Friday, January 23, 2009

అష్టసఖులు

విడివడి మనమొక యుగమయె
భయమయమయె నాదు మనము
నిలకడ వదిలే, గడవక సమయమిపుడు
వడివడిగా నిన్ను జేర వచ్చితి చెలియా .. కలహాంతరికా

చేసిన తప్పును ఒప్పితి నప్పుడే
నిను నొప్పించిన బాధ నాకూ
నొప్పే సఖియా.. ఒప్పును చేయగ
నిప్పుడు ఒప్పించగ వచ్చినాను, చెప్పవె సుఖమా .....ఖండితా

ఎపుడొ వీడితి నిత్తరి, పరి విధముల
వగచె మనము సొగసరీ
పెరిగి పరితాపము గిరివలె
దరిజేరితి కరుణచూపు గడసరీ ... ప్రొషితపథిక

రాజును నేనని నేనన నా మనమున
నెన్నడు నిండిన నా రాణివి నీవని నేనన
నిజమే భామా !! మన మధ్యన వీణలు
మీటగ మరలితి నీ దరికి నేడు పదవే రాణీ ... స్వాధీనపథిక

తడబడు అధరపు తమకములద్దగ
అదిరెడి ఎడదకు స్థిరతను కూర్చగ
వేచిన కన్నుల తృప్తిని నింపగ
తమకము నిండిన తనువుతొ వచ్చితి లలనా ... వాసవసజ్జిక

విరహలతా పరిష్వంగనాలంకృత శిల్పవు
వాంచాశ్వాసావృత సంపూరిత శంఖవు
విరహాగ్నిజ్వలిత కామధూపావృత దీపవు
విరహోత్ఖంఠితవు మదాగమన కాక్షితవే బాలా..

వేళాయెను అదినిజమే నువుతాళలేవు అదియును నిజమే
కళగల కాంతవు కళ్ళకు నీలాలు ఏల తగదే భామా
విరహాన నేను మునిగి వడివడి వేళకు వస్తే,
ఆనాడు నే రాలేదని ఈనాడీ శిక్షలోద్దు విడవవె ఇంతీ ..... విప్రలబ్ధ

అదుపన్నది నీకు లేదు అలసట అది అసలులేదు
ఆరుబయట వేచి ఉండి ఆత్రంగా చూస్తావు
నీకేమో నేనే ప్రియుడు వేలల్లో నాకు ప్రియులు
నీ ఇచ్చము వచ్చి నపుడు రమ్మంటే తగున చెలియా ? ... అభిసారిక


viDivaDi manamoka yugamaye
bhayamayamaye naadu manamu
nilakaDa vadilE, gaDavaka samayamipuDu
vaDivaDigaa ninnu jEra vacciti celiyaa .. kalahaantarikaa

cEsina tappunu oppiti nappuDE
ninu noppincina baadha naakuu
noppE sakhiyaa.. oppunu cEyaga
nippuDu oppincaga vaccinaanu, ceppave sukhamaa .....khanDitaa

epuDo viiDiti nittari, pari vidhamula
vagace manamu O sogasarii
perigi paritaapamu girivale
darijEriti karuNacuupu O gaDasarii ... proshitapathika

raajunu nEnani nEnana naa manamuna
nennaDu ninDina naa raaNivi niivani nEnana
nijamE bhaamaa !! mana madhyana viiNalu
miiTaga maraliti nii dariki nEDu padavE raaNii ... swaadhiinapathika

taDabaDu adharapu tamakamuladdaga
adireDi eDadaku sthiratanu kuurcaga
vEcina kannula tRptini nimpaga
tamakamu ninDina tanuvuto vacciti lalanaa ... vaasavasajjika

virahalataa parishvanganaalankRta Silpavu
vaanchaaSvaasaavRta sampuurita Sankhavu
virahaagnijwalita kaamadhuupaavRta deepavu
virahOtkhanThitavu madaagamana kaakshitavE baalaa..

vELaayenu adinijamE nuvutaaLalEvu adiyunu nijamE
kaLagala kaantavu aa kaLLaku niilaalu Ela tagadE bhaamaa
virahaana nEnu munigi vaDivaDi vELaku vastE,
aanaaDu nE raalEdani iinaaDii SikshalOddu viDavave intii ..... vipralabdha

adupannadi niiku lEdu alasaTa adi asalulEdu
aarubayaTa vEci unDi aatramgaa cuustaavu
niikEmO nEnE priyuDu vElallO naaku priyulu
nii iccamu vacci napuDu rammanTE taguna celiyaa ? ... abhisaarika

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని
పల్లె అంత సందడాయె చూడు దాని అందాన్ని

పురినిప్పి నెమలి నడిచె కురులిప్పి చెట్టులూగె
చుక్క పట్ట నోరుతెరిచి పిల్లలేమొ బయటకురికె
ఇంట బిడ్డ గుర్తు రాగ పరుగునొచ్చె పాల పిట్ట
నల్ల మబ్బు నింగిలోన సందడంత చూడవచ్చె !! చల్ల గాలి

విరగ బూసినప్పడాలు కోయు భామలక్కడ
సేదదీరు ఊరగాయ ఖైదుచేసిరిక్కడ
పంచెగుట్ట పొదివిపట్టి పిల్లగాని పరుగులు
గాదె మూతదొరకపోతె తాత చేయు చిందులు !! చల్ల గాలి

చినుకు లేమొ పందెమేసి ఒకటి ఒకటి నేల రాలె
చెంగు నెత్తి నెట్టుకుని పల్లె పడతి నాట్యమాడె
బసవ బండి దాన్నిచూసి తాళమేసె జోరులోన
ఆశపూసి రైతు నేడు మునిగిపోయె పాటలోన !! చల్ల గాలి

మడుగులోన గంతులేసి పిల్లగాళ్ళ ఆటలు
చూరు నుంచి నేల జారు వాననీటి నాట్యము
వెదురుపొదలు మొదలుపెట్టి ఈలనోటి పాటలు
నాట్లు వేయ రండి అంటు పోలిగాడి కేకలు !! చల్ల గాలి

తోకముడిచి వణికిపోతు చూరుకింద కుక్కలు
చెరువులోని బాతులెట్టె చెట్టుకింద గుంపులు
వంట ఇంట్లో పొయ్యి పక్క చేరిమూల్గె పిల్లి కూన
తనకేమీ పట్టనట్టు గానుగలోన తిరుగు ఎద్దు !! చల్ల గాలి

కప్పు పైకి పాకి పోయి రెల్లు గడ్డి కప్పేటోళ్ళు
నట్టింట్లో బిందెలోకి నీళ్ళు పట్టి పోసెటోళ్ళు
పార పట్టి తోటలోకి నీళ్ళ దారి పెట్టేటోళ్ళు
చుట్టగట్టి రచ్చబండ పిచ్చపాటి జెప్పేటోళ్ళు !!

చల్ల గాలి వెక్కిరించె హైటెక్కు జీవితాల్ని
అవ్వినేడు మరిచిపోయె పల్లె బ్రతుకు పరువాల్ని

పట్టణాల వీధి లోన నల్ల మట్టి తావి ఏది
కాంక్రీటు కొంపలోన రెల్లు గడ్డి వాసనేది
టీవి ముందు సోఫాలో రచ్చబండ చర్చలేవి
స్టీలుపొయ్యి మంటల్లో గాదె తిండి బలాలేవి !! చల్ల గాలి