Thursday, September 10, 2009

వానా వానా...




నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటె
పిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..

గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటె
తాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ...

ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లు
వెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.

వాన నాప పురిని విప్పి అడ్డుకున్న నెమలి గారి
ఈక తడిసి తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి,

చుట్టుతిరిగి చూరు చేరు పిచ్చికమ్మ ఆపలేక
తలను తీసి రెక్కలోన దాచి పెట్టి నవ్వుకుంది !!

ఈనెల ఈమాటలో http://www.eemaata.com/em/issues/200909/1462.html