Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Tuesday, June 29, 2010

నెమలి కన్ను




జీవం లేనిదే ఐనా
పాత పుస్తకం పేజీల మధ్య
ప్రత్యక్షం అయినపుడల్లా
ఓ కధ చెపుతుంది ..

చూపుగాలాలు శూన్యంలో
దేవులాడుతూ మిగిలిపోతాయి
పరిసరాలు ఒక్కసారిగా
పారదర్శకమయిపోతాయి

ఇంతలో ఏదో శబ్దం
ఘనీభవించిన గడియారం
ఒక్క ఉదుటున పరుగెడుతుంది.

అసంతృప్తిగా కధ ఆగిపోతుంది.

కధ అంతం తెలిసినా..
ఎందుకో
ఆ పుస్తకం తెరవాలనిపిస్తుంది
మళ్ళీ ఆ కధ వినాలనిపిస్తుంది.

Tuesday, April 27, 2010

అయిష్టంగా...


పలచ బడ్డ ప్రస్తుతం మీద
వయసునూ అలసటనూ అరగదీస్తూ
బాల్యాన్ని చేరుకున్నాను

పరిసరాలను కమ్మిన
సొంత ఊరు, చిన్నతనపు
కేరింతల మధ్య

నెరిసిన రెప్పకట్టలు తెగి
కళ్ళనుండి పొంగిన పాత కబుర్లు
కాలాన్ని కరిగించి
గెలిచామంటూ గేలి చేశాయి

అయినా.. అయిష్టంగా..
గుండెనిండిన తృప్తి
కడుపు నిండిన జ్ఞాపకంతో
వాస్తవంలోకి తిరుగు ప్రయాణం

Tuesday, August 4, 2009

నేనెవరు ?


పగులుతున్న గుండెను
పెదిమల్లో చూపే సరికి
నవ్వను కున్నారు..
ముక్కలేరుకుంటూ మిగిలిపోయాను.

రగులుతున్న మంటల్ని
పంటి బిగువున కట్టేస్తే
మొహమాటమనుకున్నారు..
మౌనంగానే మరలిపోయాను.

శతకోటి కోణాల
సజీవ శిల్పాన్ని నేను
తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నారు...
చేతికంటిన తడిని తుడుచుకెళుతున్నారు..

నా లోతులు తవ్వి
పోసిన నీటి గుట్టలూ..
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..

అద్దం మీద ఊదిన ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
ఇక నా పరిచయమెవరినడగను ?

Tuesday, July 21, 2009

డైరీ


అస్థవ్యస్తం.. రణగొణధ్వనులు..
ఎపుడూ.. ఏదో వెదుకులాట ...

క్యాలికో ముసుగులో
ఆనాటి జీవితం..
విప్పారిన రెప్పలతో..వచ్చేసరికి..

చుట్టూ ప్రపంచం.. మాయమవుతూ..
బరువు శ్వాసనూ...బోలెడు నిశ్శబ్దాన్నీ
వదిలిపోయింది.

ఇంకి పోయిన ఇంకు మూటల్లోని
కలల దొంతరలు..
పుటల మధ్య రెక్కలై మిగిలిన
పువ్వు శిధిలాలు..
కవిత ముసుగులో ఒదిగిన
ఆశ ఖండాలు..
పిల్లలింకా పెట్టని నెమలి పించాలు...

మనసు మల్టీప్లెక్సుగా
మారిపోయింది.

తోడు రాలేని వసంతాలు...
ఆ తెరల మధ్యగా..
ఆల పించిన మేఘమల్హరి..
చెవులకు చేరేలోపే..
కరిగి జారిపోయింది ..
తెరల మధ్యకే.. తిరిగి ఇంకిపోయింది.

Friday, March 27, 2009

జ్ఞాపకాలు


నిన్నకి నేటికి మధ్య సన్నని
చీకటి సందులో, ఒదిగిన పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
రెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
కందిరీగల్లా కమ్ముకున్నాయి

గతపు తోటలు ఎన్ని తిరిగొచ్చాయో
మధుర ఘటనలు ఎన్ని తరచి వచ్చాయో
అధర సుధలతో నిదుర తుట్టెను
నింపుతూ తమకంగా తిరుగు తున్నాయి

Thursday, February 19, 2009

జ్ఞాపకాలు



ముత్యాలు జారినట్లు నీ నవ్వులు
అవి పలికిన స్వాగతాలు..
వెన్నెల్లు కురిసినట్లు నీ చూపులు
వాటి పంచన మన ఊసులు...
ఆత్మీయత నిండిన కరచాలనాలు
ఆ వెచ్చదనంలో సేదతీరటాలు..
ఇంటికెళ్ళే వేళ కాళ్ళు కదిలినా
వదలలేక పెనవేసుకున్న ఊహలు..
కళ్ళు అప్పగించిన క్షమాపణలు
చిరునవ్వులిచ్చిన ఆశ్వాసనలు...

ఇప్పుడేమయ్యాయి ? అవన్నీ ఎక్కడున్నాయి ?
కళ్ళు మారాయా? కాళ్ళు మారాయా ?
కాలం ముళ్ళకు చిక్కిన మనసులు చిరిగాయా ?

అవునులే..

చెప్పుకున్న మాటలకు అర్ధాలు చెరిగాయి
అల్లుకున్న బంధాలకు పేర్లు మారాయి
చేసుకున్న బాసలకు ఆధారాలు విరిగాయి
కలిసిన మనసుల మధ్య దూరాలు పెరిగాయి
కాలాలు మారాయి.. కధలూ మారాయి..

ఆ జ్ఞాపకాలే ... గెలిచామని చెప్పేందుకు మిగిలాయి..
నీ జ్ఞాపకాలే ... తడి కళ్ళు తుడిచేందుకు మిగిలాయి.

Wednesday, February 18, 2009

ఈ రోజు


మనసు యాతమై ఆనాటి
జ్ఞాపకాలను తోడి పోస్తుంది..
అనుభూతులు కదం తొక్కుతూ
కళ్ళముందాడుతున్నాయి..

ఆ రోజు నను వీడి పోతూ..
వీధి మలుపు దగ్గర మసక వెలుతురులో
నువ్వు కలిసి పోతున్నప్పుడు..
ఉప్పగా తగిలిన ఆ ఉప్పొంగిన భావాలు !
తిరిగి బ్రతుకు తున్నాయి.

మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని ఆ రెండు చుక్కలు !!
నేటికీ ఉన్నట్టున్నాయి .

ఎందుకో ఈ రోజు నీ తలపు పవనాలు
జ్ఞాపకాలకు మూర్కొని కురుస్తున్నాయి .
గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది.. ఒలుకుతుంది.
నిండిన కంటి పున్తల్లో నుంచి
నా ప్రస్తుతం నీటి పొరల వెనక
లీలగా కదులుతూ కనిపిస్తుంది..

Monday, February 2, 2009

ఎవరీమె?

నీడలా నాతోనే ఉంటూ గాధలన్నీ వింటుంది
నాతో కలిసి గతాన్ని తోడుతుంది
పరిచి నిస్పృహల్లో ఆరేస్తుంది
గడిచే కాలాన్ని విడిచే నిట్టూర్పులనీ
నాతో సమంగా అనుభవిస్తుంది.

నిండిన కళ్ళతో మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది విశ్రాంతినిస్తుంది
విడిన బంధాలని, విగత భావాలని
వక్రించిన విధి విధానాన్ని
నాకై విశ్లేషిస్తుంది ఊరటనిస్తుంది

అర్ధం కాని బ్రతుకు నిజాల్ని
ప్రతిధ్వనించే మౌన గీతాల్ని
తిరిగి ప్రశ్నిచే ఆవేదన క్షణాల్ని
ఆకళింపు చేస్తుంది, ఒద్దన్నా
మరోసారి అనుభంవంలోకి తెస్తుంది.

ఆశ దీపానికి చేతులడ్డు పెట్టి
ఆవలి తీరం చూపిస్తుంది
నా చీకట్లు తనలో ఇముడ్చుకుంటుంది
ఒకోసారి నా అస్థిత్వమే తనవుతుంది

ఈరోజెందుకో, కోరిచేరిన తను
కసిరి జారిపోయింది, గాయపడ్డట్టుంది,
తనకంటూ ఒక గుర్తింపు కోరినట్టుంది
గోడమీద తన నీడకోసం
ఆప్యాయంగా తడుముకుంటుంది

తనులేని నేను నాకేమవ్వను?
నేనుకాని నేను తనకేమవ్వను ?

పాపం నా ఏకాంతం. ఈరోజు ఒంటరయ్యింది.


niiDalaa naatOnE unTuu gaadhalannii vinTundi
naatO kalisi gataanni tODutundi
parici nispRhallO aarEstundi
gaDicE kaalaanni viDicE niTTuurpulanii
naatO samamgaa anubhavistundi.

ninDina kaLLatO masakabaarina naa prastutaanni
viDamarici viSadiikaristundi viSraantinistundi
viDina bandhaalani, vigata bhaavaalani
vakrincina vidhi vidhaanaanni
naakai viSlEshistundi uuraTanistundi

ardham kaani bratuku nijaalni
pratidhvanincE mouna giitaalni
tirigi praSnicE aavEdana kshaNaalni
aakaLimpu cEstundi, oddannaa
marOsaari anubhamvamlOki testundi.

aaSa diipaaniki cEtulaDDu peTTi
aavali tiiram cuupistundi
naa ciikaTlu tanalO imuDcukunTundi
okOsaari naa asthitvamE tanavutundi

iirOjendukO, kOricErina tanu
kasiri jaaripOyindi, gaayapaDDaTTundi,
tanakanTuu oka gurtimpu kOrinaTTundi
gODamiida tana niiDakOsam
aapyaayamgaa taDumukunTundi

tanulEni nEnu naakEmavvanu?
nEnukaani nEnu tanakEmavvanu ?

paapam naa Ekaantam. iirOju onTarayyindi.

Tuesday, December 30, 2008

అనుభవాలు

భావ పాతాలు గుండె శిలలను చేరుకుంటూ
తలలు పగిలేలా మూర్కొంటున్నాయి
బ్రతుకు ఒరవడి తాళలేక పల్లాలని వెదుక్కుంటూ
ఆత్మహత్యను చేసుకుంటున్నాయి

చావచచ్చిన శకలాలు ఉపరితలంపైన ఆడుకుంటాయి
ఏమీ పట్టనట్టు సాగిపోతాయి - నవ్వుకుంటాయి
చచ్చిబ్రతికిన ఆనవాళ్ళు తెట్టుతోడై ఒడ్డు చేరుకుంటాయి
అనుభవాలై గతంలో పొందికగా సద్దుకుంటాయి

జ్ఞాపకాలై మధనపెడుతు విందుచేసుకుంటాయి



bhaava paataalu gunDe Silalanu cErukunTuu
talalu pagilElaa muurkonTunnaayi
bratuku oravaDi taaLalEka pallaalani vedukkunTuu
aatmahatyanu cEsukunTunnaayi
caavacaccina SakalaalE uparitalampaina aaDukunTaayi
Emii paTTanaTTu saagipOtaayi - navvukunTaayi
caccibratikina aanavaaLLE teTTutODai oDDu cErukunTaayi
anubhavaalai gatamlO pondikagaa saddukunTaayi
jnaapakaalai madhanapeDutu vinducEsukunTaayi

Wednesday, December 17, 2008

వెదుక్కుంటున్నా ..!!

మమతానురాగాలను వెనక వదిలి, ఇప్పుడు
ఇరుకు మనసుల జనారణ్యంలో
ఆత్మీయత కోసం వెదుక్కుంటున్నా ...

జ్ఞానమిచ్చిన నేల వదిలి వచ్చి, ఇక్కడ
నిర్జీవ కాంక్రీటు నగరాల్లో
ఆశలు తీరే దారులు వెదుక్కుంటున్నా ...

సాంప్రదాయ సంకెళ్ళను తెంచాననుకుని ఇప్పుడు
పాశ్చాత్య ప్రవాహాల్లో
అమాయకత్వానికర్ధం వెదుక్కుంటున్నా ...

కొత్త దేశం మోజులో వలస వచ్చి, ఇక్కడ
పచ్చనోట్ల మడతల్లో
పాత జ్ఞాపకాలను వెదుక్కుంటున్నా ...



mamataanuraagaalanu venaka vadili, ippuDu
iruku manasula janaaraNyamlO
aatmeeyata kOsam vedukkunTunnaa ...

jnaanamiccina nEla vadili vacci, ikkaDa
nirjeeva kaankreeTu nagaraallO
aaSalu teerE daarulu vedukkunTunnaa ...

saampradaaya sankeLLanu tencaananukuni ippuDu
paaSchaatya pravaahaallO
amaayakatvaanikardham vedukkunTunnaa ...

kotta dESam mOjulO valasa vacci, ikkaDa
paccanOTla maDatallO
paata jnaapakaalanu vedukkunTunnaa ...

Sunday, December 14, 2008

ఫొటో

అటక మీద దొరికిన ఫొటో మీద
దుమ్ము దులిపేసరికి
పాతికేళ్ళ నాటి ఘటనొచ్చి
నట్టింట్లో పడింది

"ఇవి మార్కులా" హస్తం గుర్తును
నా చెంప మీద చూపిన
నూనూగు మీసాల
కాంగ్రెస్‌ వాది ముందు గదిలో

"మీ ఆఫీసరుగారబ్బైకి చక్రాలొచ్చాయండీ"
వంటింట్లోనుంచి ముందుగది దాకా సాగిన
అమ్మ సముదాయింపు స్వరం

"తప్పిన వాళ్ళల్ల్లో ఎక్కువ మార్కులొచ్చింది
అన్నాయికే " అంటూ తన లాజిక్కుతో
అడ్డకాలేసి సైకిలు తొక్కుతూ, కాపాడొచ్చిన తమ్ముడు

"వెధవ చదువులు పరీక్ష పెట్టటమెదుకు?
తప్పించడం ఎందుకు ? అందుకే నేబడికే వెళ్ళలేదు" అంటూ
అమ్మమ్మ సమర్ధింపు సణుగుడు, పూజ గదిలోనుంచి

బిక్క మొఖం, వంచిన తల, తడిసిన కళ్ళు,
ముక్కు బలపాలు, బొందుల నిక్కరు, దొంగ చూపులు
ఫొటోలో ఉన్నది ఇంతే ఐనా, దాని వెనక ఎంత కధ ఉందో !

Friday, November 28, 2008

వాన

మనసులో మాట ధైర్యం చేసుకుని
మెల్ల మెల్లగా పెదవుల దాకా
విముక్తి కోసం చేరే సరికి

కాలం కాల్వలో బ్రతుకు బల్లకట్టుమీద
వయసు అవతలి తీరం చేరిపోతుంది

కనుల కొలనులోనుండి మరో బిందువు
ఎప్పటిలానే ఆవిరవుతుంది

ఆ మాట కలల మబ్బుల్లోకి చేరిపోతుంది
జ్ఞాపకాల చల్లని గాలి తగిలి
మళ్ళీ కురవటానికి సిద్ధమవుతుంది

తలతడవని వాన అది
ఏ గొడుగూ ఆశ్రయమివ్వదు



manasulO maaTa
dhairyam cEsukuni
mella mellagaa pedavula daakaa
vimukti kOsam
cErE sariki

kaalam kaalvalO
bratuku ballakaTTumeeda
vayasu
avatali teeram
cEripOtundi

kanula kolanulOnunDi
marO binduvu
eppaTilaanE aaviravutundi

aa maaTa kalala
mabbullOki cEripOtundi
jnaapakaala
callani gaali tagili
maLLee kuravaTaaniki
siddhamavutundi

talataDavani vaana adi
E goDuguu aaSrayamivvadu

Monday, October 20, 2008

పయనం

ఇదో అద్భుత పయనం
ఏ బంధం లేని గమనం
అనుభూతుల మజిలీలెన్నో
ఏ మజిలీ ఎంతోసేపు ఆగదని తెలుసు
ఎవరికీ ఈ బండి చెందదనీ తెలుసు
ఇది ఆగే ప్రయాణం కాదు
తిరిగి చేసే ఆశాలేదు
మళ్ళీ వచ్చే కాలం కాదు
సమయం వృధా అసలేకాదు

అందుకే
కవితా చిత్రాలుగా నా అనుభవాలను మలచుకుంటున్నా
జ్ఞాపకాల మడతల్లో ఆర్తిగా, మనస్పూర్తిగా దాచుకుంటున్నా

idO adbhuta payanam
E bandham lEni gamanam
anubhuutula majileelennO
E majilii entOsEpu aagadani telusu
evarikee ee banDi cendadanee telusu
idi aagE prayaNam kaadu
tirigi cEsE aaSaalEdu
maLLee vaccE kaalam kaadu
samayam vRdhaa asalEkaadu

andukE
kavitaa citraalugaa naa anubhavaalanu malacukunTunnaa
jnaapakaala maDatallO aartigaa, manaspuurtigaa daacukunTunnaa

ఏమని చెప్పను ?

అంతరంగాల్లోని జ్ఞాపకాలకు తోడుగా
ప్రశాంతంగా ప్రవహించే ఆ నది, నాతో
తనలో గంతులేసిన ఆ చిరు పాదాల
గురుతులడిగింది, ఏమని చెప్పను ?

ఒంటరిగా ప్రకృతి బాటలో సాగే నాతో
తుంటరితనాన్ని మరిచి నిలిచిన జింక
భయపడి ఒక్క క్షణమాగిన ఆ అడుగుల
సవ్వడడిగింది, ఏమని చెప్పను ?

మౌనంగా అడవితల్లి ఒడిని చేరిన నాతో
నిశ్శబ్దాన్ని చీలుస్తూ నన్నాపిన ఆ చెట్లు
అలుపెరుగక నాడు సాగిన ఆ ఊసుల
మాటేదనడిగాయి, ఏమని చెప్పను ?

గలగలపారే సెలయేరు ఒక నిముషమాగి
నాడు తన సోయగాలు చూపనందుకు
చిన్నబోయి, నాడు చూసిన ఆ కన్నులేవని
అసంతృప్తిగా అడిగింది, ఏమని చెప్పను ?

నీకై ఓ పూవిచ్చిన ఆ అడవి చెట్టు
నువ్వలిసి సేదతీరిన ఆ కొండ మెట్టు
అలజడికి ఒడ్డుచేరిన ఆ నురగ తెట్టు
ఆ ఊయల, ఆ మలుపు, ఆ నది గట్టు
ఒకటేమిటి ? ప్రతి కణము ప్రతి కిరణము
మరుపెరగక నిన్నడిగాయి, ఏమని చెప్పను ?

నువులేని లోటు నా ఒక్కడి సొంతమనుకుంటూ
ఎదురుచూపులు నా కళ్ళకే పరిమితమనుకుంటూ
నీతోడు కోరే ఆశ నాతోనే అంతమనుకున్నా, కానీ
నేడు, అదోవింత సంఘర్షణ, ఏమని చెప్పను ?

ఈ జగతంతా నీ వైపని కొత్తగా కనుక్కుంటున్నా
ఏవీ నావికావని అయిష్టంగానే తెలుసుకుంటున్నా
కలుక్కుమన్నట్లనిపించింది, అంతా కలలా అనిపించింది
ఆదారి నేనెందుకెళ్ళానా అనిపించింది, ఏమని చెప్పను?

లేకుంటే !
ఏదో ఒక అబద్ధపు తృప్తైనా నాకుండేది
నులివెచ్చని ఆ నవ్వైనా నాకు మిగిలుండేది !!

antarangaallOni jnaapakaalaku tODugaa
praSaantamgaa pravahincE aa nadi, naatO
tanalO gantulEsina aa ciru paadaala
gurutulaDigindi, Emani ceppanu ?

onTarigaa prakRti baaTalO saagE naatO
tunTaritanaanni marici nilicina jinka
bhayapaDi okka kshaNamaagina aa aDugula
savvaDaDigindi, Emani ceppanu ?

mounamgaa aDavitalli oDini cErina naatO
niSSabdaanni ceelustuu nannaapina aa ceTlu
aluperugaka naaDu saagina aa uusula
maaTEdanaDigaayi, Emani ceppanu ?

galagalapaarE selayEru oka nimushamaagi
naaDu tana sOyagaalu cuupananduku
cinnabOyi, naaDu cuusina aa kannulEvani
asamtRptigaa aDigindi, Emani ceppanu ?

neekai O puuviccina aa aDavi ceTTu
nuvvalisi sEdateerina aa konDa meTTu
alajaDiki oDDucErina aa nuraga teTTu
aa uuyala, aa malupu, aa nadi gaTTu
okaTEmiTi ? prati kaNamu prati kiraNamu
maruperagaka ninnaDigaayi, Emani ceppanu ?

nuvulEni lOTu naa okkaDi sontamanukunTuu
edurucuupulu naa kaLLakE parimitamanukunTuu
neetODu kOrE aaSa naatOnE antamanukunnaa, kaanee
nEDu, adOvinta sangharshaNa, Emani ceppanu ?

ee jagatantaa nee vaipani kottagaa kanukkunTunnaa
Evee naavikaavani ayishTamgaanE telusukunTunnaa
kalukkumannaTlanipincindi, antaa kalalaa anipincindi
aadaari nEnendukeLLaanaa anipincindi, Emani ceppanu?

lEkunTE !
EdO oka abaddhapu tRptainaa naakunDEdi
nuliveccani aa navvainaa naaku migilunDEdi !!