నా గారాల పట్టి ఈరోజు ఎందుకో
గతంలో నుండి దోబూచు లాడుతుంది
కలల బంధనాలు తెంచుకుని
కవ్విస్తూ వాస్తవంలో తిరుగాడుతుంది
పట్టి బంధించలేని నిస్సహాయత
తన వెనకనే తిరుగుతూ వెక్కిరిస్తుంది
తను అందంగా ఆనందంగా తిరిగుతూ నవ్వించినా కవ్వించినా
అది నిజం కాదన్న నిజం ఆశ దీపాన్ని ఆర్పేందుకు చూసే చిరుగాలిలా
చెంపలని తడుతుంది చెమ్మ ముసుగు తనని తిరిగి దాచేస్తుంది
రంగుల అబద్ధాల గదుల్లో నేను కొట్టిన కేరింతలు
నిజం తెరలు తగిలి కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి,
గుండె గోడల్లో లయలుగా ఇరుక్కుపోతున్నాయి
ఎందుకో ఈరోజు నా చిన్నారి గతం తలుపులు తీసి
మనసు ముంగిట్లో కేరింతలు కొడుతుంది
జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది
కళ్ళల్లో కలల్ని ఒలక బోస్తుంది
తిరిగి తెరలవెనక ఆమె మాయమవుతుంది
అబద్దంగానైనా ఆశ ఆనందంగా ఆవులిస్తుంది
ఆదమరుస్తుంది