చేసే పూజల ధూపం ఏమౌతుంది
చెప్పే బాధల భారం ఎటుపోతుంది
అర్పించే గుండె చెక్కల భోగాలకు అంతాలెప్పుడు
మండే మనసుల హారతులకు అర్ధాలెప్పుడు
వేదన గీతాల మంత్రాల నేపధ్యంలో
పెక్కు ప్రసాదాలు కడుపార మెక్కుతూ
తొణకని నీ బూటకపు చిరునవ్వు
నా అసహాయతకు వెక్కిరింపా?
నా అమాయకత్వానికి కనువిప్పా?
తీరని ఆశల కోతలో
మండే గుండెల బాధలో
అడిగిన ఆశ్రిత జీవిని
అన్యధా అనుకోకు స్వామీ !!
Monday, November 10, 2008
(దివం ) గత ప్రస్తుతం
నవ్విస్తూ కవ్విస్తూ కేరింతలు కొట్టేస్తూ
గత ప్రస్తుతాన్ని బంధించ లేకపోయాను
కనీసం ఈ ప్రస్తుతానికి దాంట్లో కొంతైనా
కొన సాగించలేకపోయాను
ఓటమి తప్పని పోరాటాలు
గెలిచి ఓడిన సంఘటనలు
నిర్లిప్తంగా సర్దుకుపోయిన సన్నివేశాలు
నన్ను నానుండి కొంచెం కొంచెంగా దూరం చేస్తుంటే
నిస్సత్తువగా చూస్తూ ఉండిపోయాను ..
ఇపుడు..
గడిచిన కాలం జ్ఞాపకంగా వదిలిన
అద్దం ముక్కల్ని ప్రేమగా తుడుచుకుని
ఆ చెదిరిన బింబాల్లో ఆ పాత నన్ను
ఆతృతగా వెతుక్కుంటున్నాను..
ఆప్యాయంగా హత్తుకుంటున్నాను
Subscribe to:
Posts (Atom)