
ఆర్ధ్రత నిండిన ఆర్తి పిలుపులకు
సమాధానంగా,
ఆప్యాయంగా చాచిన బాహుదండాల్లోకి
ఆసాంతం వచ్చి చేరిన
నిలువెత్తు శూన్య నిశ్శబ్ద నిశి
ఆలింగనల్లో మనసు ఊరట చెందుతుంది
విశ్రాంతి కోరుతుంది
పరవళ్ళు తొక్కిన భావావేశము
వాస్తవపు కట్ట బంధనాలకు
మూర్కొని బద్దలై
చలన రహితమై, విసిగి వేసారి
వ్యక్త పరిచే శక్తులుడిగి, వివర్ణమై
భాష పొందు మరిచి, చల్ల బడుతుంది
విశ్రాంతి కోరుతుంది
అంతర్ముఖ భాషణలు, ఏకాంత పయనాలు
అబద్ధపు ఆశ్వాసనలు, శోక సంగీతాలు
కవితా నివేదనలు, మనసు కర్పూరాలు
ఒంటి చేతి కరచాలనలు, దోసిలి నిండిన అభ్యర్ధనలు
ఓటమి గెలుపులు.. అంతర్మధనాలు..
ఇలా .. ఎంతకాలం ? నా కవిత
విశ్రాంతి కోరుతుంది..
నేను ఒంటరినే.. నాకు నేనే తోడు కాదు.
అబద్ధపు భావుకత నేను నటించలేను
అందుకే కవిత విశ్రాంతి కోరుతుంది..
మళ్ళీ మనసు స్పందించే వరకు
సెలవు.