Wednesday, March 4, 2009

నల్లాకాశం




కన్న కలలీడేరుతాయని తెల్లవారే ఘడియ లాయెని
తల పాపట సింధూరాలద్దగ దినకరుడొచ్చు వేళాయెనని !!

నల్ల నింగి, వెన్నెల వెలుగులో
చల్ల చంద్రుని అద్దం ముందు
మబ్బు తెరల వెనక సద్దుచేయక
చుక్కల మెరుగులద్దు కుంటూ
సోయగాలు సరిదిద్దు కుంటుంది ! .. కన్న ...

రవి ఎరుగని తన అందాలను
కలువ కన్నుల ప్రాంగణంలో,
అల్లలాడే నల్ల కురులతొ,
పెళ్ళి సిగ్గులు మొగ్గ తొడగగ
చల్ల గాలులు సలుపు తుంది ! .. కన్న ...

తూర్పు కొండపై చూపు నిలిపి
ఓర్పు తనలో సడలు తున్నా
రేపటుదయపు ఘడియకోసం
రగులే ఆశమంటలు సాక్షిజేసి
ఎదురు చూపుల పోగులేస్తుంది ! .. కన్న ...

నా గుండెల్లో గిలిగింతెడుతూ
చుట్టు తిరుగుతూ గారం పోతూ
పాట కట్టమని మారం చేస్తూ
ఆశగ చూస్తూ నిలిచిందా నల్లాకాశం ! .. కన్న ...