Thursday, November 6, 2008

ఓ ప్రశ్న

కాల చక్రానికి కట్టబడి
విధి రాసిన వీధుల్లో
నా ప్రమేయం లేకుండానే
అశక్తుడిగా, విసుగు లేక
అలవాటైపోయి బ్రతికేస్తున్నా ...
ఎక్కడికి ఎందుకు ఎంతకాలం
వంటి ప్రశ్నలు వేసినా
గతుకుల గమనానికి
అర్ధాల్లేని అపశబ్దాలుగానే
మిగిలిపోతున్నాయి, రాలి పోతున్నాయి
ఐనా ఎవరిని అడగను
అటువంటి చక్రాలు ఎన్నో
దారి పొడవునా, విరిగినవి కొన్నైతే..
ఇరుసు వరకు అరిగినవి మరి కొన్ని
అదో విధిగా సాగిపోతున్నాయి
రాలిన ఆక్రందనల గుట్టల మధ్యగా,
చెదిరిన గుండెల చీకట్లను చీల్చుకుంటూ,
తన అస్థిత్వాన్ని ఆవిష్కరించుకుంటూ
ప్రస్ఫుటంగా ప్రతి చక్రం నుండి ఓ కాంతి పుంజం
అంత నిస్సహాయతలోనూ, నాలా ..
ప్రతి వాడి లోనూ మెరిసే ఆశా కిరణమది
ఆతరి ఓ ద్వందోదయం, పరిష్కరించగలిగితే
తిమిర సంహారము, ఆపై విముక్తి !!
అవధరించండి..
అది మనిషిని చక్రానికి కట్టేసిన బంధమా ?
బందీగా వాడు బ్రతికేందుకు ఓ మార్గమా ?


kaala cakraaniki kaTTabaDi
vidhi raasina veedhullO
naa pramEyam lEkunDaanE
aSaktuDigaa, visugu lEka
alavaaTaipOyi bratikEstunnaa ...
ekkaDiki enduku entakaalam
vanTi praSnalu vEsinaa
gatukula gamanaaniki
ardhaallEni apaSabdaalugaanE
migilipOtunnaayi, raali pOtunnaayi
ainaa evarini aDaganu
aTuvanTi cakraalu ennO
daari poDavunaa, viriginavi konnaitE..
irusu varaku ariginavi mari konni
adO vidhigaa saagipOtunnaayi
raalina aakrandanala guTTala madhyagaa,
cedirina gunDela ceekaTlanu ceelcukunTuu,
tana asthitvaanni aavishkarincukunTuu
prasphuTamgaa prati cakram nunDi O kaanti punjam
anta nissahaayatalOnuu, naalaa ..
prati vaaDi lOnuu merisE aaSaa kiraNamadi
aatari O dvandOdayam, parishkarincagaligitE
timira samhaaramu, aapai vimukti !!
avadharincanDi..
adi manishini cakraaniki kaTTEsina bandhamaa ?
bandiigaa vaaDu bratikEnduku O maargamaa ?

తరం మారుతుంది

'అమ్మా' మార్చి ఓమాం అంటూ
'నాన్న ' ను చంపి పాపా చేస్తూ
మమకారానికి అర్ధం వెదుకుతూ
యువతరం సాగుతుంది మనతరమాగుతుంది

అక్షర మాలకు మంగలులవుతూ
ఎంగిలి భాషకు బానిస లవుతూ
బా భా శా షా తేడా తెలియక
ఈ తరం సాగుతుంది మన తరమ్మరుగవుతుంది

రామా అంటే ఎ గై విత్‌ యారోస్‌
హనుమానెవరు? మంకీ గాడ్‌
ఇతిహాసాన్నీ కార్టూన్‌ గానే ఎంజోయ్‌ చేస్తూ
ఈ తరం జారుతుంది మనతరమోడుతుంది

పంచెలు నాడే గొట్టాలయ్యెను
ఓణీలెపుడో స్కర్టుగ మారెను
ఫేషన్‌ పేరుతో అవీ చించుకుని అదిగో
నవతరమూగుతుంది నా తరం మండుతుంది

నవ తరం సాగుతుంది మన తరం జారుతుంది
తరం మారుతుంది భవిత స్వరం మారుతుంది

'ammaa' maarci Omaam anTuu
'naanna ' nu campi paapaa cEstuu
mamakaaraaniki ardham vedukutuu
yuvataram saagutundi manataramaagutundi

akshara maalaku mangalulavutuu
engili bhaashaku baanisa lavutuu
baa bhaa Saa shaa tEDaa teliyaka
ee taram saagutundi mana tarammarugavutundi

raamaa anTE e gai vit yaarOs
hanumaanevaru? mamkee gaaD
itihaasaannee kaarTuun gaanE enjOy cEstuu
ee taram jaarutundi manataramODutundi

pancelu naaDE goTTaalayyenu
ONeelepuDO skarTuga maarenu
fEshan pErutO avee cincukuni adigO
navataramuugutundi naa taram manDutundi

nava taram saagutundi mana taram jaarutundi
taram maarutundi bhavita svaram maarutundi

అనుభూతి

వలయంలా చందన
కాష్టాలను పేర్చుకుంటూ
వాటి మన-సు-గంధాలను
మనసారా ఆఘ్రాణిస్తూ
నుదుటినంటిన ఆకాశ
సింధూరాలను చెరుపుకుంటూ
ప్రజ్వలిత హిరణ్యగర్భుని
తలక్రింద ప్రేమగ పొదువుకుంటూ
నిష్కల్మషమైన నిప్పుకు
ప్రక్షాళిత నివురునవుతూ
నా గాధకు జ్ఞాపకమవుతూ
హవ్యవాహనుడి ఆలింగనాలలో
ప్రతి కణమూ తనలో కలుపుకుంటూ
తనువు నీడుస్తూ, తపన చాలిస్తూ
చీకట్లు కాలుస్తూ భువిని గెలుస్తూ
చిటఫటార్భాట పరిష్వంగనల్లో
ధూప విలయ నృత్య సాక్షాత్కారంతో
ముగిసిన కల అదో అవ్యక్తానుభూతి !!



valayamlaa candana
kaashTaalanu pErcukunTuu
vaaTi mana-su-gandhaalanu
manasaaraa aaghraaNistuu
nuduTinanTina aakaaSa
sindhuuraalanu cerupukunTuu
prajvalita hiraNyagarbhuni
talakrinda prEmaga poduvukunTuu
nishkalmashamaina nippuku
prakshaaLita nivurunavutuu
naa gaadhaku jnaapakamavutuu
havyavaahanuDi aalinganaalalO
prati kaNamuu tanalO kalupukunTuu
tanuvu neeDustuu, tapana caalistuu
ceekaTlu kaalustuu bhuvini gelustuu
cHiTapHaTaarbhaaTa parishwanganallO
dhuupa vilaya nRtya saakshaatkaaramtO
mugisina kala adO avyaktaanubhuuti


ఈ కవిత 'పొద్దు 'లో ప్రచురించ బడింది.
http://poddu.net/?p=1028