Tuesday, January 20, 2009

వందన మమ్మా భారత మాతా నువు నందన వనమా అది ఎప్పటి మాటా ?

వందన మమ్మా భారత మాతా
నువ్వు నందన వనమా అది ఎప్పటి మాటా

కన్నుల ధారలు ఎండిన సుజలా
రొమ్ములు దన్నిన బిడ్డల సుఫలా
కకృతి శ్వాసల కలుషిత శీతలా
మతమత్తులు జల్లిన రుధిర శ్యామలా !! .. వందనమమ్మా..

కక్షలు చీల్చిన గుండెల జ్యోత్స్నా
చెదిరిన కలలతొ కంపిత యామినీ
పగిలిన పెదవుల వికృత హాసినీ
కలుషిత నేతల ఎంగిలి భాషినీ !! .. వందనమమ్మా..

ఎరువులు మింగి చచ్చే రైతులు. శ్యామల నువ్వని ఎప్పుడు పిలవను ?
బూతులు నిండిన నేతల కోతలు. సుమధుర భాషిణి ఏమైపోయెను ?
రక్తపు రంగులు పులిమిన వార్తలు. శుఖదవు నువ్వనిఎక్కడ చెప్పను ?
కుత్తుక కోతలె జీవన భృతిగ సోలే యువతను ముంగిట చూస్తూ
వరదవు నువ్వని ఎట్లా అరవను !! .. వందనమమ్మా


అయ్యో !

తోటి తమ్ములే నోటుల కోసం దేశాన్నమ్మిన గాధలు చూసి
నిండిన కళ్ళతొ ఆక్రోశంలో గుండెలు మండి రాశానమ్మా

అన్నం పెట్టిన అమృత మూర్తివి ఆకృతినిచ్చిన అక్షయ ధాత్రివి
రోదన వశమున బాధ్యత వీడి ఎంతటి మాటలు అన్నా నమ్మా !!

ముష్కర హస్తాల్లోనూ చచ్చి దొరలకు దాశ్యం చేస్తూ వచ్చి
శృంఖల చేదన చేసిన జాతే నిలువున కాల్చుకు తిన్టూ ఉంటే

కృశించిపోతూ విషాన్ని మింగుతూ పరుషాలాడని మహా తల్లిని
నీ ఎదురు తిరిగని నైజం చూసి క్షమించేసే తత్వం చూసి
రోషం పెంచి మంచిని తెచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ
దులుపుకు పోయే తరుణం కాక తెల్లని రక్తం నాలో లేక
గుండెను పిండే మాటలు దొర్లెను కావుము తల్లీ కరుణతో నన్ను

దేశము అంటే ఎవరో కాదని రాశిగ పోసిన మనిషుల విలువని
దేశము అంటే మట్టి కాదని జనతను తెలివికి తెచ్చిన నాడు
రోషము పెరిగి దోషం కడిగి కాషాయాన్ని పక్కన వదిలి
కక్షలనొదిలి చేతులు కలిపి ప్రగతి పధానికి పునాదులేసి
తరతమ బేధం మచ్చుకి లేక పురోగమిస్తూ కదం తోక్కుదురు

అది సుజలగ సుఫలగ నిను చూసే తరుణము
అది సుఖదగ వరదగ నిను చేసే సమయం
వందన మమ్మా భారత మాతా నువు నందన వనముగ మారే దప్పుడు !!