Monday, June 29, 2009

వద్దనుకున్న ఉదయం



కంటి పాపల క్రింద
పొత్తిళ్ళను సర్ద్దేస్తూ
దీపాల ముంగిట్లోకి
బలవంతంగా..

మెల్లగా వీస్తూ..
రాత్రి వదిలిన
రెప్ప-బరువు,
కాలక్షేపం..

వేలుకంటిన కాంతి గింజలూ ...
పొగచూరిన ఆకాశమూ,
గొలుసులిప్పుకుని కదిలిన కాలం,
రంగులై పగిలిన ఆశలను
అవలోకిస్తూ..

సంధ్య శబ్దాల కంపలోకి,
అ ఇష్టంగా అడుగులేస్తూ..


Friday, June 26, 2009

ఆ సాయంత్రం..



రేగిన ప్రతి కెరటానికీ
కర్పూరమయ్యే
క్రింద అస్తిత్వం,

చేతికి రాని నీడ
వేసిన కాళ్ళ బంధం,

గుండెకు కాషాయమద్దుతూ
బరువు గాలి హోరు..

సాయంత్రం..

కిరణాలు విరిగి కృంగుతూ
చేతన విదిల్చిన జ్ఞాపకాలు
ఫీనిక్సు పక్షులై
నన్ను గెలుస్తున్నాయి !



Thursday, June 25, 2009

నేనోడిపోయాను..


తెలియలేని దారుల్లో తచ్చాడడానికి
కాంతి తీగలూ వంచలేను..
తడి కంటి కాంతి ఇప్పటికే
అపభ్రంశమయ్యింది.

నావి కాని గాయాలకి
మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన పాదాల క్రింద
విధి అరిగిపోయింది.

చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే
యాతమేదైనా తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
ఇకనైనా నా తోడు కావాలి.

నేనోడిపోయాను..నీ జోడు కావాలి.

Monday, June 15, 2009

ఉదయం


నిశ్శబ్దపు అంచులమీదకు
జారిన నిప్పు కణికలు
ఆవిరై అలుపు రేపాయి !

రెప్ప బరువు లేపలేని ఆద
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!

తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..

అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.


published in poddu.net (http://poddu.net/?p=3220)

Friday, June 12, 2009

రాత్రి




విరగబూసిన జ్ఞాపకాలు
మెడన వేసుకుని, ఎప్పటిలానే..
కలలు పరిచిన నిశీధిలో
విరిగి చెదిరిన ఆశ తునకలు
ఏరి తిరిగి కూర్చలేక ..
బంధాలు త్రుంచి,
బరువు తీర్చమన్నట్టు..
వేడి నిట్టూర్పుల బలానికి
విగత భావాల తోడుగా
అనంత వీధుల్లో..
ఈ రాత్రి...
గాలిపటంలా ఎగరుతుంది..

పండు వెన్నెల, పిల్ల గాలులూ..
ప్రకృతి అందం... ఏమాత్రం పట్టవు.
చుక్కాని విరిగిన పడవ సరంగులా
బ్రతుకు పోరాటంలో
తపన పడుతూ తిరుగుతుంది..
ఊపిరి ఉగ్గబట్టి ... పంటిబిగువున
బంధాలను లాగుతుంది..

రంగులు పులుముకుంటున్న
తూర్పు కొండల వెకిలి నవ్వు..
చెట్టు కొమ్మల్లో ప్రతిధ్వనిస్తుంది..

ఓడి కరిగిన రాత్రి అవశేషాలు
వెలుగు చూడని కోణాల్లోకి
విసిరేయబడతాయి !!

Thursday, June 11, 2009

(చిర)కాలచక్రం



అల్లకల్లోలంగా ఉన్న బ్రతుకు సంద్రంలో
రాత్రి మరకల్ని కడుక్కున్న మరో ఉదయం
తడిసిన మందారంలా, నిర్మలంగా
బాహ్యాకాశంలో బరువుగా పూస్తుంది.

కలల కౌగిలిలో వెలిగి ఆరిన
కంటి కాగడాల మధ్య
వీర తిలకం దిద్దిన కాంతి చేతులు..
నల్ల కాలాన్నీ కాళ్ళకు కట్టి
మరో యుద్ధానికి సిద్ధం చేస్తాయి

దరిలేని తీరాలు, తీరని దాహాలు
అలుపెరుగని అలల మధ్య
ఊతమిచ్చే చేతికోసం
ఎదురు చూపులతో.. నిన్నటిలానే
పోరాటం ముగుస్తుంది..
ఆరాటమారుతుంది.

అలిసిన దేహానికి చీకట్లు చుట్టుకుంటూ
స్థబ్ద నిశీధిలోకి చేతన నిష్క్రమిస్తుంది

Tuesday, June 9, 2009

మూగ ప్రేమ

(ఈ చిత్రము http://emsworth.wordpress.com/tag/willard-metcalf/ నుండి గ్రహించబడినది.)

ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…


పొద్దులో ప్రచురించబడిన మూగ ప్రేమ .