Friday, January 23, 2009

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని

చల్ల గాలి మోసుకొచ్చె నేల తడుపు గంధాన్ని
పల్లె అంత సందడాయె చూడు దాని అందాన్ని

పురినిప్పి నెమలి నడిచె కురులిప్పి చెట్టులూగె
చుక్క పట్ట నోరుతెరిచి పిల్లలేమొ బయటకురికె
ఇంట బిడ్డ గుర్తు రాగ పరుగునొచ్చె పాల పిట్ట
నల్ల మబ్బు నింగిలోన సందడంత చూడవచ్చె !! చల్ల గాలి

విరగ బూసినప్పడాలు కోయు భామలక్కడ
సేదదీరు ఊరగాయ ఖైదుచేసిరిక్కడ
పంచెగుట్ట పొదివిపట్టి పిల్లగాని పరుగులు
గాదె మూతదొరకపోతె తాత చేయు చిందులు !! చల్ల గాలి

చినుకు లేమొ పందెమేసి ఒకటి ఒకటి నేల రాలె
చెంగు నెత్తి నెట్టుకుని పల్లె పడతి నాట్యమాడె
బసవ బండి దాన్నిచూసి తాళమేసె జోరులోన
ఆశపూసి రైతు నేడు మునిగిపోయె పాటలోన !! చల్ల గాలి

మడుగులోన గంతులేసి పిల్లగాళ్ళ ఆటలు
చూరు నుంచి నేల జారు వాననీటి నాట్యము
వెదురుపొదలు మొదలుపెట్టి ఈలనోటి పాటలు
నాట్లు వేయ రండి అంటు పోలిగాడి కేకలు !! చల్ల గాలి

తోకముడిచి వణికిపోతు చూరుకింద కుక్కలు
చెరువులోని బాతులెట్టె చెట్టుకింద గుంపులు
వంట ఇంట్లో పొయ్యి పక్క చేరిమూల్గె పిల్లి కూన
తనకేమీ పట్టనట్టు గానుగలోన తిరుగు ఎద్దు !! చల్ల గాలి

కప్పు పైకి పాకి పోయి రెల్లు గడ్డి కప్పేటోళ్ళు
నట్టింట్లో బిందెలోకి నీళ్ళు పట్టి పోసెటోళ్ళు
పార పట్టి తోటలోకి నీళ్ళ దారి పెట్టేటోళ్ళు
చుట్టగట్టి రచ్చబండ పిచ్చపాటి జెప్పేటోళ్ళు !!

చల్ల గాలి వెక్కిరించె హైటెక్కు జీవితాల్ని
అవ్వినేడు మరిచిపోయె పల్లె బ్రతుకు పరువాల్ని

పట్టణాల వీధి లోన నల్ల మట్టి తావి ఏది
కాంక్రీటు కొంపలోన రెల్లు గడ్డి వాసనేది
టీవి ముందు సోఫాలో రచ్చబండ చర్చలేవి
స్టీలుపొయ్యి మంటల్లో గాదె తిండి బలాలేవి !! చల్ల గాలి

4 comments:

  1. ఆహాహా.. ఎంత చక్కగా రాసారండీ..!
    ఆత్రేయ గారి కలం నుంచి మీ కలంలోకి కూడా కాస్త ఇంకు చేరినట్టుంది.
    మధురమైన కవితలు రాస్తున్నారు.
    విరగబూసిన అప్పడం, చినుకు చినుకు పందెం వేసుకోవడం.. ఎంత చక్కటి ప్రయోగాలు.. నిజంగా చాలా చాలా బాగా రాసారండీ..!!

    ReplyDelete
  2. అబ్బో..... అదిరింది.

    ReplyDelete
  3. భలేవుంది
    చిరుజల్లులో తడిసినట్టూ
    చలిగాలికి వణికినట్టూ
    జ్ఞాపకమేదో మెదిలినట్టూ


    విరగ బూసినప్పడాలు కోయు భామలక్కడ ఇది అర్ధంకాలేదు ,ఎందుకో

    ReplyDelete
  4. మధురవాణి గారు ధన్యవాదాలు.. అంత పెద్ద పోలికలు ఒద్దులేండి. ఏదో ఆయన అభిమానిని అయినందుకు ఆ గాలి కాస్త వీచి ఉంటుంది.

    పద్మార్పిత గారు ధన్యవాదాలు.

    లలిత గారు. ధన్యవాదాలు. మాఇంటి రెల్లి గడ్డి కప్పుమీద, తెల్లని పాత పంచె మీద, అప్పడాలు ఆర బెట్టే వారు. వానొస్తే పరుగెత్తి కెళ్ళి వాటిని తెచ్చేవాళ్ళము. అలా కప్పు మీద ఎండిన అప్పడాలను, విరగ పూసిన అప్పడాలు అన్నాను.

    ReplyDelete