Tuesday, April 7, 2009

ఆ వానకు అర్ధం ఉంది.




నా "వాన " కవితకు చాలా మంది స్పందించారు.. ధన్యవాదాలు.
ఆ కవితలోని మాటలు, ప్రకృతి అందాన్ని నా భావుకత జోడించి
రాసినట్లుగా మీరందరూ దాన్ని ఆస్వాదించారు.. అభినందించారు
ధన్యవాదాలు. కానీ...

మీరు గమనించారో లేదో.. ఆ కవిత లేబుళ్ళలో ఒకటి, తత్వం.
ఆ కోణంలోనుంచి ఈ కవితను ఎవరూ ఆస్వాదించలేదని నా అభిప్రాయం
ఎందుకంటే వచ్చిన వ్యాక్యలలో అది లేదు కాబట్టి. అదికూడా తెలిస్తే (కవితలోని
మాధుర్యం.. ఇంకా ఆనందింపజేస్తుందనిపించి)
ఈ వివరణ ఇస్తున్నాను...

ప్రధానంగా.. ఈ కవిత.. చాలా పోలికలతో నిండి ఉంది.. ఇదే కవితలోని కొన్ని
పదాలను మార్చి రాస్తున్నాను.. చూడండి... అవే పదాలు ఎందుకు వాడాను ?
వాటి తత్వం ఏమిటి ? వాటి నైజమేమిటి ? అన్న వి మీకే వదిలేస్తున్నాను.

అవధరించండి..


నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

కన్నీటి దారలతో,
వేదన గాలి పటాలు ఎగరేస్తూ ....... (అవి గాలి పటాలెందుకయ్యాయి ?)
బాధ చెక్కిళ్ళపై పరవళ్ళుతొక్కుతుండగా
వేడి నిశ్చ్వాసలు జగమంతా నింపుతుంది.. మనసు

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

నా ఒడిలో పడి (ఒడి అంటే ?)
మత్తుగా.. తావి లేని కన్నీరు (మరి రంగు రుచులున్నాయా ?)
పువ్వుల్లా చిందు తున్నాయి, బరువు కిరీటాలు దించుతున్నాయి (పువ్వుల్లా ఎందుకు ? కిరీటాలేమిటి ? )
ఒడిలో చేరి ఇంకి పోతున్నాయి.. మెల్లగ.. కన్నీళ్ళు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.

జారే కన్నీటి ధారల్లో
దోబూచులాడుతూ.. బాహ్యరూపం లేదుగనక
నీటి ఆసరాతో వ్యక్త మవుతున్నాయి.. (మరి చిన్న పిల్లల్లా ఎందుకన్నాను ?)
తామెక్కడున్నాయో చాటుతున్నాయి.. మనో భావాలు.


ఇప్పటికే మీతలలు వేడెక్కి ఉంటాయి. ఇక విరమిస్తాను..