Showing posts with label మనసు. Show all posts
Showing posts with label మనసు. Show all posts

Tuesday, August 25, 2009

కలవని చూపులు


చూపులు కలిసే లోపే
తెరలు దిగిపోతాయి..
వంతెనలు కరిగి పోతాయి..
ఊసులు వెనుతిరిగి వస్తాయి..

మరో ప్రయత్నం
మరింత బలంగా..
అసంకల్పితంగా..
మొదలవుతుంది..
తీరం చేరే అలల్లా..

ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?

తలలు తిప్పుకున్న ప్రతిసారీ
గుండెలు పిండే అనుభూతి..
నన్ను చూస్తున్నావన్న
అదో తృప్తి.

అదే ఇంధనంగా..
మళ్ళీ రెప్పలు లేస్తాయి
తిరుగుతున్న తలనాపడానికో ..
జారుతున్న రెప్పలనడగడానికో ..

జారిపోయిన అల..
మరో సారి తీరం వైపు ఎగురుతుంది.
తిరిగి మరలడానికి.

Monday, August 24, 2009

ఉదయం




నిశ్శబ్దపు అంచులమీదకు
జారిన నిప్పు కణికలు
ఆవిరై అలుపు రేపాయి !

రెప్ప బరువు లేపలేని ఆద
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!

తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..

అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.


published in poddu.net (http://poddu.net/?p=3220)

Tuesday, June 9, 2009

మూగ ప్రేమ

(ఈ చిత్రము http://emsworth.wordpress.com/tag/willard-metcalf/ నుండి గ్రహించబడినది.)

ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…


పొద్దులో ప్రచురించబడిన మూగ ప్రేమ .

Thursday, April 16, 2009

అర్ధాంగివయ్యేదానివి.


నన్ను నన్నుగా చూస్తావు చూపిస్తావు ...
నువ్వు నేనై పోతావు ..

నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే
నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.

నీకెంత దూరమైనా..
నిను చూడక పోయినా..
నాకోసం అలానే..
ఆబగా ఎదురు చూస్తూ..నిల్చుంటావు
నీగుండె పగిలినా.. నిశ్చలంగా..
నన్ను నీ గుండెల్లోనే దాచుకుంటావు

ఎద్దేవా చెయ్యకుండా..
నాలో ఎన్ని తప్పులు చూపి దిద్దుకోమన్నావు..
నన్ను మెరుగు చేయాలన్న తపన నీది
అది ఒకటే తపస్సు నీకు
మళ్ళీ మళ్ళీ చెప్పడానికైనా వెనుకాడవు
ఏమనుకుంటానో అనీ చూడవు.
ఎందుకీ అనురాగం ? ఏమిటీ అనుబంధం ?
ఇంత ఆప్యాయతా ? ఎందుకూ ?

కాల గతిలో నేను కొట్టుకుపోయినా
తిరిగొచ్చినా.. రాకపోయినా..
నీ దరి చేరినా.. చేరక పోయినా..
అలా నాకోసం ఎదురు చుస్తూ..

ఎందుకు ?
నీకంటూ ఏ ఆశలుండవా ?
నీ బ్రతుకు నీకు లేదా ?
నాతోనే ఎందుకు పెనవేసుకున్నావు ?

ఇలా నిర్జీవంగా.. నిశ్చలంగా..
నిర్మలంగా.. నాకోసం..
నేను నీకేమి చేశానని ?
ఎలా ? ఎందుకు ?..

నా గుండె కరిగిపోతోంది..
మనసు అట్టుడికిపోతోంది..
నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ?

నీకేమి చెయ్యగలను ?
అద్దమయిపోయావు ... అమ్మాయివైతే
అర్ధాంగివయ్యేదానివి.

Monday, March 2, 2009

క్షమించవూ...


తప్పెవరిదైనా చెలీ తపనిద్దరిదీ
తగువేదైనా సఖీ మధనిద్దరిదీ..

కదిలే పాదాల మధ్య పెరిగే దూరాలు మనవే
రగిలిన వాగ్యుద్ధాల మధ్య నలిగే హృదయాలూ మనవే
మూగ బాసల సంభాషణల్తో నిండిన అగాధాలు మనవే
కనుసన్నల సంజాయిషీలలో పెరిగిపోయిన అపోహలూ మనవే ! .. తప్పెవరిదైనా...

అలిగి అటు తిరిగిన నేత్రాల్లో పొగిలే చలమలూ మనవే
విరిగిన పెదవుల సందుల్లో వంగిన భావాలూ మనవే
కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే
మన కలల ఖైదుల్లో జీవిత బందీలూ మనమే! .. తప్పెవరిదైనా...

మనమల్లుకున్న స్పర్ధల సాలె గూళ్ళల్లో
బరువెక్కిన గుండెలు వేళ్ళాడాల్సిందేనా ?
మనం కట్టుకున్న దర్పాల కోటబురుజుల్లో
బందీగా భావాలిలా పతనమనాల్సిందేనా ? ! .. తప్పెవరిదైనా...

తప్పులు పట్టే తత్వాన్నొదిలి
ఒప్పును చెయ్యగ పరుగున చేరా
అక్కున చేర్చగ చేతులు చాచి
రెక్కలు గట్టుకు దగ్గిర వాలా ! .. తప్పెవరిదైనా...


Saturday, February 21, 2009

చెరువు


నింగి మబ్బులు కప్పుకుని దాలి గుంటలో పిల్లిలా ఒదిగి
ప్రశాంతంగా పడుకున్న ఆ చెరువు చూస్తే అందరికీ అక్కసే

ఇటు గట్టున మర్రి చెట్టు
ఊడ చేతులు దూర్చి కితకిత లెడుతుంది
కాళ్ళనందులో దించి నీళ్ళు తాగుతుంది
ఒళ్ళు మండిన చెరువు ఒడ్డు తడుపుతుంది.

అటు గట్టున పారిజాతాల చెట్టు
పువ్వులిసిరి సరసాలాడుతుంది
పరవశపు గుండ్రాలు తెగ రేపుతుంది
నచ్చని చెరువు దాని బింబాన్ని పట్టేసి నలిపేస్తుంది

ఇటుపక్క చేరిన పనిలేని పిల్లాడు
పలక రాళ్ళను తీసి విసురు తున్నాడు
వాటి కప్ప గంతులు చూసి ఎగురుతున్నాదు
వాడి కేమి తెలుసు? తగదన్న చెరువు దాన్ని తిరిగి విసిరిందని ?

వీస్తున్న గాలికీ అదను దొరికినట్టుంది
చెరువు కప్పుకున్న ముసుగు లాగేసింది
కోపమొచ్చిన చెరువు, ప్రకృతి అంతా ఒడ్డు పక్కన కట్టేసి
తన మధ్యలో నీలాకాశాన్ని, సూర్యుడిని పట్టి బంధించి
తెగ ఊపి కసి తీర్చుకుంటుంది

Wednesday, February 18, 2009

ఈ రోజు


మనసు యాతమై ఆనాటి
జ్ఞాపకాలను తోడి పోస్తుంది..
అనుభూతులు కదం తొక్కుతూ
కళ్ళముందాడుతున్నాయి..

ఆ రోజు నను వీడి పోతూ..
వీధి మలుపు దగ్గర మసక వెలుతురులో
నువ్వు కలిసి పోతున్నప్పుడు..
ఉప్పగా తగిలిన ఆ ఉప్పొంగిన భావాలు !
తిరిగి బ్రతుకు తున్నాయి.

మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని ఆ రెండు చుక్కలు !!
నేటికీ ఉన్నట్టున్నాయి .

ఎందుకో ఈ రోజు నీ తలపు పవనాలు
జ్ఞాపకాలకు మూర్కొని కురుస్తున్నాయి .
గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది.. ఒలుకుతుంది.
నిండిన కంటి పున్తల్లో నుంచి
నా ప్రస్తుతం నీటి పొరల వెనక
లీలగా కదులుతూ కనిపిస్తుంది..

ఆ మనసే ..

బంధాలల్లిన బూజు గూటిలో
బరువెక్కిన మనసూగుతోంది

ఆశగాలి దాన్ని రాలుస్తుందో
ఆ గూడే ఆసాంతం పెనవేస్తుందో
బాధ సాలీడే పెకలిస్తుందో
ఆగని కాలం మాత్రం
ఆ ఆటని ఆత్రంగా చూస్తుంది

ఆటలో గెలుపోటములు ఎవరివైనా
ఆర్తిని ఆశ్రయించేది,
ఆర్తనాదాలు ఆలపించేది
అశృధారలు ఆహ్వానించేది,
అలుపుని ఆస్వాదించేది
చివరికోటమిని ఆనందించేది ఆ మనసే..
ఆ మనసే ..

Tuesday, February 17, 2009

అమాయకంగా ఆ ప్రశ్నలేమిటి ?

చిరుగాలికి రెపరెప లాడుతు
నీ కళ్ళకు అడ్డంపడుతు
నా చూపుతొ దోబూచాడే
ఏ కడలి ఎరుగని నీ కురుల అలలకు
అడ్డం కట్టు..

చెప్పేందుకు తికమక పడుతు
నీ మాటలు తడబడనిస్తు
నా మనసును గిలిగింతెట్టే
ఏ తుమ్మెద ఎరుగని మధు కలశాలను
అదుపులో పెట్టు..

చిరు సిగ్గులు కురిపించేస్తూ
సంధ్య కాంతులు విరజిమ్మేస్తూ
మనసు భావాలకు అద్దంపట్టే
ఏ ముఖము ఎరుగని నీ చెక్కిలి అద్దము
దూరం పెట్టు...

అల్లలాడుతూ కవితలు రేపుతూ
అలకకి కూడా అందానిస్తూ
మనసు హాయిలో ఓలలాడించే
ఏ నింగి ఎరుగని తారలా కన్నులు
అబ్బ! ... అవతలికి తిప్పవూ..

చెలివని నీకు చనువును ఇస్తే
చేసే చేష్టలు అన్నీ చేస్తూ
నేనేం తప్పుని చేశానంటూ
అమాయకంగా ఆ ప్రశ్నలేమిటి ?

==================================


cirugaaliki reparepa laaDutu
nee kaLLaku aDDampaDutu
naa cuuputo dObuucaaDE
E kaDali erugani nii kurula alalaku
aDDam kaTTu..

ceppEnduku tikamaka paDutu
nee maaTalu taDabaDanistu
naa manasunu giliginteTTE
E tummeda erugani madhu kalaSaalanu
adupulO peTTu..

ciru siggulu kuripincEstuu
sandhya kaantulu virajimmEstuu
manasu bhaavaalaku addampaTTE
E mukhamu erugani nii cekkili addamu
duuram peTTu...

allalaaDutuu kavitalu rEputuu
alakaki kuuDaa andaanistuu
manasu haayilO OlalaaDincE
E ningi erugani taaralaa kannulu
abba! ... avataliki tippavuu..

celivani neeku canuvunu istE
cEsE cEshTalu annee cEstuu
nEnEm tappuni cESaananTuu
amaayakamgaa aa praSnalEmiTi ?

Friday, January 30, 2009

కన్నీళ్ళు

కలగంటున్న యెదగల హితుడవు
వలదంటున్నా కదలని తపనవు
వ్యర్ధం అన్నా వదలని గోడువి
అభ్యర్ధనకూ కరగని వాడివి

హృదయం ఉన్నా పంచగ లేనని
పరిమితులేవో నాకూ గలవని
చెప్పిన మాటలు పెడచెవి పెడితివి
ఇచ్చిన అలుసును తప్పుగ చూస్తివి

ఇప్పుడు చూడు ఏమయ్యిందో
కురులే ఉరిగా బిగిసిన కంఠం
బంగరు బహుమతె నీ బలి పీఠం
నా చెక్కిలి నేర్పెను నాకో పాఠం

ప్రేమే నాపై నిజముగ ఉంటే
చేసిన వినతులు నువ్వే వింటే
ప్రాణం నీకు మిగిలుండేది
బ్రతుకున హితుడుగ ఉండేవాడివి

నా కన్నీళ్ళు నిను తేలేవు
అదితెలిసినా ఈనీళ్ళు

http://pruthviart.blogspot.com/2009/01/blog-post_29.html కు నా స్పందన.

Sunday, January 18, 2009

కొండ చెట్టు కొమ్మ మీద

కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది

ఘల్లు మన్న గజ్జెలాగ బోసి పాప నవ్వులాగ
రెల్లు గూటి పడవలాగ అలల మీద ఊగి సాగి
గంతులేసి గుండె అలసి వీడి పోకు ఆగమంది !! కొండ..

తావి గాలి తనువు తాకి డొలికల్లో నన్ను ముంచి
కాంతి కన్ను మూయగానే వీడి పోవు నీడలాగ
నాకు ఏమి కానట్టు జారిపోయె ఈడులాగ !! కొండ..

కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది

Monday, January 5, 2009

వినగలవా? విని మన గలవా ?

గుండె తప్పెట లయల దాగిన
ప్రేమ లొలికే నా పాట పిలుపో
కనుల కొలనుల కట్ట జారిన
వేచి విసిగిన నా ఆశ విరుపో
నిద్ర కాచిన తనువు కాగిన
నిండు మనసుల నా తపన అరుపో
ప్రేమ నిండిన గుండె వేసిన
ఆశ విరిగిన నా కంటి తెరుపో

ప్రశాంత నిశ్శబ్ద నిశీధిలో నైనా,
అశాంత రణరంగ మధ్యస్థలిలో నైనా
వినగలిగే మనసు ఉంటే
వినాలన్న ఆశ ఉంటే
నీ గుండె చప్పుళ్ళకు తాళంగా వినబడగలదు
వినగాలవా ?
నీ మనసును వినమనగాలవా ?
విని మనగలవా ?


gunDe tappeTa layala daagina
prEma lolikE naa paaTa pilupO
kanula kolanula kaTTa jaarina
vEci visigina naa aaSa virupO
nidra kaacina tanuvu kaagina
ninDu manasula naa tapana arupO
prEma ninDina gunDe vEsina
aaSa virigina naa kanTi terupO

praSaanta niSSabda niSiidhilO nainaa,
aSaanta raNaranga madhyasthalilO nainaa
vinagaligE manasu unTE
vinaalanna aaSa unTE
nee gunDe cappuLLaku taaLamgaa vinabaDagaladu
vinagalavaa?
neemanasuni vinamanagalavaa ?
vini managalavaa ?

Sunday, December 14, 2008

ఎన్నో

గుండె కొమ్మ
గతపు తేనె పట్టు
జ్ఞాపకాల గదులెన్నో
కుట్టే గాధ లెన్నో

కలత రాయి
మనసు కొలనులో
రేపే తరంగాలెన్నో
చెదిరే అంతరంగాలెన్నో

కంటి పుట్టలో
దిగులు కలుగులు
తిరిగే జీవులెన్నో
జారే ధారలెన్నో

మనసు నెగడు
మధనపు చితుకులు
ఎగిరే కీలలెన్నో
రగిలే గుండెలెన్నో

కవిత మనసు
భావ కుసుమాలు
చెప్పే మాటలెన్నో
తీరే తపనలెన్నో

gunDe komma
gatapu tEne paTTu
jnaapakaala gadulennO
kuTTE gaadha lennO

kalata raayi
manasu kolanulO
rEpE tarangaalennO
cedirE antarangaalennO

kanTi puTTalO
digulu kalugulu
tirigE jeevulennO
jaarE dhaaralennO

manasu negaDu
madhanapu citukulu
egirE keelalennO
ragilE gunDelennO

kavita manasu
bhaava kusumaalu
ceppE maaTalennO
teerE tapanalennO

ఫొటో

అటక మీద దొరికిన ఫొటో మీద
దుమ్ము దులిపేసరికి
పాతికేళ్ళ నాటి ఘటనొచ్చి
నట్టింట్లో పడింది

"ఇవి మార్కులా" హస్తం గుర్తును
నా చెంప మీద చూపిన
నూనూగు మీసాల
కాంగ్రెస్‌ వాది ముందు గదిలో

"మీ ఆఫీసరుగారబ్బైకి చక్రాలొచ్చాయండీ"
వంటింట్లోనుంచి ముందుగది దాకా సాగిన
అమ్మ సముదాయింపు స్వరం

"తప్పిన వాళ్ళల్ల్లో ఎక్కువ మార్కులొచ్చింది
అన్నాయికే " అంటూ తన లాజిక్కుతో
అడ్డకాలేసి సైకిలు తొక్కుతూ, కాపాడొచ్చిన తమ్ముడు

"వెధవ చదువులు పరీక్ష పెట్టటమెదుకు?
తప్పించడం ఎందుకు ? అందుకే నేబడికే వెళ్ళలేదు" అంటూ
అమ్మమ్మ సమర్ధింపు సణుగుడు, పూజ గదిలోనుంచి

బిక్క మొఖం, వంచిన తల, తడిసిన కళ్ళు,
ముక్కు బలపాలు, బొందుల నిక్కరు, దొంగ చూపులు
ఫొటోలో ఉన్నది ఇంతే ఐనా, దాని వెనక ఎంత కధ ఉందో !

Monday, December 1, 2008

మౌనం

మాటలు పెదవులు దాటకపోతే
తలపులు మదిలో లేవని కాదు
ఆశను ముఖతా తెలుపకపోతే
యెదలో అలజడి లేదని కాదు
భావము బయటకు పెగలకపోతే
భారము హృదిలో లేదని కాదు

రగిలిన గాయం మానేటందుకు
కాలం నదిలో అడ్డమీదుతూ
మౌనం మందును మనసుకు పులిమి
ముందుకు సాగే పయనం నాది

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

మౌనం మందును మనసుకు పులిమి
ఆగక సాగే పయనం నాది


maaTalu pedavulu daaTakapOtE
talapulu madilO lEvani kaadu
aaSanu mukhataa telupakapOtE
yedalO alajaDi lEdani kaadu
bhaavamu bayaTaku pegalakapOtE
bhaaramu hRdilO lEdani kaadu

ragilina gaayam maanETanduku
kaalam nadilO aDDameedutuu
mounam mandunu manasuku pulimi
munduku saagE payanam naadi

Opika paTTE samayam lEdu
aavali teeram darilO lEdu
ukkiri bikkiri cEsE alalaku
bhayapaDi aagE taruNam kaadu

mounam mandunu manasuku pulimi
aagaka saagE payanam naadi

Wednesday, November 26, 2008

పదహారేళ్ళ ముసలోడు

రంగుల భవిత రాత్రి నిద్దర్లో కరిగిపోగా
సంధ్య రంగులను కనుల్లో నింపుతూ
మండే సూరీడి దెప్పిపొడుపులు
వాస్తవంలోకి బలవంతంగా తోస్తాయి

ప్రతి రోజూ నిన్నటి బ్రతుకుకు
ఓ కొత్త కార్బన్‌ కాపీనే
బ్రతుకు కేలెండర్లో చిరిగే మరో పేజీ
అదే పగలు అదే రాత్రి

ఒకటే రోజును పదే పదే
పాతికేళ్ళగా బ్రతికినందుకు
ప్రాణికి ఎప్పటికీ పదహారేళ్ళే
శరీరమే విసిగి ముసలిదౌతుంది


rangula bhavita raatri niddarlO karigipOgaa
sandhya rangulanu kanullO nimputuu
manDE suureeDi deppipoDupulu
vaastavamlOki balavantamgaa tOstaayi

prati rOjuu ninnaTi bratukuku
O kotta kaarban kaapeenE
bratuku kElenDarlO cirigE marO pEjee
adE pagalu adE raatri

okaTE rOjunu padE padE
paatikELLagaa bratikinanduku
praaNiki eppaTikee padahaarELLE
SareeramE visigi musalidoutundi

Monday, November 24, 2008

కలయిక

వేచిన సమయము పరుగిడి నడవగ
ఆగిన తరుణము వడివడి కదలగ
చూపులు కలపగ తడబడు అడుగుల
తావుకు నడిచితి మనసును తెలుపగ

అల్లరి తల్లికి నివ్వగ స్నేహము
తెల్లని మల్లెల నవ్వులు పూయగ
చల్లని కన్నుల సవ్వడి నీడన
మెల్లగ కళ్ళతొ నవ్విన తరుణము

తకధిమి తరిఝణు పదములు కదిలెను
సరిగమ పదఝరి కవితకు అమరెను
గొలుసులు సడలిన హయముల గతిగొని
మనసున కవితలు అటునిటు తిరిగెను

గడపిన రాతృల వేదన భారము
కదలని కాలపు రోదన గీతము
కరిగెను మైనపు ముద్దల లాగున
విరిసెను ఇందృని విల్లుల వైనము

తొలకరి అందిన చకోర చందము
తడిసిన బీటల బంజరు గంధము
మనసులు అల్లిన సుందర బంధము
ముదమున పొందితి కోరిన అందము !!


vEcina samayamu parugiDi naDavaga
aagina taruNamu vaDivaDi kadalaga
cuupulu kalapaga taDabaDu aDugula
taavuku naDiciti manasunu telupaga

allari talliki nivvaga snEhamu
tellani mallela navvulu puuyaga
callani cuupula savvaDi neeDana
mellaga kaLLato navvina taruNamu

takadhimi tarijhaNu padamulu kadilenu
sarigama padajhari kavitaku amarenu
golusulu saDalina hayamula gatigoni
manasuna kavitalu aTuniTu tirigenu

gaDapina raatRla vEdana bhaaram
kadalani kaalapu rOdana geetam
karigenu mainapu muddala laagaa
virisenu indRni villula vainam

tolakari andina cakOra candam
taDisina beeTala banjaru gandham
manasuna alliti sundara bandham
mudamuna ponditi kOrina andam !!

Tuesday, November 4, 2008

ఇది ఆగని పయనం..

ఓ ప్రేమమయి మీటిన
మనసు తంత్రి ఇది -- రాగమై సాగుతున్నా
ఓ స్నేహమయి చూపిన
వినూత్న వీధి ఇది -- బాటసారినై ఏగుతున్నా
ఓ చందనమయి ఒసగిన
సుందర సౌరభమిది -- గాలినై పంచుతున్నా
ఓ దివ్యమూర్తి వెలిగించిన
మనోహర దీపమిది -- వెలుగునై మెరుస్తున్నా
ఓ అమృతనేత్రి తెచ్చిన
అవిశ్రాంత స్పూర్తి ఇది -- నిర్విరామంగా వెలుగుతున్నా
ఓ దరహాసిన ఇచ్చిన
నిష్కల్మష బంధమిది -- భావంగా మలుచుకున్నా

మనో రధాన్ని నడుపుతున్నా
కవితా ఫలకాన్ని దిద్దుతున్నా
కలల శిల్పాన్ని చెక్కుతున్నా
అస్థిర గమ్యాలకు సాగుతున్నా..
ఆనంద శిఖరాలను ఎక్కుతున్నా
గుండె మంటలూ చవిచూస్తున్నా
సుదూర తీరాలను చేరుతున్నా...
ఆత్మీయత అనురాగాలను వెదుకుతున్నా..

ఇది ఆగని పయనం..
ఎంతవరకో..ఎప్పటివరకో.. ?

O prEmamayi meeTina
manasu tantri idi -- raagamai saagutunnaa
O snEhamayi cuupina
vinuutna veedhi idi -- baaTasaarinai Egutunnaa
O candanamayi osagina
sundara sourabhamidi -- gaalinai pancutunnaa
O divyamuurti veligincina
manOhara deepamidi -- velugunai merustunnaa
O amRtanEtri teccina
aviSraanta spoorti idi -- nirviraamamgaa velugutunnaa
O darahaasina iccina
nishkalmasha bandhamidi -- bhaavamgaa malucukunnaa

manO radhaanni naDuputunnaa
kavitaa phalakaanni diddutunnaa
kalala Silpaanni cekkutunnaa
asthira gamyaalaku saagutunnaa..
aananda Sikharaalanu ekkutunnaa
gunDe manTaluu cavicuustunnaa
suduura teeraalanu cErutunnaa...
aatmeeyata anuraagaalanu vedukutunnaa..

idi aagani payanam..
entavarakO..eppaTivarakO.. ?

Monday, October 20, 2008

పయనం

ఇదో అద్భుత పయనం
ఏ బంధం లేని గమనం
అనుభూతుల మజిలీలెన్నో
ఏ మజిలీ ఎంతోసేపు ఆగదని తెలుసు
ఎవరికీ ఈ బండి చెందదనీ తెలుసు
ఇది ఆగే ప్రయాణం కాదు
తిరిగి చేసే ఆశాలేదు
మళ్ళీ వచ్చే కాలం కాదు
సమయం వృధా అసలేకాదు

అందుకే
కవితా చిత్రాలుగా నా అనుభవాలను మలచుకుంటున్నా
జ్ఞాపకాల మడతల్లో ఆర్తిగా, మనస్పూర్తిగా దాచుకుంటున్నా

idO adbhuta payanam
E bandham lEni gamanam
anubhuutula majileelennO
E majilii entOsEpu aagadani telusu
evarikee ee banDi cendadanee telusu
idi aagE prayaNam kaadu
tirigi cEsE aaSaalEdu
maLLee vaccE kaalam kaadu
samayam vRdhaa asalEkaadu

andukE
kavitaa citraalugaa naa anubhavaalanu malacukunTunnaa
jnaapakaala maDatallO aartigaa, manaspuurtigaa daacukunTunnaa

Tuesday, June 12, 2007

నీ సొగసు చూడ తరమా ... నీ అలక తీరు సుఖమా?


బిగివడిన నీ నోటి పెదవులు
ముడివడిన నీ భృకుటి గీతలు
ఎరుపెక్కిన నీ బుగ్గ కాంతులు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?

బుస కొట్టెడి నీ శ్వాసలు
కసి రేగిన నీ మాటలు
పదునెక్కిన నీ చేస్టలు
నీ సొగసు చూడ తరమ
నీ అలక తీరు సుఖమా?

పరుగెట్టెది నీ నడకలు
సుడి రేపెడి నీ చేతలు
మాటాడని నీ ఊసులు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?

చిరునవ్వును తొణకనీవు
అలక హద్దు దాటనీవు
దరికి నన్ను రానీవు
ఒక్క పలుకు మాటాడవు
నీ సొగసు చూడ తరమా
నీ అలక తీరు సుఖమా?