
మగత నిద్ర సంధించిన
కలల అంప శయ్య మీద
ఆశ ములుకులు జవసత్వాలు జుర్రుతుంటే
జ్ఞాపక సహస్రాలను వల్లె వేస్తూ
ఆర్తిదాహం నాలుక ఎండగట్టుతుంటే
రేపటి మకరోదయం కోసం
ఓ బ్రతుకు భీష్ముడి నిరీక్షణ
కలల కంప ముద్దిడి నుదుటిన
సంధ్య సింధూరాలని పులుముతుంటే
ఆశ మేకుల ఆలింగనాలతో
చేతనలుడిగి తనువు నివ్వెరపోతే
శిలువ బంధాల ఉయ్యాలలో
రేపటి ప్రక్షాళితోదయం కోసం
ఓ బ్రతుకు జీససు నిరీక్షణ