విరిగిన బంధం విలువెరిగి
చెంపల గీతలెన్ని తుడిచినా
ముడులు బిగవవు.
పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.
వీడిన నిద్దుర సుఖమెరిగి
నిలచిన తనువులెంత తూలినా
తనివి తీరదు.
జారిన మాటల పదునెరిగి
తెగిన తావుల నెంతకుట్టినా
గాయమారదు.
అందని కోర్కెల తీపెరిగి
ఎంతో కాలం ప్రాకులాడినా
అంత మగుపడదు.
అంతా వీడిన ఆవల
విలవిలలాడేం లాభం ?