Showing posts with label నిజం. Show all posts
Showing posts with label నిజం. Show all posts

Thursday, November 19, 2009

ఎవరికోసం .. ?


బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ...

బాధ కాల్చమంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
చివరి మూల్గు దేనిఓసం ...

బంధాలు త్రుంచమంటూ
అదిరే పెదవుల అభ్యర్ధన,
ఆత్మ సమర్పణ ఎందుకోసం ...

కురిసి వెలిసిన నింగి వెలితి
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
మరో మెరుపుకై తడుముకుంటూ..

చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..
రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..

ఎవరికోసం .. ?

Wednesday, May 20, 2009

నీది గెలుపెలా అవుతుంది ?


ముఖాన పచ్చపోసుకున్న
ఆ పన్నెండు మైలు రాళ్ళేగా
నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా..

ఐనా అవి దాటిన ప్రతిసారీ
నా గుండెలవిసేలా అరచి మరీ చాటింపేస్తావు
వెనక బడ్డ నన్ను చూసి గేలిచేస్తావు

నీ పరుగుకు మూడు కాళ్ళు ..
మరి నాకూ.. ఎన్ని అడ్డంకులేస్తావు ?
ఎందుకెగతాళి చేస్తావు ?

నేనే లేనప్పుడు, నీకస్థిత్వమేదీ ?
నా బ్రతుకంతా నిన్ను నింపుకున్నానే
నువ్వు నాకిచ్చేదేమిటి ?

ప్రమేయం లేకుండానే జారిపోతావు..
ఆపడానికెన్ని చేశాను ?
నిన్ను గోడకు శిలువేశానే ..

ఐనా అవిశ్రాంతంగా.. నా బ్రతుకు బాట వెనక
అగాధాలను తవ్వుతూనే ఉంటావు..
గమ్యం కానరాకుండా..
ముందు మలుపులు తిప్పుతూనే ఉంటావు.

దాటిపోయేదాకా .. వెనకున్నావని తెలియదు..
నా ఓటమే.. నీ గెలుపుకి సాక్షి.

ఈ ఆట ఏకపక్షంగా లేదూ..?
నీది గెలుపెలా అవుతుంది ?




Tuesday, May 5, 2009

మనలానే !!


ప్రమిద క్రింద చీకటిలా
దోబూచులాడుతూ ..
ఆ నీడన స్థిరత్వం వెదుక్కుంటూ..

సెలయేరులో గులకరాళ్ళలా
ఒదిగిపోయి.. కాలంతో కోసుకుపోతూ
మృదుత్వం మొహాన పులుముకుంటూ..

రహదారిలో మైలురాయిలా
నిస్వార్ధంగా.. దారి చూపుతూ ..
చేతనలుడిగి పాతుకుపోతూ..

ఒకదానికొకటి తోడుగా.. ఎప్పటికీ.. 
ఐనా..ఎన్నటికీ కలవని బంధాలవి ...

మనలానే !!

Monday, April 27, 2009

నిర్ద్వందత్వమా ?


గుండె తూట్లు పొడిచి
మెడలో సూత్రాన్ని కట్టాను

తాడు ఒడిసి పట్టి
ఎదురు గాలికి ఎదురీదమన్నాను

నిలవడంకోసం,
తనను నిలపడం కోసం
బాధ్యతలను తగిలించాను

దిక్కులు చూస్తూ విలవిలలాడే
తనని చూస్తూ మురుస్తున్నాను..

మనసు ఫణంగా పెట్టి మిన్నకుంది.

ఇది నా కర్కశత్వమా?
తన నిర్ద్వందత్వమా ?
ఆ పటానికే తెలియాలి.

Wednesday, April 22, 2009

విలవిలలాడేం లాభం ?


విరిగిన బంధం విలువెరిగి
చెంపల గీతలెన్ని తుడిచినా
ముడులు బిగవవు.

పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.

వీడిన నిద్దుర సుఖమెరిగి
నిలచిన తనువులెంత తూలినా
తనివి తీరదు.

జారిన మాటల పదునెరిగి
తెగిన తావుల నెంతకుట్టినా
గాయమారదు.

అందని కోర్కెల తీపెరిగి
ఎంతో కాలం ప్రాకులాడినా
అంత మగుపడదు.

అంతా వీడిన ఆవల
విలవిలలాడేం లాభం ?

Thursday, April 16, 2009

అర్ధాంగివయ్యేదానివి.


నన్ను నన్నుగా చూస్తావు చూపిస్తావు ...
నువ్వు నేనై పోతావు ..

నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే
నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.

నీకెంత దూరమైనా..
నిను చూడక పోయినా..
నాకోసం అలానే..
ఆబగా ఎదురు చూస్తూ..నిల్చుంటావు
నీగుండె పగిలినా.. నిశ్చలంగా..
నన్ను నీ గుండెల్లోనే దాచుకుంటావు

ఎద్దేవా చెయ్యకుండా..
నాలో ఎన్ని తప్పులు చూపి దిద్దుకోమన్నావు..
నన్ను మెరుగు చేయాలన్న తపన నీది
అది ఒకటే తపస్సు నీకు
మళ్ళీ మళ్ళీ చెప్పడానికైనా వెనుకాడవు
ఏమనుకుంటానో అనీ చూడవు.
ఎందుకీ అనురాగం ? ఏమిటీ అనుబంధం ?
ఇంత ఆప్యాయతా ? ఎందుకూ ?

కాల గతిలో నేను కొట్టుకుపోయినా
తిరిగొచ్చినా.. రాకపోయినా..
నీ దరి చేరినా.. చేరక పోయినా..
అలా నాకోసం ఎదురు చుస్తూ..

ఎందుకు ?
నీకంటూ ఏ ఆశలుండవా ?
నీ బ్రతుకు నీకు లేదా ?
నాతోనే ఎందుకు పెనవేసుకున్నావు ?

ఇలా నిర్జీవంగా.. నిశ్చలంగా..
నిర్మలంగా.. నాకోసం..
నేను నీకేమి చేశానని ?
ఎలా ? ఎందుకు ?..

నా గుండె కరిగిపోతోంది..
మనసు అట్టుడికిపోతోంది..
నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ?

నీకేమి చెయ్యగలను ?
అద్దమయిపోయావు ... అమ్మాయివైతే
అర్ధాంగివయ్యేదానివి.

Thursday, March 19, 2009

దేవుడెక్కడ ?



ప్రపంచమేలే ధరణీ నాధుడు
కొండ బండలో నాకగుపడరాడు

పాపం పుణ్యం ఎరుగని పాపడు
ఫక్కున నవ్వి పళ్ళికిలిస్తూ
ప్రక్కన చేరి కన్నులు కలిపితే
అప్పుడగుపడుతాడేఈశ్వరుడైనా ..

చక్కగ తలపై లాలబోసుకుని
తుడిచే తలను నిలపక తిప్పుతు
ఆ బుజ్జి చేతుల పికబూ లల్లోనే
అగుపడుతాడేఈశ్వరుడైనా ..

గోడబట్టుకుని నిల్చుట నేర్చి
ఒడుపును విడి చతికిల బడి
ఆ బుంగ మూతి దొంగేడుపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..

తపతప మని అడుగులు వేస్తూ
త్వరగా పరుగిడి బోర్లా పడి
తిరిగిలేచి విసిరే గర్వపు చూపులో
అగుపడుతాడేఈశ్వరుడైనా ..


తప్పని నరకము బ్రతుకున గంటూ
అమ్మా అన్న ఆర్తి పిలుపుకు పరుగున వచ్చి
తలనొడిలో చేర్చి నిమిరే కంటిలొ
రాలేచుక్కలో అగుపడుతాడేఈశ్వరుడైనా..

ఆకలి కడుపులు ఎండిన రొమ్ములు
బువ్వడిగే ఓపికలేక..లోతుకళ్ళతో లోకంచూసే
బీద తల్లికి అన్నం పెట్టి అక్కున చేర్చే
ఆ ఆగంతకుడిలో అగుపడుతాడేఈశ్వరుడైనా..

ప్రేమ పంచన, ప్రకృతి అంచున
ప్రాగ్దిశ ఝామున, పశ్చిమ సంధ్యన
పాప నవ్వులో విరిసిన పువ్వులో
కరిగిన గుండెలో, తడిసిన కంటిలో
అగుపడుతాడేఈశ్వరుడైనా
..

ఎక్కడ లేడని.... కానీ..
నాకగుపడేదా చెప్పిన చోట్లే ...

Wednesday, January 21, 2009

జ్ఞాపకం

నా గారాల పట్టి ఈరోజు ఎందుకో
గతంలో నుండి దోబూచు లాడుతుంది
కలల బంధనాలు తెంచుకుని
కవ్విస్తూ వాస్తవంలో తిరుగాడుతుంది
పట్టి బంధించలేని నిస్సహాయత
తన వెనకనే తిరుగుతూ వెక్కిరిస్తుంది

తను అందంగా ఆనందంగా తిరిగుతూ నవ్వించినా కవ్వించినా
అది నిజం కాదన్న నిజం ఆశ దీపాన్ని ఆర్పేందుకు చూసే చిరుగాలిలా
చెంపలని తడుతుంది చెమ్మ ముసుగు తనని తిరిగి దాచేస్తుంది

రంగుల అబద్ధాల గదుల్లో నేను కొట్టిన కేరింతలు
నిజం తెరలు తగిలి కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి,
గుండె గోడల్లో లయలుగా ఇరుక్కుపోతున్నాయి

ఎందుకో ఈరోజు నా చిన్నారి గతం తలుపులు తీసి
మనసు ముంగిట్లో కేరింతలు కొడుతుంది
జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది
కళ్ళల్లో కలల్ని ఒలక బోస్తుంది

తిరిగి తెరలవెనక ఆమె మాయమవుతుంది
అబద్దంగానైనా ఆశ ఆనందంగా ఆవులిస్తుంది
ఆదమరుస్తుంది

Saturday, January 17, 2009

నువ్వంటే భయం

నువ్వంటే భయం
నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తావనో
నీ అస్థిత్వ రూపం అగుపడదనో
అసలున్నావో లేవనో. ఒకటే భయం
ఐనా నీకోసమే శోధన నిను కానని వేదన

నువ్వంటే భయం
నీ వికృత రూపం చూడలేమనో
నీ నీడల కరాళ నృత్యం చూసో
అసలేరూపం నీకు లేదనో. ఒకటే భయం
ఐనా నీకోసమే పోరాటం, తీరని ఆరాటం

నువ్వంటే భయం
అంది ఆత్మ సాక్షితో నిలవలేననో
తెలిసి నన్నే ద్వేషిస్తామనో
పొందక బంధం తెంపలేమనో, ఒకటే భయం
ఐనా నీకోసమే ఈ చూపులు, పడి గాపులు

నిజం నువ్వంటే భయం
అవును నిజం నువ్వంటే భయం .

Sunday, December 7, 2008

రైలు స్టేషను

పుట్టింటికొచ్చిన నిండు చూలాలు
అస్సు బుస్సంటు మెల్లగా
బంధువులంతా చూస్తుండగా
బాధ గా మూల్గుతూ గట్టు పైన చేరింది

నెలలు నిండినట్టున్నాయి
వందల కళ్ళకు వెలుగు నివ్వగల పాపలు
కొంప తడిసిన గండు చీమల్లా
బిలబిల మని పుట్టుకొచ్చాయి

వారి బ్రతుకు భారాన్ని తాము మోస్తామని
కట్నమడిగే ఎర్రచొక్కా మేన మామలతో
తన కడుపాకలి పొట్లాను కట్టి
బటణీలని అబద్ధమాడి పైసలడిగే తమ్ముళ్ళతో

తనపని ముగిసిందని తలుపు తాళమెట్టి
చేతులు దులుపుకుని బయటకెల్లే తాతలతో
ఇవేమి పట్టనట్టు నీళ్ళాడి
తలోదారి పట్టిన పచ్చి బాలింతలతో

నిజ జీవితానికో అద్ద మాకూడలి



puTTinTikoccina ninDu cuulaalu
assu bussanTu mellagaa
bandhuvulantaa cuustunDagaa
baadha gaa muulgutuu gaTTu paina cErindi

nelalu ninDinaTTunnaayi
vandala kaLLaku velugu nivvagala paapalu
kompa taDisina ganDu ceemallaa
bilabila mani puTTukoccaayi

vaari bratuku bhaaraanni taamu mOstaamani
kaTnamaDigE erracokkaa mEna maamalatO
tana kaDupaakali poTlaanu kaTTi
baTaNeelani abaddhamaaDi paisalaDigE tammuLLatO

tanapani mugisinDani talupu taaLameTTi
cEtulu dulupukuni bayaTakellE taatalatO
ivEmi paTTanaTTu neeLLaaDi
talOdaari paTTina pacci baalintalatO

nija jeevitaanikO adda maakuuDali

Wednesday, December 3, 2008

కాసే దమ్మీగుండెలకుంది

కార్గిల్‌ గుండెలొ చిందిన రక్తపు
మరకలు ఇంకా చెరగనెలేదు
ముంబాఇ వీదిలొ పేలిన బాంబుల
ప్రతిధ్వనులింకా అణగట్లేదు

గాయంపైనా కారమద్దుతు
నపుంసకత్వము ఎత్తిచూపుతు
అమాయక జనాల్ని అంతంచేసే
వికృతచేస్ఠులు ఎదురు నిలిస్తే

శాంతి పేరుతో చేతులు కట్టి
రెండో చెంపను వారికి చూపే
రాజకీయపు నిర్వీర్యతలో
ఎంతకాలమీ అణిగిన బ్రతుకులు ?

చంద్రుని పైన జెండా పెట్టాం
పైరేట్టు షిప్పును మట్టం చేశాం
అంటూ గంతులు వేసేస్తున్నాం
బాంబుల బెడ్డుపై నిదురిస్తున్నాం

తళతళలాడే తుపాకులుండీ
తలలు తీయగల సైన్యం ఉండీ
బరితేగించిన మత పిశాచులను
మసిగా మార్చే తరుణం రాదే ?

స్వతంత్రమొచ్చీ భయంగ బ్రతికే
బానిస బ్రతుకులు మనకిక వద్దు
శాంతి మంత్రము తాతకు వదిలి
భద్ర కాళివై బయటకు కదులు

సుబాసు బోసు భగత్‌ సింగుల
ఉడుకు రక్తము మనలో ఉంది
అందిన కత్తిని ఒడిసి పట్టుకుని
ముష్కర తలలను కసిగా తీద్దాం

తల్లిని తమ్ముని కాపాడెందుకు
నేతల సలహాలక్కరలేదు
పిచ్చిదొ మంచిదొ కత్తొకటియ్యి
కాసే దమ్మీగుండెలకుంది


kaargil gunDelo cindina raktapu
marakalu inkaa ceraganelEdu
mumbaai veedilo pElina baambula
pratidhvanulinkaa aNagaTlEdu

gaayampainaa kaaramaddutu
napumsakatvamu etticuuputu
amaayaka janaalni antamcEsE
vikRtacEsThulu eduru nilistE

Saanti pErutO cEtulu kaTTi
renDO cempanu vaariki cuupE
raajakeeyapu nirveeryatalO
entakaalamee aNigina bratukulu ?

candruni paina jenDaa peTTaam
pairETTu shippunu maTTam cESaam
anTuu gantulu vEsEstunnaam
baambula beDDupai niduristunnaam

taLataLalaaDE tupaakulunDii
talalu teeyagala sainyam unDii
baritEgincina mata piSaaculanu
masigaa maarcE taruNam raadE ?

swatantramoccii bhayamga bratikE
baanisa bratukulu manakika vaddu
Saanti mantramu taataku vadulu
kraanti padhamlO bayaTaku kadulu

subaasu bOsu bhagat singula
uDuku raktamu manalO undi
andina kattini oDisi paTTukuni
mushkara talalanu kasigaa teeddaam

tallini tammuni kaapaaDenduku
nEtala salahaalakkaralEdu
piccido mancido kattokaTiyyi
kaasE dammeegunDelakundi

Monday, December 1, 2008

ప్రేమ - ప్రగతి

వేదన వేడిని సాధన చెయ్యి
ప్రగతి పధానికి పునాదినెయ్యి
విరిగిన గుండెను బలిచేసెయ్యి
బ్రతుకును గెలుపుగ మలిచేసెయ్యి

గడవని రాత్రులు గుండెను కోస్తే
భయపడి నడకను ఆపకు నేస్తం

మబ్బులు సూర్యుని కప్పినరోజు
ఉదయం నీకిక రాదని కాదు
చీకటి నిండిన గ్రహణము నాడు
పున్నమి చంద్రుడు రాడని కాదు

కాలం కాటుకు ఒగ్గిన తలతో
చీకటి మాటున అజ్ఞాతములో
మెల్లగ సాగే నడకల సవ్వడి
పరుగుగ మార్చే సమయం ఇప్పుడు

అబ్బురపెట్టే వెలుగు తోడుగా
మబ్బులు విడివడి ఉదయం అదిగో
గగనపు ఎత్తులు నీవే నంటూ
గ్రహణం వీడిన పున్నమి అదిగో

vEdana vEDini saadhana ceyyi
pragati padhaaniki punaadineyyi
virigina gunDenu balicEseyyi
bratukunu gelupuga malicEseyyi

gaDavani raatrulu gunDenu kOstE
bhayapaDi naDakanu aapaku nEstam

mabbulu suuryuni kappinarOju
udayam neekika raadani kaadu
ceekaTi ninDina grahaNamu naaDu
punnami candruDu raaDani kaadu

kaalam kaaTuku oggina talatO
ceekaTi maaTuna ajnaatamulO
mellaga saagE naDakala savvaDi
paruguga maarcE samayam ippuDu

abburapeTTE velugu tODugaa
mabbulu viDivaDi udayam adigO
gaganapu ettulu neevE nanTuu
grahaNam veeDina punnami adigO

Thursday, October 30, 2008

దూరం

నీ గత గ్రంధాల్లో
నాదొక ఊసుందని చెప్పు
నీవైన జ్నాపకాల్లో
నాకొక చోటుందని చెప్పు
నీ కొచ్చే చిరు నవ్వుకు
నేనో కారణమని చెప్పు

కొన్ని చెప్పకుండా అర్ధం అవుతాయి
కానీ కొన్ని చెపితే అందాన్నిస్తాయి

నా ప్రశ్నకు బదులేదైనా
నీ అందలాలకు నే సోపానమనీ
సౌఖ్యానికి సమిధననీ
తిమిరాలకి ప్రమిదననీ
తెలుసేమో ఐనా నాకోసం
తిరిగి చెపుతున్నా.. అవును నాకోసం

నీకు నాకు మధ్య
శత కోటి సముద్రాల దూరమున్నా
నాకు నీకు మధ్య
ఓ పిలుపు దూరమే

నోరారా పిలువు
మనసారా వస్తాను

నేను

నిజమిది అని ఒప్పుకోను
అబద్ధమని మరువలేను
తప్పు నాదని తలవంచలేను
ఒప్పు ఇది అని ఎదిరించలేను

అందుకే..

గుండె రగిలిన మంటల్లో
చలి కాచుకుంటూ..
మనసు ముసురుల్లో
తల దాచుకుంటూ..

ఏకాంత క్షణాల్లో
నిను వెదుక్కుంటూ..
గొంతులో గరళాన్ని
దాచేసుకుంటూ..

నీకోసం..

నేనున్నానని ఊతమిస్తున్నా
నేనుంటానని మాటనిస్తున్నా
నీ సుఖాన్నే కోరుకుంటున్నా..

నాకెవరున్నారు నువ్వు కాక ?
అందుకే.. కడదాకా నా కడదాకా..
నీ.. అవును ఎప్పటికీ నీ..

..నేను

nijamidi ani oppukOnu
abaddhamani maruvalEnu
tappu naadani talavancalEnu
oppu idi ani edirincalEnu

andukE..

gunDe ragilina manTallO
cali kaacukunTuu..
manasu musurullO
tala daacukunTuu..

Ekaanta kshaNaallO
ninu vedukkunTuu..
gontulO garaLaanni
daacEsukunTuu..

neekOsam..

nEnunnaanani uutamistunnaa
nEnunTaanani maaTanistunnaa
nee sukhaannE kOrukunTunnaa..

naakevarunnaaru nuvvu kaaka ?
andukE.. kaDadaakaa naa kaDadaakaa..
nee.. avunu eppaTikee nee..

..nEnu

Tuesday, October 21, 2008

మమకారం

నకారాల కవిత నప్పింది కాబోలు
మమకార మీరోజు గుప్పించుతుంది
న నో ల అర్జీలు నచ్చాయి కాబోలు
ఈరోజు మాటల్లో ముంచెత్తుతుంది
నా భావమిన్నాళ్ళకందింది కాబోలు
తనతోటి నా నడకనందించ మంది
అనిపించి ఆ మాటలన్నాను గానీ
నొప్పించి నీ తోడు పొందాలనిగాదు
కవితలో భావాలు ఏమైనా గానీ
నీకు నచ్చని పనులేవి నాకోసమైనా
చెయ్యకున్నా నాకు చెల్లునే చపలా !!


nakaaraala kavita nappindi kaabOlu
mamakaara meerOju guppincutundi
na nO la arjeelu naccaayi kaabOlu
eerOju maaTallO muncettutundi
naa bhaavaminnaaLLakandindi kaabOlu
tanatOTi naa naDakanandinca mandi
anipinci aa maaTalannaanu gaanee
noppinci nee tODu pondaalanigaadu
kavitalO bhaavaalu Emainaa gaanee
neeku naccani panulEvi naakOsamainaa
ceyyakunnaa naaku cellunE capalaa !!