Wednesday, December 31, 2008

శుభాకాంక్షలు

మిత్రులందరికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ వత్సరం నూతన వెలుగులు తేవాలని
మనసారా ఆకాంక్షిస్తున్నాను.

Tuesday, December 30, 2008

అనుభవాలు

భావ పాతాలు గుండె శిలలను చేరుకుంటూ
తలలు పగిలేలా మూర్కొంటున్నాయి
బ్రతుకు ఒరవడి తాళలేక పల్లాలని వెదుక్కుంటూ
ఆత్మహత్యను చేసుకుంటున్నాయి

చావచచ్చిన శకలాలు ఉపరితలంపైన ఆడుకుంటాయి
ఏమీ పట్టనట్టు సాగిపోతాయి - నవ్వుకుంటాయి
చచ్చిబ్రతికిన ఆనవాళ్ళు తెట్టుతోడై ఒడ్డు చేరుకుంటాయి
అనుభవాలై గతంలో పొందికగా సద్దుకుంటాయి

జ్ఞాపకాలై మధనపెడుతు విందుచేసుకుంటాయి



bhaava paataalu gunDe Silalanu cErukunTuu
talalu pagilElaa muurkonTunnaayi
bratuku oravaDi taaLalEka pallaalani vedukkunTuu
aatmahatyanu cEsukunTunnaayi
caavacaccina SakalaalE uparitalampaina aaDukunTaayi
Emii paTTanaTTu saagipOtaayi - navvukunTaayi
caccibratikina aanavaaLLE teTTutODai oDDu cErukunTaayi
anubhavaalai gatamlO pondikagaa saddukunTaayi
jnaapakaalai madhanapeDutu vinducEsukunTaayi

నీడ

గాలి కాపరి తోలుతున్నా
మబ్బు మేకలు కదలలేదు
జాలి తలపులు వేడుతున్నా
నిప్పు కీలలు అణగలేదు
మెరుపు ఝళుపులు తగులుతున్నా
మరుపు మెళుకువ దరికిరాదు
నిజం చూపులు నిండుతున్నా
నీడ నాతో వెంటరాదు

gaali kaapari tOlutunnaa
mabbu mEkalu kadalalEdu
jaali talapulu vEDutunnaa
nippu keelalu aNagalEdu
merupu jhaLupulu tagulutunnaa
marupu meLukuva darikiraadu
nijam cuupulu ninDutunnaa
neeDa naatO venTaraadu

Monday, December 29, 2008

అడవితల్లి ఒడిలో

చింత చెట్టు ఊడలల్లో
పసిబిడ్డడి ఊయల - వ్యత్యాసాల ఊపుకి ఊగుతుంది
ఆకలి పుడకల కొంపలో
వేదన చితుకుల పొయ్యి - ఆకలి మంట మండుతుంది
వ్యతిరేకత మూకుడులో
బ్రతుకు అంబలి కాగుతుంది - ఎవరి ఆకలో తీరనుంది

గుప్పెట్లో దాచిన గుక్కెడు దాహంలా
కడుపు నిండని నిన్న, ఈరోజు మళ్ళీ
వాడి గుడిసెలోకి జారుతుంది - యముని పాశంలా

ఊదుగొట్టం లోకెళ్ళిన ఊపిరి
పొగలా గూడెం నిండుతుంది
వేగులా ఉనికిని తూటాలకిస్తుంది - ఎన్కౌంటరు పావురం ఎగురుతుంది

వాడి రేపు ఎర్రక్షరాల్లో పేపరెక్కుతుంది,
రంగు పీలికలై కాకీ చొక్కాకి అంటుతుంది
ఖద్దరు చొక్కా చేతులు కడుక్కుంది - ఎండిన డొక్క బావురంటుంది

పేదరికపు గీత పైకెగిరి జాతి పురోగతి చాటుతుంది
ఈ గాయం మానకముందే

అడవిలో చింత చెట్టుకింద
మరో ఊయల వేళాడుతుంది
మరో గాడిపొయ్యి మొదలవుతుంది
వాడి గద్గద స్వరం రేగుతుంది
అడవితల్లి ఒడిలో వేగు పొగ ఎగురుతుంది
గద్దరు స్వరం సాగుతుంది
తూటాల తప్పెటా సాగుతుంది

వస్తావు కదూ ?

మంచు ముసుగులో వసంతం కోసం
నగ్నంగా తపస్సు చేసే మానులా
ఋతువు ముసుగులో తొలకరి కోసం
ఆబగా ఎదురు చూసే చకోరంలా (/ఆలుచిప్పలా)
నేల ముసుగులో పుఠం కోసం
మకిలిలా ఎదురు చూసే బంగారంలా
ఆశ ముసుగులో నీకోసం
ఉలి తగలని శిలలా ఎదురు చూస్తున్నాను
కాల చక్రం నావైపు మొగ్గదని తెలుసు
ఐనా నీకోసం ఎదురుచూస్తున్నాను
వాటిని చేరిన అచంచల నమ్మకం
నా రెప్పల వెనక నీళ్ళ పొరలా ఆవహించింది
వాటినార్పి ఆశను చెక్కిళ్ళపై జార్చలేను
ఆర్పక నీ రాక మసక చేసుకోలేను
కదలని నా కళ్ళలోగిళ్ళు
సంక్రాంతి ముంగిళ్ళై రంగులమర్చుకుంది
వస్తావన్న ఆశ ఇంకా నా కళ్ళనిండా ఉంది
వస్తావు కదూ ?



mancu musugulO vasantam kOsam
nagnamgaa tapassu cEsE maanulaa
Rtuvu musugulO tolakari kOsam
aabagaa eduru cuusE cakOramlaa
nEla musugulO puTham kOsam
makililaa eduru cuusE bangaaramlaa
aaSa musugulO neekOsam
uli tagalani Silalaa eduru cuustunnaanu
kaala cakram naavaipu moggadani telusu
ainaa neekOsam edurucuustunnaanu
vaaTini cErina acancala nammakam
naa reppala venaka neeLLa poralaa aavahincindi
vaaTinaarpi aaSanu cekkiLLapai jaarcalEnu
aarpaka nee raaka masaka cEsukOlEnu
kadalani naa kaLLalOgiLLu
sankraanti mungiLLai rangulamarcukundi
vastaavanna aaSa inkaa naa kaLLaninDaa undi
vastaavu kaduu ?

Friday, December 26, 2008

శాంతం

తర్కం వేదం మోక్షం శాంతం
యాగం యజ్ఞం మరణం శాంతం
విరహం తమకం స్వేదం శాంతం
ఆరాటం ఆధారం నిర్వేదం శాంతం
కాంక్ష ఆంక్ష శిక్ష శాంతం
ఆరంభం నిర్మాణం నిర్మూలం శాంతం
జన్మం పోరాటం నిర్మోహం శాంతం

Tuesday, December 23, 2008

ఎంతని చెప్పను

చెమరిన కన్నుల చిత్తడినార్పగ
చెదిరిన గుండెల ఆర్తిని తీర్చగ
వేచిన మనసుకు విడుదల నేర్పగ
కరిగిన యెడదకు కఠినత చేర్చగ
విరిగిన తలపుల పొందిక కూర్చగ
ఆర్తిగ అరిచిన గొంతును తడపగ

కర్తను నెనై చెసిన తప్పుకు
క్రుంగిన మనిషిగ చెతులు చాపగ

తపనను తీర్చగ కవితలు రెపి
కరుణను చూపే కన్నుల చూసిన
నెచ్చెలి విలువను,

ఎంతని చెప్పను నేస్తం !?

Monday, December 22, 2008

ఎన్నని చెప్పను

చక్కని నల్లని కన్నుల లోపల
చిక్కిన చెల్లని ఆశలు ఎన్నో
కప్పిన తలపుల మబ్బుల లోపల
చెక్కిలి తడిపిన చిక్కులు ఎన్నో

తప్పిన గుండెల చప్పుడు లోపల
డస్సిన ఆతృత కేకలు ఎన్నో
చెప్పిన నిజముల లెక్కల లోపల
ఎగిరిన చెక్కిలి తుంపర లెన్నో

వేదన మంటల వేడికి లొంగి
వెళ్ళని భావన కవితలు ఎన్నో
చచ్చినా చెరగని పచ్చల చిత్రాలై
గుండె గోడలెక్కిన మన గాధలెన్నో

వీటన్నిటికి నేనే సాక్ష్యమంటూ
వెచ్చగా కారేటి ఆశల ధారలెన్నో

ఎన్నని చెప్పను నేస్తం ? !!

ఏమని చెప్పను

వద్దంటున్నా వినక జాజుల జడి వానలో
నన్ను విడిచి నువ్వు నడిచిన తరుణం
తడుపు నాకు తగిలిన వైనం

నడకాపి నాకై తిరిగి తావివై వస్తావని
కనీసం తిరిగి చూస్తావని వేచిన తరుణం
కదలని కాలమొచ్చిన వైనం

వెన్నెల పరిచిన వీధుల్లో
కదిలే చీకటి లీలల వెనక
కరిగిన గుండెలొ కదలిక కలిగి
వస్తావంటు వేచిన నాకు

మనసు ముడులు వీడి గుండె గోడలమీద
నువ్వురావన్న నిజం రుధిర ధారలై
కదిలి కవితలై కరిగి కాగితాలెక్కిన తరుణం
తపన తీరని వైనం

ఏమని చెప్పను నేస్తం ?

Wednesday, December 17, 2008

వెదుక్కుంటున్నా ..!!

మమతానురాగాలను వెనక వదిలి, ఇప్పుడు
ఇరుకు మనసుల జనారణ్యంలో
ఆత్మీయత కోసం వెదుక్కుంటున్నా ...

జ్ఞానమిచ్చిన నేల వదిలి వచ్చి, ఇక్కడ
నిర్జీవ కాంక్రీటు నగరాల్లో
ఆశలు తీరే దారులు వెదుక్కుంటున్నా ...

సాంప్రదాయ సంకెళ్ళను తెంచాననుకుని ఇప్పుడు
పాశ్చాత్య ప్రవాహాల్లో
అమాయకత్వానికర్ధం వెదుక్కుంటున్నా ...

కొత్త దేశం మోజులో వలస వచ్చి, ఇక్కడ
పచ్చనోట్ల మడతల్లో
పాత జ్ఞాపకాలను వెదుక్కుంటున్నా ...



mamataanuraagaalanu venaka vadili, ippuDu
iruku manasula janaaraNyamlO
aatmeeyata kOsam vedukkunTunnaa ...

jnaanamiccina nEla vadili vacci, ikkaDa
nirjeeva kaankreeTu nagaraallO
aaSalu teerE daarulu vedukkunTunnaa ...

saampradaaya sankeLLanu tencaananukuni ippuDu
paaSchaatya pravaahaallO
amaayakatvaanikardham vedukkunTunnaa ...

kotta dESam mOjulO valasa vacci, ikkaDa
paccanOTla maDatallO
paata jnaapakaalanu vedukkunTunnaa ...

తెలియని ప్రశ్న

ఈరోజు రాత్రి నా నిస్సత్తువలా
నాకంటే ముందే నన్ను చేరింది
మామూలుగా ఈపాటికి నిద్రా దేవి
నా కళ్ళ తలుపులు తట్టాల్సింది

నా అస్తిత్వంలా తనుకూడా
నాపై అలిగినట్టుంది, ఇక రానంది

గోడమీద చిన్న ముల్లు
ఈ బరువైన కాలాన్ని నెట్టటానికి
అష్టకష్టాలు పడుతుంది

చీకట్లో నిశ్శబ్దం నా అంతర్మధనానికి
నేపధ్య గీతంలా సాగుతోంది
నిట్టూర్పుల వేడి విషాదం
ఈ సమయంలొ నిషాలను నింపుతుంది

బాధలొ భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
నా ప్రస్తుతాన్ని గడిపేస్తున్నా

ఇక అలిసిపోయాను, ఇంకేమైనా చెయ్యాలని
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకారణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను

నా గతం నుండి నన్ను నేను
పెరికి తెచ్చుకుంటున్నాను

చింత తెస్తున్నానో చితి తెస్తున్నానో తెలియదు గానీ,
పులిమిన నవ్వులు మాత్రం చెరిపేస్తున్నాను

చితి చచ్చినోళ్ళనేకాలుస్తుంది
చింత బ్రతికుండగానే కాలుస్తుంది

ఈ రాత్రి నాకు తెల్లారిందో నేనే తెల్లారానో
నాకదే తెలియని ప్రశ్న, ఇక వేచిచూడాలి.


eerOju raatri naa nissattuvalaa
naakanTE mundE nannu cErindi
maamuulugaa eepaaTiki nidraa dEvi
naa kaLLa talupulu taTTaalsindi
naa astitvamlaa tanukuuDaa
naapai aliginaTTundi, ika raanandi
gODameeda cinna mullu
ee baruvaina kaalaanni neTTaTaaniki
ashTakashTaalu paDutundi
ceekaTlO niSSabdam naa antarmadhanaaniki
nEpadhya geetamlaa saagutOndi
niTTuurpula vEDi vishaadam
ee samayamlo nishaalanu nimputundi
baadhalo bhaavukata vetukkunTuu
navvulu pulumukuni aanandam naTistuu
naa prastutaanni gaDipEstunnaa
ika alisipOyaanu, inkEmainaa ceyyaalani
ee niSiraatrina naa jnaapakaaraNyamlO
nannu nEnu vetukkunTunnaanu
naa gatam nunDi nannu nEnu
periki teccukunTunnaanu
cinta testunnaanO citi testunnaanO teliyadu gaanee,
pulimina navvulu maatram ceripEstunnaanu
citi caccinOLLanEkaalustundi
cinta bratikunDagaanE kaalustundi
ee raatri naaku tellaarindO nEnE tellaaraanO
naakadE teliyani praSna, ika vEcicuuDaali.

ఎండమావులు

పరిస్థితుల వేడికి
మనసు బీటలై
బంధాలు విడివడి
భావాలు బీడులై
ఆత్మీయత కోసం చేసిన
ఆక్రందనల పిదప
పిడచకట్టిన నా పదాల సాక్షిగ
చెమరటం మరిచిన
నా కళ్ళల్లో ఎండమావులు
ఆ నీరు చూసేవారికే
తుడిచే భాగ్యం నాకు లేదు !!


paristhitula vEDiki
manasu beeTalai
bandhaalu viDivaDi
bhaavaalu beeDulai
aatmeeyata kOsam cEsina
aakrandanala pidapa
piDacakaTTina naa padaala saakshiga
cemaraTam maricina
naa kaLLallO enDamaavulu
aa neeru cuusEvaarikE
tuDicE bhaagyam naaku lEdu !!

'అను'క్షణం

గమ్యమేమిటో ?
గమన మెక్కడికో?

నా కోసం వేచిన ప్రాణికి,
నేనిచ్చే అనుభవమేమిటో ?

దరహాసమై చిగురిస్తానో ?
అశృ ధారలై ప్రవహిస్తానో ?

నిర్లిప్తంగా మరిచేస్తారో ?
దయలేదంటూ ఖండిస్తారో?

వేచిన క్షణమే వచ్చిందంటూ
వెచ్చని కౌగిలినందిస్తారో ?
పోయ్యేకాలము వచ్చిందంటూ
ఈసడింపుగ చీ కొడతారో ?

ఏదేమైనా జ్ఞాపకమొకటై
మిగిలెద నేనని"
తలచుంటుందా ?
మనను చేరిన 'అను ' క్షణం ?

gamyamEmiTO ?
gamana mekkaDikO?
naa kOsam vEcina praaNiki
nEniccE anubhavamEmiTO ?
darahaasamai ciguristaanO ?
aSR dhaaralai pravahistaanO ?
nirliptamgaa maricEstaarO ?
dayalEdanTuu khanDistaarO?
vEcina kshaNamE vaccindanTuu
veccani kougilinandistaarO ?
pOyyEkaalamu vaccindanTuu
eesaDimpuga cee koDataarO ?
EdEmainaa jnaapakamokaTai
migileda nEnani" talacunTundaa
mananu cErina 'anu ' kshaNam?

Sunday, December 14, 2008

ఎన్నో

గుండె కొమ్మ
గతపు తేనె పట్టు
జ్ఞాపకాల గదులెన్నో
కుట్టే గాధ లెన్నో

కలత రాయి
మనసు కొలనులో
రేపే తరంగాలెన్నో
చెదిరే అంతరంగాలెన్నో

కంటి పుట్టలో
దిగులు కలుగులు
తిరిగే జీవులెన్నో
జారే ధారలెన్నో

మనసు నెగడు
మధనపు చితుకులు
ఎగిరే కీలలెన్నో
రగిలే గుండెలెన్నో

కవిత మనసు
భావ కుసుమాలు
చెప్పే మాటలెన్నో
తీరే తపనలెన్నో

gunDe komma
gatapu tEne paTTu
jnaapakaala gadulennO
kuTTE gaadha lennO

kalata raayi
manasu kolanulO
rEpE tarangaalennO
cedirE antarangaalennO

kanTi puTTalO
digulu kalugulu
tirigE jeevulennO
jaarE dhaaralennO

manasu negaDu
madhanapu citukulu
egirE keelalennO
ragilE gunDelennO

kavita manasu
bhaava kusumaalu
ceppE maaTalennO
teerE tapanalennO

అయ్యో దేవా !!

నా బ్రతుకు బావులు నిండే దాకా
ఆచి తూచి ఎంపిక చేసి
కరకు కష్టాలను నింపేశావా ? అయ్యో దేవా !!
కమలపు రేకుల బోలిన చేతులు
వాచాయేమో ! ఏవీ ముందుకు చాపు కాపడమెడతా !!

నా కన్నుల బావులు ఆరే దాకా
కాచి కాచి ఆవిరి చేసే
మంటలు గుండెలొ నింపేశవా? అయ్యో దేవా !!
దేవికి పాదాలొత్తిన చేతులు
కాలాయేమో ! ఏవీ ముందుకు చాపు వెన్నను రాస్తా !!

నా గొంతులొ నరాలు పగిలె దాకా
పిలిచి పిలిచి అలిసేలాగా
చాలా దూరం నడిచేశావా? అయ్యో దేవా !!
బ్రహ్మ కడిగిన పాదాలవ్వి
అలిశాయేమో ! ఏవీ ముందుకు చాపు ఊరటనిస్తా !!


naa bratuku baavulu ninDE daakaa
aaci tuuci empika cEsi
karaku kashTaalanu nimpESaavaa ? ayyO dEvaa !!
kamalapu rEkula bOlina cEtulu
vaacaayEmO ! Evii munduku caapu kaapaDameDataa !!

naa kannula baavulu aarE daakaa
kaaci kaaci aaviri cEsE
manTalu gunDelo nimpESavaa? ayyO dEvaa !!
dEviki paadaalottina cEtulu
kaalaayEmO ! Evii munduku caapu vennanu raastaa !!

naa gontulo naraalu pagile daakaa
pilici pilici alisElaagaa
caalaa duuram naDicESaavaa? ayyO dEvaa !!
brahma kaDigina paadaalavvi
aliSaayEmO ! Evii munduku caapu uuraTanistaa !!

రాత్రి

స్థంభించిన కాలపు సమక్షంలో
గుండె మంటల వేడికి కరుగుతున్న రాత్రికి
కన్నుల్లో ఆశ్రయమిస్తూ
జారే రాత్రిని మనసారా తాగుతున్నా

కరిగి మిగిలిన రేయి
నలుపు నా మనసుకద్ది, చీకటి కురులు వెనక్కేస్తూ,
తన నుదుటికి నా కళ్ళ ఎరుపడిగింది.
తన పేరిక మార్చ మంది.

తనూ నిద్రలా నన్నొదిలి జారుకుంది
నా నిన్నటికి నేటికి మధ్య వంతెన మాయమయ్యింది
లోకానికి తెల్లారింది
నాకు ఈ రాత్రీ కరిగి జరిగి పోయింది
మీ మధ్యహ్నంలా. నిర్దాక్షిణ్యంగా



sthambhincina kaalapu samakshamlO
gunDe manTala vEDiki karugutunna raatriki
kannullO aaSrayamistuu
jaarE raatrini manasaaraa taagutunnaa

karigi migilina rEyi
nalupu naa manasukaddi, ceekaTi kurulu venakkEstuu,
tana nuduTiki naa kaLLa erupaDigindi.
tana pErika maarca mandi.

tanuu nidralaa nannodili jaarukundi
naa ninnaTiki nETiki madhya vantena maayamayyindi
lOkaaniki tellaarindi
naaku ee raatrii karigi jarigi pOyindi
mee madhyahnamlaa. nirdaakshiNyamgaa

ఫొటో

అటక మీద దొరికిన ఫొటో మీద
దుమ్ము దులిపేసరికి
పాతికేళ్ళ నాటి ఘటనొచ్చి
నట్టింట్లో పడింది

"ఇవి మార్కులా" హస్తం గుర్తును
నా చెంప మీద చూపిన
నూనూగు మీసాల
కాంగ్రెస్‌ వాది ముందు గదిలో

"మీ ఆఫీసరుగారబ్బైకి చక్రాలొచ్చాయండీ"
వంటింట్లోనుంచి ముందుగది దాకా సాగిన
అమ్మ సముదాయింపు స్వరం

"తప్పిన వాళ్ళల్ల్లో ఎక్కువ మార్కులొచ్చింది
అన్నాయికే " అంటూ తన లాజిక్కుతో
అడ్డకాలేసి సైకిలు తొక్కుతూ, కాపాడొచ్చిన తమ్ముడు

"వెధవ చదువులు పరీక్ష పెట్టటమెదుకు?
తప్పించడం ఎందుకు ? అందుకే నేబడికే వెళ్ళలేదు" అంటూ
అమ్మమ్మ సమర్ధింపు సణుగుడు, పూజ గదిలోనుంచి

బిక్క మొఖం, వంచిన తల, తడిసిన కళ్ళు,
ముక్కు బలపాలు, బొందుల నిక్కరు, దొంగ చూపులు
ఫొటోలో ఉన్నది ఇంతే ఐనా, దాని వెనక ఎంత కధ ఉందో !

Tuesday, December 9, 2008

చినుకులు

తెగనిండిన ఎర్ర బస్సులా
నల్ల మబ్బులు మెల్లగా నింగి కొచ్చాయి
మెరుపు దెబ్బకు మబ్బు చిరిగినట్టుంది, చినుకులు చిన్నగా కారుతున్నాయి

ఇంటిగంట విన్న స్కూలు పిల్లల్లా,
గోలగా పరుగులెడుతున్నాయి
ఉరుములా గొడవ ఆపమంటున్నాయి, చినుకులది లెక్క పెట్టకున్నాయి

కొన్ని మా చూరు ఎత్తుకు నిచ్చెనేసేసాయి
కప్పులో బొక్కంటూ గేలిచేసాయి
పడవచేసే పేపరెదక మన్నాయి, పకోడీలెయ్యమంటూ అమ్మనడుగుతున్నాయి

మేడమీద మిరపలు నప్పలేదేమో
రేకుమీదకి దూకి చిందులేస్తున్నాయి
నోరుతెరిచి నింగి చూస్తున్నాయి, కోపంగా పల్లాన్ని వెదుకుతున్నాయి

నేలతల్లినొదిలి ఎంతకాలమైందో
కన్నీళ్ళతో నేల తడిపేస్తున్నాయి
ప్రేమ గంధాలు ఒలుకుతున్నాయి, కౌగిట్లొకరిగి ఇంకుతున్నాయి

తండ్రి చెరువు కడకు పరుగులెడుతున్నాయి
తోడుగా నా పడవ తీసుకెళుతున్నాయి
ప్రేమల్ని మనకివి నేర్పుతున్నాయి, మనకున్న విలువల్ని చాటుతున్నాయి


teganinDina erra bassulaa
nalla mabbulu mellagaa ningi koccaayi
merupu debbaku mabbu ciriginaTTundi, cinukulu cinnagaa kaarutunnaayi

inTiganTa vinna skuulu pillallaa,
gOlagaa paruguleDutunnaayi
urumulaa goDava aapamanTunnaayi, cinukuladi lekka peTTakunnaayi

konni maa cuuru ettuku niccenEsEsaayi
kappulO bokkanTuu gElicEsaayi
paDavacEsE pEparedaka mannaayi, pakODiileyyamanTuu ammanaDugutunnaayi

mEDameeda mirapalu nappalEdEmO
rEkumeedaki duuki cindulEstunnaayi
nOruterici ningi cuustunnaayi, kOpamgaa pallaanni vedukutunnaayi

nElatallinodili entakaalamaindO
kanneeLLatO nEla taDipEstunnaayi
prEma gandhaalu olukutunnaayi, kougiTlokarigi inkutunnaayi

tanDri ceruvu kaDaku paruguleDutunnaayi
tODugaa naa paDava teesukeLutunnaayi
prEmalni manakivi nErputunnaayi, manakunna viluvalni caaTutunnaayi

Sunday, December 7, 2008

రైలు స్టేషను

పుట్టింటికొచ్చిన నిండు చూలాలు
అస్సు బుస్సంటు మెల్లగా
బంధువులంతా చూస్తుండగా
బాధ గా మూల్గుతూ గట్టు పైన చేరింది

నెలలు నిండినట్టున్నాయి
వందల కళ్ళకు వెలుగు నివ్వగల పాపలు
కొంప తడిసిన గండు చీమల్లా
బిలబిల మని పుట్టుకొచ్చాయి

వారి బ్రతుకు భారాన్ని తాము మోస్తామని
కట్నమడిగే ఎర్రచొక్కా మేన మామలతో
తన కడుపాకలి పొట్లాను కట్టి
బటణీలని అబద్ధమాడి పైసలడిగే తమ్ముళ్ళతో

తనపని ముగిసిందని తలుపు తాళమెట్టి
చేతులు దులుపుకుని బయటకెల్లే తాతలతో
ఇవేమి పట్టనట్టు నీళ్ళాడి
తలోదారి పట్టిన పచ్చి బాలింతలతో

నిజ జీవితానికో అద్ద మాకూడలి



puTTinTikoccina ninDu cuulaalu
assu bussanTu mellagaa
bandhuvulantaa cuustunDagaa
baadha gaa muulgutuu gaTTu paina cErindi

nelalu ninDinaTTunnaayi
vandala kaLLaku velugu nivvagala paapalu
kompa taDisina ganDu ceemallaa
bilabila mani puTTukoccaayi

vaari bratuku bhaaraanni taamu mOstaamani
kaTnamaDigE erracokkaa mEna maamalatO
tana kaDupaakali poTlaanu kaTTi
baTaNeelani abaddhamaaDi paisalaDigE tammuLLatO

tanapani mugisinDani talupu taaLameTTi
cEtulu dulupukuni bayaTakellE taatalatO
ivEmi paTTanaTTu neeLLaaDi
talOdaari paTTina pacci baalintalatO

nija jeevitaanikO adda maakuuDali

Saturday, December 6, 2008

ఉదయం

నల్ల బుడగ గుత్తుల్లా కలలు
అలరిస్తున్నాయి, మత్తునిస్తున్నాయి

భళ్ళని పగిలిన శబ్దానికి
ఉలిక్కిపడి సూర్యుడు ఉదయించాడు

నిద్ర కన్నుల ఎరుపు తూర్పంతా పరిచాడు
భయమేసిన కోడి కేక పెట్టింది

బుజ్జాయి మెడగంట, గోపురం మీద సుప్రభాతం
ఎదురింట్లో సంగీత పాఠాలు

అలిగిన రాతిరి, నిశ్శబ్దాన్ని చీకటి సంచీలో
దాచి దాంతో ఉడాయించింది . బద్ధకం ఇక్కడొదిలేసింది

నిద్ర నాకిక రానని మొరాయించింది.

అబ్బా !! ....... అప్పుడే రాత్రెళ్ళిందా ?

nalla buDaga guttullaa kalalu
alaristunnaayi, mattunistunnaayi

bhaLLani pagilina Sabdaaniki
ulikkipaDi suuryuDu udayincaaDu

nidra kannula erupu tuurpantaa paricaaDu
bhayamEsina kODi kEka peTTindi

bujjaayi meDaganTa, gOpuramekkina
em es subbalakshmi, edurinTlO sangeeta paaThaalu

aligina raatiri niSSabdaanni ciikaTi sanciilO
daaci uDaayincindi. baddhakam ikkaDodilEsindi

nidra naakika raanani moraayincindi.

abbaa appuDE raatreLLindaa ?

Thursday, December 4, 2008

కొత్త జగతికి పునాదులేద్దాం

కన్నీళ్ళను తుడిచేసినా
చిరునవ్వులు పూయించినా
రహదారిన నడిపించినా
నీ కోసం కాదది నేస్తం

నీ కష్టం చూసి చెమరే కళ్ళివి
ఆ బాధను తెలిసి పగిలే ఎదయిది
నాన్న అన్నల ప్రేమల కన్నా
సడలక అల్లిన స్నేహమిది

గతమని బేలగ సద్దుకుపోకు
రుణమని చేతులు దులుపుకు పోకు
చీలికలయ్యే నీ బ్రతుకును చూస్తూ
చింతను ఒదిలి ఏల మనగల?

ఆరేదీపానికి అడ్డుగు పెట్టిన
చేతులు నెట్టుక్కు పక్కకు పోకు
స్నేహం అర్ధం తెలిసిన మనుషులు
కోటికి ఒక్కడు లేని జగతిది

మంటలొ నిన్ను ఒదిలై అంటె
వింటానని నీ కెంతటి ఆశ ?
నీ నీడను గుండెలొ నింపినవాడిని
వదిలై అంటే ఏమైపోను ?

ముత్యము వంటి నిన్ను ఒంటరిగ
పందుల ముందు ఒదలను నేస్తం
చేయిని కలిపి నాతో నడువు
కొత్త జగతికి పునాదులేద్దాం !!

శృతి గారి "వెళ్ళిపో నేస్తం " కవితకు నా స్పందన
http://manaanubhoothulu.blogspot.com/2008/12/blog-post_7433.html


kanneeLLanu tuDicEsinaa
cirunavvulu puuyincinaa
rahadaarina naDipincinaa
nee kOsam kaadadi nEstam

nee kashTam cuusi cemarE kaLLivi
aa baadhanu telisi pagilE edayidi
naanna annala prEmala kannaa
saDalaka allina snEhamidi

gatamani bElaga saddukupOku
ruNamani cEtulu dulupuku pOku
ciilikalayyE nee bratukunu cuustuu
cintanu odili Ela managala?

aarEdeepaaniki aDDugu peTTina
cEtulu neTTukku pakkaku pOku
snEham ardham telisina manushulu
kOTiki okkaDu lEni jagatidi

manTalo ninnu odilai anTe
vinTaanani nee kentaTi aaSa ?
nee neeDanu gunDelo nimpinavaaDini
vadilai anTE EmaipOnu ?

mutyamu vanTi ninnu onTariga
pandula mundu odalanu nEstam
cEyini kalipi naatO naDuvu
kotta jagatiki punaadulEddaam !!

Wednesday, December 3, 2008

కాసే దమ్మీగుండెలకుంది

కార్గిల్‌ గుండెలొ చిందిన రక్తపు
మరకలు ఇంకా చెరగనెలేదు
ముంబాఇ వీదిలొ పేలిన బాంబుల
ప్రతిధ్వనులింకా అణగట్లేదు

గాయంపైనా కారమద్దుతు
నపుంసకత్వము ఎత్తిచూపుతు
అమాయక జనాల్ని అంతంచేసే
వికృతచేస్ఠులు ఎదురు నిలిస్తే

శాంతి పేరుతో చేతులు కట్టి
రెండో చెంపను వారికి చూపే
రాజకీయపు నిర్వీర్యతలో
ఎంతకాలమీ అణిగిన బ్రతుకులు ?

చంద్రుని పైన జెండా పెట్టాం
పైరేట్టు షిప్పును మట్టం చేశాం
అంటూ గంతులు వేసేస్తున్నాం
బాంబుల బెడ్డుపై నిదురిస్తున్నాం

తళతళలాడే తుపాకులుండీ
తలలు తీయగల సైన్యం ఉండీ
బరితేగించిన మత పిశాచులను
మసిగా మార్చే తరుణం రాదే ?

స్వతంత్రమొచ్చీ భయంగ బ్రతికే
బానిస బ్రతుకులు మనకిక వద్దు
శాంతి మంత్రము తాతకు వదిలి
భద్ర కాళివై బయటకు కదులు

సుబాసు బోసు భగత్‌ సింగుల
ఉడుకు రక్తము మనలో ఉంది
అందిన కత్తిని ఒడిసి పట్టుకుని
ముష్కర తలలను కసిగా తీద్దాం

తల్లిని తమ్ముని కాపాడెందుకు
నేతల సలహాలక్కరలేదు
పిచ్చిదొ మంచిదొ కత్తొకటియ్యి
కాసే దమ్మీగుండెలకుంది


kaargil gunDelo cindina raktapu
marakalu inkaa ceraganelEdu
mumbaai veedilo pElina baambula
pratidhvanulinkaa aNagaTlEdu

gaayampainaa kaaramaddutu
napumsakatvamu etticuuputu
amaayaka janaalni antamcEsE
vikRtacEsThulu eduru nilistE

Saanti pErutO cEtulu kaTTi
renDO cempanu vaariki cuupE
raajakeeyapu nirveeryatalO
entakaalamee aNigina bratukulu ?

candruni paina jenDaa peTTaam
pairETTu shippunu maTTam cESaam
anTuu gantulu vEsEstunnaam
baambula beDDupai niduristunnaam

taLataLalaaDE tupaakulunDii
talalu teeyagala sainyam unDii
baritEgincina mata piSaaculanu
masigaa maarcE taruNam raadE ?

swatantramoccii bhayamga bratikE
baanisa bratukulu manakika vaddu
Saanti mantramu taataku vadulu
kraanti padhamlO bayaTaku kadulu

subaasu bOsu bhagat singula
uDuku raktamu manalO undi
andina kattini oDisi paTTukuni
mushkara talalanu kasigaa teeddaam

tallini tammuni kaapaaDenduku
nEtala salahaalakkaralEdu
piccido mancido kattokaTiyyi
kaasE dammeegunDelakundi

Tuesday, December 2, 2008

చెంతకు రాకే చందన గంధీ !!

పట్టుపరికిణీ బొట్టూ కాటుక
బుగ్గన నొక్కు చక్కని నవ్వు
ఘల్లను గజ్జెలు సిగన మల్లెలు
సిగ్గును పంచుతు కళకళ లాడుతు
ముస్తాబయ్యిన తమరి ఊహలే

చిత్తరువయ్యి యెదలో చేరి
ఇంతటి అలజడి రేపగలిగితే
నాలో పైత్యము పెంచగలిగితే
నువ్వే కొంచెము కనికరమంది
చెంతన చేరి కుశలమడిగితే ?

తట్టుకునెను నిలబడగలనా ?
ఎండు కట్టెలా బిగుసుకుపోనూ
మాటలు రాక తడబడిపోనూ
అందుకె పెట్టక నన్నిబ్బంది
చెంతకు రాకే చందన గంధీ !!

paTTuparikiNee boTTuu kaaTuka
buggana nokku cakkani navvu
ghallanu gajjelu sigana mallelu
siggunu pancutu kaLakaLa laaDutu
mustaabayyina tamari uuhalE

cittaruvayyi yedalO cEri
intaTi alajaDi rEpagaligitE
naalO paityamu pencagaligitE
nuvvE koncemu kanikaramandi
centana cEri kuSalamaDigitE ?

taTTukunenu nilabaDagalanaa ?
enDu kaTTelaa bigusukupOnuu
maaTalu raaka taDabaDipOnuu
anduke peTTaka E ibbandii
centaku raakE candana gandhii !!

Monday, December 1, 2008

ప్రేమ - ప్రగతి

వేదన వేడిని సాధన చెయ్యి
ప్రగతి పధానికి పునాదినెయ్యి
విరిగిన గుండెను బలిచేసెయ్యి
బ్రతుకును గెలుపుగ మలిచేసెయ్యి

గడవని రాత్రులు గుండెను కోస్తే
భయపడి నడకను ఆపకు నేస్తం

మబ్బులు సూర్యుని కప్పినరోజు
ఉదయం నీకిక రాదని కాదు
చీకటి నిండిన గ్రహణము నాడు
పున్నమి చంద్రుడు రాడని కాదు

కాలం కాటుకు ఒగ్గిన తలతో
చీకటి మాటున అజ్ఞాతములో
మెల్లగ సాగే నడకల సవ్వడి
పరుగుగ మార్చే సమయం ఇప్పుడు

అబ్బురపెట్టే వెలుగు తోడుగా
మబ్బులు విడివడి ఉదయం అదిగో
గగనపు ఎత్తులు నీవే నంటూ
గ్రహణం వీడిన పున్నమి అదిగో

vEdana vEDini saadhana ceyyi
pragati padhaaniki punaadineyyi
virigina gunDenu balicEseyyi
bratukunu gelupuga malicEseyyi

gaDavani raatrulu gunDenu kOstE
bhayapaDi naDakanu aapaku nEstam

mabbulu suuryuni kappinarOju
udayam neekika raadani kaadu
ceekaTi ninDina grahaNamu naaDu
punnami candruDu raaDani kaadu

kaalam kaaTuku oggina talatO
ceekaTi maaTuna ajnaatamulO
mellaga saagE naDakala savvaDi
paruguga maarcE samayam ippuDu

abburapeTTE velugu tODugaa
mabbulu viDivaDi udayam adigO
gaganapu ettulu neevE nanTuu
grahaNam veeDina punnami adigO

మౌనం

మాటలు పెదవులు దాటకపోతే
తలపులు మదిలో లేవని కాదు
ఆశను ముఖతా తెలుపకపోతే
యెదలో అలజడి లేదని కాదు
భావము బయటకు పెగలకపోతే
భారము హృదిలో లేదని కాదు

రగిలిన గాయం మానేటందుకు
కాలం నదిలో అడ్డమీదుతూ
మౌనం మందును మనసుకు పులిమి
ముందుకు సాగే పయనం నాది

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

మౌనం మందును మనసుకు పులిమి
ఆగక సాగే పయనం నాది


maaTalu pedavulu daaTakapOtE
talapulu madilO lEvani kaadu
aaSanu mukhataa telupakapOtE
yedalO alajaDi lEdani kaadu
bhaavamu bayaTaku pegalakapOtE
bhaaramu hRdilO lEdani kaadu

ragilina gaayam maanETanduku
kaalam nadilO aDDameedutuu
mounam mandunu manasuku pulimi
munduku saagE payanam naadi

Opika paTTE samayam lEdu
aavali teeram darilO lEdu
ukkiri bikkiri cEsE alalaku
bhayapaDi aagE taruNam kaadu

mounam mandunu manasuku pulimi
aagaka saagE payanam naadi