యంలో..
మగ్గిన పండు సూరీడ్ని చంకనెత్తుకుని 
నింగి నిండా అల్లుకుంటూ..
మా ఊరొచ్చాయి.

పులకరింతల సమయమిదనేమో..
మండే సూర్యుడూ.. నిండు చంద్రుడై
చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.
చక్కని అందాలొలికిస్తున్నాడు.

చప్పట్లు కొడుతూ చెట్టు కొమ్మలూ..
తలలనూపుతూ పూల రెమ్మలూ
గంధాలొలికే మెల్ల గాలులూ
కిలకిలలాడుతు పక్షి గుంపులు..
తాకాలంటూ తహతహలాడే నేల కణాలూ..
అలలను రేపిన పంట పొలాలు..
పిలవక వచ్చిన తూనీగ బంధువులు..

మబ్బుల ప్రసవం కోసం 
ప్రకృతి రంగం సిద్ధం చేసింది.

ఆహ్వానించే పిల్లల నోళ్ళు..
ఆహ్లాదంగా ఎగిరే తువ్వాయి
వింజామరలతొ నెమళ్ళ నాట్యం..
శుభాన్ని పలుకుతు గిత్తల గంటలు..
చల్లగ జారే  బిడ్డల కోసం
మా ఊరూ రంగం సిద్దం చేసింది.

అందరు సిద్ధం అవడం చూసి..
నింగిన రంగుల జెండా ఎగిరే సరికి..

తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మబ్బుల లాస్యం
ఫెళ ఫెళ లాడుతు ఉరుముల జోస్యం
తకధిమి తకధిమి ప్రకృతి నాట్యం..

స్వార్ధ సంగీతంస్వేచ్చకోసం..
వెదురు గుండెల గాయాపు ఘోషను వింటూ.. 
మధురమంటాం.. వేణు నాదమంటాం..
కన్నులు మూసి ఆస్వాదిస్తాం.

స్వేచ్చకోసం..
గంట లోలకపు బరువు అరుపులు వింటూ .. 
పవిత్రమంటాం .. ఘంటారావమంటాం
చేతులు మోడ్చి ప్రార్ధన చేస్తాం.

స్వేచ్చకోసం..
ఘజ్జలొ చిక్కిన గోళీ కేకలు వింటూ.. 
తలలాడిస్తాం.. రవళులు అంటాం
కదాన్ని కలిపి నాట్యం చేస్తాం.

స్వార్ధంకోసం..
తొలిచిన గుండెల తంత్రులు మీటి .. 
తన్మయులవుతాం .. విణాగానమంటాం
కృతులను చేర్చి కృతార్ధులవుతాం.

స్వార్ధంకోసం..
కాల్చిన తోలును కర్రతొ బాది..
గంతులు వేస్తాం.. ఢంకానినాదమంటాం
గొంతులు కలిపి గీతాలంటాం.

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః
నిజమే.. కానీ..
వాటి గాయాలకి .. చెమర్చే కళ్ళెన్నీ ?Monday, March 16, 2009

ఓదార్పు


చివుక్కు మన్న మనసు శబ్దానికి
పెదవులు భయపడి మూగబోయినా
అదిరే చుబుకమూ ఒలికిన కళ్ళూ
బృకుటి ముడి వంగిన అధరాలూ
వేడి నిట్టూర్పులు వాడి చూపులూ
గుండె గాధని చిత్రంగా గీస్తాయి ..
భావ కావ్యాలనావిష్కరిస్తాయి..
బాధనూ కనువిందు చేస్తాయి

గొంతు లోతుల్లో గీతాలకు
రాగాలను కూర్చుతాయి..
అవేదనకు అనువయిన
పదాలను వెదుకుతాయి ...

జారిన చినుకులది క్షణికమని..
అవిలేని బ్రతుకు అరుచికరమని..
బ్రతుకు పాఠాలు నేర్పుతాయి !

చూపులు కలిపి సముదాయిస్తూ...
తడిసిన చెక్కిలి చుంబన చేస్తూ..
అక్కున చేర్చి ఆలంబన ఇస్తూ...
తిరిగి చేయనని ఆశ్వాసిస్తూ..
రాలిన కవితను ఆస్వాదిస్తూ..
చేసిన తప్పును దిద్దుకుంటూ..

నేను..

Saturday, March 14, 2009

రంగు రంగుల భావాలు


వసంతుడు చిటారు కొమ్మన
పచ్చ జెండా ఎగరేశాడు..
చెట్టెక్కడానికి ఇంతసేపు పట్టిందా ?

ఎక్కడో సరికొత్త రంగుల
ప్రపంచం దిద్దినట్టున్నాడు
పెరట్లో కుంచే విదిలించాడు!! దేవుడు.

చెట్లూ నాతో హోలీ ఆడుతున్నాయి
కడిగినా పోని రంగులు.
నా కళ్ళకద్దు తున్నాయి.

రంగు రంగుల నవ్వులు..
ఆ శబ్దాన్ని.. మధురంగా.. తుమ్మెదలు
దాచుకుంటున్నాయి.. రేపటికోసం.

చుప్పనాతి రెప్ప
అన్ని రంగులనీ...చటుక్కని.. నల్లగా..
క్షణంలో మారుస్తుంది..

ఏంటో మరి.. అన్నీ పచ్చగా
కనిపిస్తున్నాయి...
మనసుకి వసంతమొచ్చినట్టుంది.

పంజరంలో కోకిలకి, బోలెడు
మావి చిగురు పెట్టాను.. కూయలేదు
వదిలేశా ... పాడుతూ వెళ్ళిపోయింది.

పెద్ద పన్నీరు బుడ్డిలో
నడుస్తున్నట్టుంది.. ఒకే దాంట్లో
ఇన్ని గంధాలు ఎలా అమిరాయి ?

తెల్లారే సరికి కొమ్మల చివర
రంగు తూటాలు పేలాయి
శబ్దానికి వసంతుడు మేల్కొన్నాడు

పడమర ఓ గంట కోల్పోయింది..
తూర్పు సంబరాల్లో ముణిగింది
వసంతుడే సాక్షి

మన బ్రతుకులో లేని రంగులు
బయటనుంచి కొనుక్కొచ్చి
జనాల మీద విసిరి మురుస్తున్నం

తన సంకెళ్ళు తెంచుకుని
దొరికిన రంగులన్ని మోసుకుంటూ
తోటంతా జల్లుతుంది. సీతాకోకచిలుక

పువ్వుల ప్రేమ సందేశం
తుమ్మెదలు తీసుకెళ్తున్నాయి
ఎన్ని సఫల మవుతాయో ?

రంగు రంగు లతలు పెనవేసుకునేసరికి
పచ్చ గడ్డాలు పెరిగిన
ఋషుల తపస్సు భంగమయ్యింది


Friday, March 13, 2009

ప్రశ్నలు


బ్రతుకు పయనంలో..
ప్రతి కూడల్లో, ప్రతి మలుపులో..
అలసి ఆగిన ప్రతి అరుగు మీద.
ఆప్యాయంగా ఆహ్వానిస్తాయి .. ఆ ప్రశ్నలు..

కాలం దొర్లినా.. గమ్యాలు దాటినా..
బంధాలు వీడినా.. పంతాలు తీరినా ..
ఓడి నిలిచిన ప్రతి తరుణంలోనూ..
ఆప్యాయంగా ఆహ్వానిస్తాయి.. అవే ప్రశ్నలు..

ఎద్దేవా చేయడానికో..
ఓడావని ఎగతాళిచేయడానికో
ఓర్పేవయిందని అడగడానికో కాదు..

ఎదురీదే సాహసముంటే
సముద్రమైనా పిల్ల కాలవేననీ
పరుగులు తీసే సత్తా ఉంటే
నీ పాదాల కిందే ప్రపంచమంతా అనీ

ఊతమివ్వడానికే..
నీ ఊహ నిజం చెయ్యడానికే...
తిరిగి నీ పయనం సాగడానికే..
చివరికి గమ్యం చేరడానికే !

శివ చెరువు గారి కవిత "చివరికి " -- http://gurivindaginja.blogspot.com/2009/03/blog-post.html -- కి నా స్పందన

Thursday, March 12, 2009

చినుకులు


రెండు చుక్కలు జారి
భావానికి రుచి పెంచాయి
ప్రకృతి ఎంత రమణీయం ?

మనసు ఎడారిలో
కంటి చెలమలు.. జ్ఞాపకాలు
కాక్టస్సులై మొలిచాయి..

గడ్డిపోచ మీద చినుకు,
వేచి ఉంది. రెండో దానికి స్థానమివ్వడానికి
రెప్పమీద ఉప్పు బొట్టులా

సముద్రుడి నోటి నిండా
ఉప్పు నీరే... జాలేస్తుంది..
ఎన్ని బాధలు పడ్డాడో ?

కవులకి రుచుల మీద
పెద్ద పట్టులేనట్టుంది.
అందుకే భావాలు చేదంటారు.

ఆశాసౌధాలు.. గాలి మూటలు
నీటి రాతలు.. రుచి ఒక్కటే ఉన్న
భావానికి ఎన్ని పేర్లో ..?

"ఏడిసి నట్టుంది "
ఎంత తేలికగా వాడతాం ..
జీవిత పాఠమేమో ?

దిగులో గని లాంటిది
తవ్వే మట్టెక్కువ, దిగే లోతెక్కువ
అసలు బ్రతుకు పైనే వదిలేస్తాం

తడి కళ్ళల్లో తేలాడిన
పదాలు, రెప్ప వాలే సరికి
కాగితం పైకి ఉరికాయి

నింగి నేల నెరుగు
కన్ను పెదవి నెరుగు
నీరు పల్ల మెరుగు

పెనవేసుకున్న చూపులు
చెయ్యగలిగిందేమీ లేకేమో
చటుక్కున కరిగిపోయాయి

ఆశ తీరక కన్నీరొలికినా
రగిలే ఆశపై నీరు చిలికినా
ని(నీ) రాశేగా..మిగిలేది

చావు పదవి గెలవటానికి
బ్రతుకంతా కష్టపడాలి.
అదొస్తే జనాలేడుస్తారు.. ఈర్ష్య !!

Wednesday, March 11, 2009

జారే భావాలు


శరీరంలో మూడొంతులు
నీళ్ళే, కళ్ళు కాస్త ఒలికితే
అంత బాధెందుకో ..

కళ్ళ కాగడాల్లో
చమురు నిండి చెక్కిళ్ళు తడిసినా
గుండె చీకట్లు పోవు.

మల్లె మాలల్లోనూ .. మందు సీసాల్లోనూ
ఒకటే వాసన..
మనసు బాగోక పోతే.

పశ్చాత్తాపం పరిహారమైనా
అది పడె మనసుకది
నరక యాతనే అవుతుంది.

నిశ్చలంగా ఉన్న నీళ్ళలో
పడ్డ పువ్వైనా రాయైనా
లేపే కలత తరంగాలు ఒకటే.

ఆనందంలోనూ, బాధలోనూ
తడిసే కళ్ళకు, గుండె భావం
అర్ధం అయినట్టా? కానట్టా ?

నోరు గుడ్డిది, కళ్ళు మూగవి
మనసు పిచ్చిది..
మనుషులు అసంపూర్ణులు.

మెదడు ప్రభుత్వం చేతిలో
సర్వాంగాలు పావులు
సజీవ సోషలిజం..

అనాధ చినుకుల అల్లరి
నేల చేరేలోపలే
అచ్చు మనలాగే .


Tuesday, March 10, 2009

ఎగిరే భావాలు..
మనసు నెర్రల్లో ..
భావాలు ఇరుక్కున్నాయి
కప్పు చిల్లుల్లో వెన్నెల్లాగా..

గుండె ముంతలో ...
భావాలు దాచుకున్నాను
వాటి ఉపయోగం అది పగిలితేనే

భాష మూసలో
మనసు ఒదిగిపోతుంది..
నీటి గుంటలో ఆకాశంలా..

ఎర లేని మనసు గాలానికి
జ్ఞాపకాలు చిక్కుతున్నాయి..
గాయాలే మిగులుతున్నాయి..

మనసు ఆనందపు అంచులు
తాకుతుంది స్వేచ్చగా
ఆ ఎగిరే గాలిపటం లా..

గమ్యమెప్పుడూ..
అల్లంత దూరమే.. ఎంత నడిచినా..
భూమి గుండ్రంగా ఉందిగా..

నా మనసు బంగారు గని
తవ్వేది నేనే అయినప్పుడు
మిగలని నాకు బంగారమెందుకు?

రాత్రి నల్ల చీర కట్టిన
పగలే అవుతుంది...
ఒంటరితనం లో రెండూ ఒకటే ..

బందీ అయిన కాలం
గానుగెద్దులా తిరుగుతుంది
గడియారంలో... మనిషిని పిప్పి చేస్తూ..

గుండె గాయాలకు
కాగితాలద్ది.. ఆ మరకలని
అందంగా.. కవితలంటున్నాం ..

తడి చెంపల మీద
పదాలు నాటి
పద్యాలేరుకుంటున్నాం

నా ఆనందం
గుడ్డివాడి గుండెల్లో సూర్యోదయం
అందం చూపుల్లో ఉంటుందంటారుగా..

నిండుకుండ తొణకదు..
నిజమే నా కళ్ళు అలానే ఉన్నాయి
దూరమయ్యే నిన్ను చూస్తూ..

కరిగే మబ్బులతో
వెలిసిన వాన ఊరటనిస్తుంది.
ఈ కళ్ళు మబ్బులు కావే ?!

నీడా నిలకడగా ఉండదు..
వెలుతురుతో దోబూచు లాడుతూ
నాకెవరు అసలైన ఆధారం ..

తలపు జల్లుల్లో
తడిసేలోపే ఆశల గాలికి
గుండెలెండి పోతున్నాయి

మెరిసిన జ్ఞాపకం ..
ఉరిమిన గొంతు, కురిసిన కళ్ళు..
అబ్బ.. వాన ఎంత అందమైనదో ..

Thursday, March 5, 2009

హాయి - 2


తోడుగున్న బాధలన్ని పలచనై పోయె నేడు
గోడుజెప్పి మబ్బులన్ని కరిగి జారిపోయి నట్టు
కలల్లోని కతలు అన్ని కవితలయ్యి కదిలె నేడు
వాన బోగ పిల్లగాళ్ళు నీళ్ళలోకి ఉరికి నట్టు

నింగిలోని చుక్కలన్ని కళ్ళలోన మెరిసె నేడు
దాలిగుంట తిరిగి రగిలి చీకటింట ఎగిరి నట్టు
ఇంద్ర ధనసు క్రింద దూకి పెదవిపైన నిలిచె నేడు
రంగు కుంచె సూరిగాడు తూర్పుదిక్కు విసిరి నట్టు

చెలియ నవ్వు మోము చూసి మనసు ఊయలూగె నేడు
గాలి ఈల పాట వింటు పంటచేలు ఊగి నట్టు

Wednesday, March 4, 2009

నల్లాకాశం
కన్న కలలీడేరుతాయని తెల్లవారే ఘడియ లాయెని
తల పాపట సింధూరాలద్దగ దినకరుడొచ్చు వేళాయెనని !!

నల్ల నింగి, వెన్నెల వెలుగులో
చల్ల చంద్రుని అద్దం ముందు
మబ్బు తెరల వెనక సద్దుచేయక
చుక్కల మెరుగులద్దు కుంటూ
సోయగాలు సరిదిద్దు కుంటుంది ! .. కన్న ...

రవి ఎరుగని తన అందాలను
కలువ కన్నుల ప్రాంగణంలో,
అల్లలాడే నల్ల కురులతొ,
పెళ్ళి సిగ్గులు మొగ్గ తొడగగ
చల్ల గాలులు సలుపు తుంది ! .. కన్న ...

తూర్పు కొండపై చూపు నిలిపి
ఓర్పు తనలో సడలు తున్నా
రేపటుదయపు ఘడియకోసం
రగులే ఆశమంటలు సాక్షిజేసి
ఎదురు చూపుల పోగులేస్తుంది ! .. కన్న ...

నా గుండెల్లో గిలిగింతెడుతూ
చుట్టు తిరుగుతూ గారం పోతూ
పాట కట్టమని మారం చేస్తూ
ఆశగ చూస్తూ నిలిచిందా నల్లాకాశం ! .. కన్న ...

Tuesday, March 3, 2009

హాయి


నింగి వంగి చుంబించినట్టయింది
గుండె ఉప్పొంగి పొర్లినట్టయింది
నిండు పున్నమి శాంతి గుప్పించినట్టయింది
హాయి ఉప్పెనల్లో గుండె ఊగినట్టయింది
ఆర్తి పిలుపుకాలంబన దొరికినట్టయింది
ఆకాశపుటంచులు తాకినట్టయింది
రెక్కలొచ్చి భూమినొదిలి తిరిగినట్టయింది
ఆనందపు పూలు కళ్ళకు పూసినట్టయింది
నిశిరాత్రి రంగులతో నిండినట్టయింది
సంతోష హార్మ్యాలు కట్టినట్టయింది
విషాద చాయల్ని గెలిచినట్టయింది
విహంగమై విజయపతాక మెగిరినట్టయింది
ఆహ్లాద సౌరభాలు వీచినట్టయింది
మనసు ఇరుకు లోగిళ్ళు పగిలినట్టయింది
కష్టాల కడలిక గడిచినట్టయింది
నష్టాల ఆశకుంట పూడినట్టయింది
మొగ్గతొడిగిన మనసు విరిసినట్టయింది
క్షమయె నాముందు నిలిచినట్టయింది

నెచ్చెలి ఈరోజు ననుచూసి నవ్వింది
చచ్చిన ఓమాను చిగురాకు తొడిగింది

Monday, March 2, 2009

క్షమించవూ...


తప్పెవరిదైనా చెలీ తపనిద్దరిదీ
తగువేదైనా సఖీ మధనిద్దరిదీ..

కదిలే పాదాల మధ్య పెరిగే దూరాలు మనవే
రగిలిన వాగ్యుద్ధాల మధ్య నలిగే హృదయాలూ మనవే
మూగ బాసల సంభాషణల్తో నిండిన అగాధాలు మనవే
కనుసన్నల సంజాయిషీలలో పెరిగిపోయిన అపోహలూ మనవే ! .. తప్పెవరిదైనా...

అలిగి అటు తిరిగిన నేత్రాల్లో పొగిలే చలమలూ మనవే
విరిగిన పెదవుల సందుల్లో వంగిన భావాలూ మనవే
కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే
మన కలల ఖైదుల్లో జీవిత బందీలూ మనమే! .. తప్పెవరిదైనా...

మనమల్లుకున్న స్పర్ధల సాలె గూళ్ళల్లో
బరువెక్కిన గుండెలు వేళ్ళాడాల్సిందేనా ?
మనం కట్టుకున్న దర్పాల కోటబురుజుల్లో
బందీగా భావాలిలా పతనమనాల్సిందేనా ? ! .. తప్పెవరిదైనా...

తప్పులు పట్టే తత్వాన్నొదిలి
ఒప్పును చెయ్యగ పరుగున చేరా
అక్కున చేర్చగ చేతులు చాచి
రెక్కలు గట్టుకు దగ్గిర వాలా ! .. తప్పెవరిదైనా...