Friday, March 20, 2009

సగం చెక్కిన శిల్పంమూర్తిగ మలిచే అతనిని చేరి
తనకు తానుగా తనకర్పించి
ఉలి దెబ్బలను తనువున ఓర్చి
సగమే కరిగిన ఆ శిలలను చూస్తే

తొలిగిన ముక్కల గుట్టల మధ్యన
విరిగిన గుండె పెంకులు కనిపిస్తాయి
బండలయిన తన ఆశలు కనిపిస్తాయి
కరిగిపోయిన తన కఠినత అగుపడుతుంది
దయనీయమయిన ఓ స్థితి కనిపిస్తుంది.

తనుచేసిన తప్పిదం తనకే తెలియదు
ఏ ఉలి పొరపాటో ఆ శిల గ్రహపాటో
బండగా తన బ్రతుకంతమవుతుందని,
ఆశగ చేరిన ఆ కొండ రాయి, ఇపుడు
బండా కాదు. శిల్పమూ కాదు.

అనుకున్నట్టుగ అంతా జరిగితే
అర్చనలందుతు హారతులందుతు
అభిషేకాల్లో మునిగి తేలుతూ
ఇలవేలుపుగా ఇడుములు దీర్చుతు
ఏగుడిలోనో కొలువుండేది.

ఏపాపమెరుగని ఆ శిల, అదిగో
దుమ్ము ధూళుల అభిషేకాల్తో
మండుటెండల హారతులందుతు
చూసే నాధుడు కరువై పోయి
రెంటికి చెడిన రేవడి నేడు.

భువిలో..
అసలా అర్హతలున్న శిలలు ఎన్నో
సగమే మలిచిన శిల్పాలెన్నో
బండగ మిగిలిన గుండెలొ ఎన్నో
పూజలు అందే మూర్తులు ఎన్నో