Monday, October 25, 2010

గతోదయం
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది

విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.

కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడంలేదు

గతం, ప్రతి రాత్రీ
రెప్పలు చీల్చుకుని
ఉదయిస్తుంది

అన్నీ అస్తమయ మెరుగని
ఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా.

Thursday, October 21, 2010

ఈ ఉదయం


బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
రంగుల ప్రపంచం
ఓ లోయ సరిహద్దుల్లో అంతమయింది

రెండు సూర్యుళ్ళ ఉదయంతో
సగం కాలిన రాత్రి
ముళ్ళ కంప మీద
అలానే కరుగిపోయింది.

చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచి
జారిపోతున్న చీకట్లకు
తనువు చాలించిన తుంపర్లు
తెరలవుతున్నా..

చల్లగా వీచిన తెల్లపదాల తావి
పూల తోటలోకి ..దారి చూపింది.

Sunday, October 17, 2010

వీడ్కోలు


ఆ వీడ్కోలు క్షణంలో
నిర్వీర్యమయిన నీ ముఖం
నన్ను వెంటాడుతూనే ఉంది

ఎంతో అనుకుంటాను
ఏదో చెయ్యాలని
ఎంతైనా చెయ్యాలని

దూరాలు పెరిగే కొద్దీ
ప్రేమలు ఆప్యాయతలు
ఫోను తంత్రులకు
చెక్కు ముక్కలకే
పరిమితమై పోతున్నాయి

నీ ఒళ్ళొతలపెట్టిన తృప్తి
నా తలపై తిరిగిన నీ చేతి వెచ్చదనం
ఏ చెక్కుతో కొనగలను ?

ఒద్దనుకున్న క్షణాల్లో
స్థంబించే కాలం
ఇపుడు చిన్నగా నైనా
కదలదే?

బరువైన శ్వాసలు
అదిరే చుబుకంతో
తడిసిన పరిసరాల వెనక
నీ ముఖమూ..
స్పష్టంగా కనబడదు.

గడిపిన నెల రోజుల ఆనందం
ఈ ఒక్క క్షణం..
బూడిదవుతోంది

కనీసం ఈ క్షణమయినా..
గుండెలు మండుతున్నా..
మాటలు రాకున్నా..
ఊపిరందకున్నా..

ఆగిపోతే బాగుండు.