Wednesday, February 18, 2009

ఈ రోజు


మనసు యాతమై ఆనాటి
జ్ఞాపకాలను తోడి పోస్తుంది..
అనుభూతులు కదం తొక్కుతూ
కళ్ళముందాడుతున్నాయి..

ఆ రోజు నను వీడి పోతూ..
వీధి మలుపు దగ్గర మసక వెలుతురులో
నువ్వు కలిసి పోతున్నప్పుడు..
ఉప్పగా తగిలిన ఆ ఉప్పొంగిన భావాలు !
తిరిగి బ్రతుకు తున్నాయి.

మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని ఆ రెండు చుక్కలు !!
నేటికీ ఉన్నట్టున్నాయి .

ఎందుకో ఈ రోజు నీ తలపు పవనాలు
జ్ఞాపకాలకు మూర్కొని కురుస్తున్నాయి .
గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది.. ఒలుకుతుంది.
నిండిన కంటి పున్తల్లో నుంచి
నా ప్రస్తుతం నీటి పొరల వెనక
లీలగా కదులుతూ కనిపిస్తుంది..

ఆ మనసే ..

బంధాలల్లిన బూజు గూటిలో
బరువెక్కిన మనసూగుతోంది

ఆశగాలి దాన్ని రాలుస్తుందో
ఆ గూడే ఆసాంతం పెనవేస్తుందో
బాధ సాలీడే పెకలిస్తుందో
ఆగని కాలం మాత్రం
ఆ ఆటని ఆత్రంగా చూస్తుంది

ఆటలో గెలుపోటములు ఎవరివైనా
ఆర్తిని ఆశ్రయించేది,
ఆర్తనాదాలు ఆలపించేది
అశృధారలు ఆహ్వానించేది,
అలుపుని ఆస్వాదించేది
చివరికోటమిని ఆనందించేది ఆ మనసే..
ఆ మనసే ..