Saturday, May 30, 2009

తనెళ్ళిపోయింది..

తనెళ్ళిపోయింది..

ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..

కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..

అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..

Thursday, May 28, 2009

కళ్ళు


ప్రయత్నించినా పెగలని పెదవులు
ఎదో అనుబంధంలా బిగుసుకుంటాయి..

దొర్లని పదాలు.. దొరకని బాసలు
చిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి...

అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
సౌరభాలతో స్థిమితాన్ని చెదర గొడతాయి..

అందుకే
గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే

ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ కవనం..
నా కళ్ళలోకి చూస్తావు కదూ.. ?

Wednesday, May 27, 2009

మరో బ్రతుకు చిగురిస్తుంది


బరువయిన గుండెను మోసేకంటే
బద్దలయితే ఆ ముక్కలేరుకోవడమే
ఒక్కోసారి సుఖమనిపిస్తుంది...

ముందుకొచ్చిన మౌనంతో
కలిసి మధన పడేకంటే
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని
వదలడమే సుఖమనిపిస్తుంది...

స్పందించే మనసు కరువయినప్పుడు
ఊసులతో కలిసి సమాధవడమే
ఎందుకో సుఖమనిపిస్తుంది..

సడిచేసే గుండెలో జీవంలేక
ఏ నవ్వు వెనకా మమత లేక
ఆశా సౌధాలుజేరే సోపానాలు లేక
అయోమయంలో అవస్థలకన్నా..
కారే కన్నీళ్ళలో కలిసి
కొట్టుకుపోవడమే.. సుఖమనిపిస్తుంది.

ఇది నిజం..
ఆ వేదన ఏరులై పారనీ.. ఆ ప్రవాహమాపకు ...

ఆ తరవాత అంతా
మరో ఉదయంలా ప్రశాంతంగా అనిపిస్తుంది
పారే సెలయేరులా నిర్మలంగా కనిపిస్తుంది..
ప్రతినవ్వులో పసి పాప కనిపిస్తుంది
గుండె లయల్లో సరిగమ వినిపిస్తుంది.
బ్రతుకు తిరిగి మధురంగా అనిపిస్తుంది.

పడటం తేలిక.. పడి ఉండడం మరణం..
లేచినప్పుడే విజయం వరిస్తుది..
మరో బ్రతుకు చిగురిస్తుంది !!


శృతిగారి కవిత "గుండె చప్పుడు కరువైతే ..." కి నా స్పందన
http://manaanubhoothulu.blogspot.com/2009/05/blog-post_26.html

Wednesday, May 20, 2009

నీది గెలుపెలా అవుతుంది ?


ముఖాన పచ్చపోసుకున్న
ఆ పన్నెండు మైలు రాళ్ళేగా
నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా..

ఐనా అవి దాటిన ప్రతిసారీ
నా గుండెలవిసేలా అరచి మరీ చాటింపేస్తావు
వెనక బడ్డ నన్ను చూసి గేలిచేస్తావు

నీ పరుగుకు మూడు కాళ్ళు ..
మరి నాకూ.. ఎన్ని అడ్డంకులేస్తావు ?
ఎందుకెగతాళి చేస్తావు ?

నేనే లేనప్పుడు, నీకస్థిత్వమేదీ ?
నా బ్రతుకంతా నిన్ను నింపుకున్నానే
నువ్వు నాకిచ్చేదేమిటి ?

ప్రమేయం లేకుండానే జారిపోతావు..
ఆపడానికెన్ని చేశాను ?
నిన్ను గోడకు శిలువేశానే ..

ఐనా అవిశ్రాంతంగా.. నా బ్రతుకు బాట వెనక
అగాధాలను తవ్వుతూనే ఉంటావు..
గమ్యం కానరాకుండా..
ముందు మలుపులు తిప్పుతూనే ఉంటావు.

దాటిపోయేదాకా .. వెనకున్నావని తెలియదు..
నా ఓటమే.. నీ గెలుపుకి సాక్షి.

ఈ ఆట ఏకపక్షంగా లేదూ..?
నీది గెలుపెలా అవుతుంది ?
Friday, May 15, 2009

తనెళ్ళిపోయింది


ఐనా ఈ రాత్రి… అవే ఊసుల్ని
చీకటి పొదల్లో.. ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది.

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది.

కాసేపు అలా
నేను, రాత్రి, ఏకాంతం.

అసంకల్పితంగా
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది
నిశ్శబ్దం ఆవరించింది.
పొద్దు వారు ప్రచురించిన నా కవిత తనేల్లిపోయింది చూడగలరు .


http://poddu.net/?p=2798

Friday, May 8, 2009

నన్నెలా అర్దం చేసుకోవాలో ?!ఎన్ని మాటల తూటాలూ..
నాకు తప్పుకోవాలన్న తలపైనా వచ్చిందా ?
చూశావా ఎన్ని తూట్లు పడ్డాయో..

ఐనా హాయిగా ఉంది...
నా చిన్న తనం గురుతు చేశావు..

కారం తినడంఅన్నా .. కత్తితో ఆటలన్నా
కరెంటు తీగలన్నా.. ఎంత మక్కువో
అమ్మ అన్నిటికీ అరిచేది. కసిరేది..
నాకూ... అచ్చు.. ఇలానే అనిపించేది..

తేడా అల్లా.. నేనప్పుడు అర్ధం చేసుకోవడానికి
ప్రయత్నిచలేదు... సరే అని మిన్న కున్నానంతే..

ఇప్పుడర్ధమయ్యింది..
తను నాకర్ధం కాలేదో...
నేను తనని అపార్ధం చేసుకున్నానో..
ఇప్పుడు రోజూ అనుకుని ఏంప్రయోజనం ?

నాది శిలా హృదయం కాదు .. కన్నా...
ఆ ఆర్ధ్రత నన్ను చేరక కాదు రా...
అవగాహన చేసుకునే వయసు నీకు రాలేదని.

'వద్దు ' అన్న మాటొక్కటే నీకు వినపడేది..
నాకు అదే జరిగితే అన్న ఊహతో పాటు
శతకోటి విషాద గీతాలు..
అనంతకోటి అశ్రు జలపాత ఘోషలూ..

అందుకే.. నీకు నేనంటే భయమయినా..
నువ్వు క్షేమమన్న తృప్తి
అర్ధం చేసుకుంటావన్న ఆకాంక్షతో..
ఇలా కాలం గడుపుతున్నా..
ఆరోజు కోసం ఎదురు చూస్తూ.


శృతిగారు రాసిన http://manaanubhoothulu.blogspot.com/2009/05/blog-post.html కవితకు నా స్పందన.


Tuesday, May 5, 2009

మనలానే !!


ప్రమిద క్రింద చీకటిలా
దోబూచులాడుతూ ..
ఆ నీడన స్థిరత్వం వెదుక్కుంటూ..

సెలయేరులో గులకరాళ్ళలా
ఒదిగిపోయి.. కాలంతో కోసుకుపోతూ
మృదుత్వం మొహాన పులుముకుంటూ..

రహదారిలో మైలురాయిలా
నిస్వార్ధంగా.. దారి చూపుతూ ..
చేతనలుడిగి పాతుకుపోతూ..

ఒకదానికొకటి తోడుగా.. ఎప్పటికీ.. 
ఐనా..ఎన్నటికీ కలవని బంధాలవి ...

మనలానే !!