Wednesday, February 17, 2010

తృప్తి


తడి మెరుపులుల్లో
కరిగిన చూపులు ..
ఉరుము ధ్వనుల్లో
మమైకమైన మౌనం ..

జడివాన జల్లుల్లో..
జోరు గాలుల్లో..
వాడిన రెక్కమందారాలు

ఎర్రబారిన చందమామను
ఎదలోతుల్లో గుచ్చేసరికి
ఏడడుగులు నడిచిన తృప్తి
వెచ్చగా తాకింది.

గుండెలపైన మరో రాత్రి
బద్ధకంగా అస్తమించింది.

Tuesday, February 9, 2010

జ్ఞాపకాల గుబాళింపు..


నిద్ర జార్చుకున్న నింగి మధ్య
విరగ పూసిన కలువ
ఆపై వేచిన తుమ్మెద పలకరింపు..

కంటి కొలకులు చూసిన
ముత్యాల పలవరింపు..

అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..
ఒడిలిన తెరల వెనకగా
ఎగబ్రాకిన వేకువ కిరణం..

వెచ్చగా ఒళ్ళిరిచుకున్న
జ్ఞాపకాల గుబాళింపు..

Wednesday, February 3, 2010

మనసు మూగబోతున్నా...గుండె గదిలో బందీని చేసి
గురుతుకొచ్చిన ప్రతిసారీ
తలుపు తడుతున్నావు ...

కంటి రెప్పల్లో ఖైదు చేసి
అలసి సోలిన ప్రతిసారీ
అలజడి చేస్తున్నావు...

మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..
మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..

తలనెత్తి నీకు దూరమవలేక
ఒదిగి చెంతన చేరినపుడల్లా..
నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..

పొంగు ప్రేమను పంచ
చేజాచినపుడల్లా..
ఓడిపోయానంటు మోకరిల్లుతావు..

అగాధాల అంచు కాక
మరి ఇదేమి నేస్తం?

పరిమళం గారు రాసిన "మనసు మూగబోతున్నా " కవితలు నా స్పందన.
http://anu-parimalam.blogspot.com/2010/02/blog-post.html