అల్లకల్లోలంగా ఉన్న బ్రతుకు సంద్రంలో
రాత్రి మరకల్ని కడుక్కున్న మరో ఉదయం
తడిసిన మందారంలా, నిర్మలంగా
బాహ్యాకాశంలో బరువుగా పూస్తుంది.
కలల కౌగిలిలో వెలిగి ఆరిన
కంటి కాగడాల మధ్య
వీర తిలకం దిద్దిన కాంతి చేతులు..
నల్ల కాలాన్నీ కాళ్ళకు కట్టి
మరో యుద్ధానికి సిద్ధం చేస్తాయి
దరిలేని తీరాలు, తీరని దాహాలు
అలుపెరుగని అలల మధ్య
ఊతమిచ్చే చేతికోసం
ఎదురు చూపులతో.. నిన్నటిలానే
పోరాటం ముగుస్తుంది..
ఆరాటమారుతుంది.
అలిసిన దేహానికి చీకట్లు చుట్టుకుంటూ
స్థబ్ద నిశీధిలోకి చేతన నిష్క్రమిస్తుంది