
సంధ్య సాయంత్రం ఎప్పటిలానే
పండు భానుడ్ని భుజానేసుకుని
పడమటి దిక్కుగా ప్రయాణమయ్యింది.
దారిలో చూడలేక చీకటి చేతుల్లో ముఖం
దాచుకుంటూ పొద్దు తిరుగుడు పల్లె జనాలు
బాధగా వన్నె తగ్గి తలలు వాల్చారు.
దూరపు కొండలన్నీ, ఈ రోజు, నిన్నలానే
బంగారు జరీ అంచు నల్ల దుప్పటి
కాళ్ళమీదనుంచి ముఖం పైకి లాక్కున్నాయి.
కన్నెర్ర జేసిన నింగి నుదిటిన స్వేద బిందువులు
మిణుకు మిణుకు మంటే, నోరెళ్ళబెట్టిన
చంద్రుడు పాలిపోయి సగం ముఖం దాచుకున్నాడు.
రోజు కాలం చేసింది.. రాత్రి ఉదయించింది.