
చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి నిద్రకుపక్రమించిన కొలను
ఆ పక్కనే పెద్ద మర్రి చెట్టు
దానిని ఆశ్రయించిన ఎన్నో పక్షులు
అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. సాగుతున్నాయి
ఆ ఊసులాపమన్నట్టు సున్నితంగా..
ఆ కొలను.. మర్రిచెట్టును అలల చేతులతో తడుతుంది..
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
తన నొచ్చులని పువ్వులా తడిమి
దానికి నచ్చేవి మరికొన్ని... ఐనా..
అలసిన కొలను ఆపమంటుంది..
తనకు శాంతి అవసరమంటుంది..
ఐనా.. అవి సాగుతూనేఉన్నాయి ...