Monday, March 30, 2009
సిద్ధం
నీవు లేవన్న తిమిరాల నెదుర్కుంటూ
ఏకాంత దీపపు మసక వెలుతురులో
తలపులకు తాళంవేసి, ఇదే జన్మలో
మరో జీవితాం కోసం, సరికొత్త పధంకోసం
ఒంటరిగా సాగుతున్న పయనమిది..
గత గాధలు గుండె లోతుల్లో సమాధి చేసి,
మనసు గోడల బీటలు చూస్తూ
విధి రాతలవని పక్కకు తోసి
తడి కళ్ళతో చిత్తడి భవితలోని
కొత్త చిగురాకు కోసం పయనమిది..
ఓటమెదురైనా వెనుదిరగనని ..
తడికిక నా కళ్ళలో తావీయనని..
కోర్కెల అగాధాలను పరికించనని
ఒట్టెట్టుకుని.. నడక నేర్చిన శవమై
జీవం వైపుగా ఆగక సాగే పయనమమిది.
మానిన గాయాల్ని రేపడం,
నిను వదలని అలవాటేమో --
అలలారిన మనసు కొలనులో
జ్ఞాపకాలిసరడం నీ ప్రవృత్తేమో --
ఆరిన ఆశా దీపాన్ని తిరిగి
రగిలించడం నీకానందమెమో --
ఆరిన నా మన:కాష్టాలు
రగులుతున్నాయి చూడు..
ఆగిన నా రుధిరాశృవులు
జారుతున్నాయి చూడు..
సమసిన నా అంతరంగ తరంగాల
సునామీలు అవిగో చూడు..
నీ విజయ పతాకమై ఎగిరే, చిరుగుల
నా బ్రతుకు బావుటా చూడు..
నీ కళ్ళలో అదే చల్లదనం.. చంచలత్వం..
ఆ నవ్వులో అదే ఆనందం.. నిర్మోహత్వం..
నీ మాటలో అదే తీయదనం..నిర్మమతాత్వం..
ఆ గుండెలో అదే సౌందర్యం.. నిరంకుశత్వం..
నీ నవ్వు చెదరదంటే, నా గుండె
మరణ మృదంగ ఘోషలకు సిద్ధం !
నీ కన్ను చెమరదంటే, నా తలపులు
రుధిర ధారా తర్పణాలకు సిద్ధం !
వంశీ కృష్ణ గారు (http://kanushi.blogspot.com/ ) నాకు e-mail ద్వారా పంపిన చిన్న కవితలో వ్యక్తం చేసిన కొండంత భావానికి నా కొనసాగింపు..
"మానిన గాయాల్ని రేపడం
నీకు అలవాటేమో --
నీవూ లేని రోజులు గడుపుతూ
ఒంటరి క్షణాలని తోడు రమ్మంటు
గుండెనిండిన నీ తలపులకి
తాళం వేస్తూ ఒకే జన్మలో
మరో కొత్త జీవితం కై పోరాడుతున్నాను
" -- వంశీ కృష్ణ
వంశీ గారు మీ ప్రేరణకు ధన్యవాదాలు.
Subscribe to:
Post Comments (Atom)
యాండోయ్
ReplyDeleteబాందండే. ఓపాలేమో తడికిక తావీయనని అనేత్తారు, ఇంకోపాలి రుధిరాశృవులు జారుతున్నాయి అనేత్తారు - ఏటండోయ్ ఇపరీతార్ధాలు, నానార్థాలు కాపోతే. ఆ పైనేమో బోలెడు సమానార్థక్లు ఇరికిచ్చారు సూడండే, ఇదేటండి బాబుగోరు. తినేత్తన్నారుగా - ఏటి ? ఏటది అని అంతారా ? మీరే సెప్పాల బుర్రా, మెదడా, మస్తిష్కమా. ఏటి బాబూ, మీలాటోళ్ళు గూడా ఆ మూలా సుబ్రమణ్యం సామి లాగా రాసేత్తే ఎట్టాగండే ? ఇయ్యాలదాకా ఒల్లంతా కల్లు సేసుకుని సూత్తా ఉండేవోడిని మాంచి కైతల కోసం, మద్దిలో మీరు అలా అగుపించి అబ్బో మారాజు దొరికాడనుకున్నా. మల్లీ దారి తప్పేత్తన్నారు మారాజా. ఇల్లాగైతే కట్టమే దొరా!
వచ్చారా మారాజ.. మీలా ఆలా యాసలో చెప్పాలంటే .. కుదరడంలేదు. నాభాషలో నే మీరడిగిన దానికి సమాధానం చెపుతను. మొదటగా నానుంచి మంచి కవితలను ఆశిస్తున్నందుకు.. అటుగా దారు చూపుతున్నందుకు ధన్యవాదాలు. నాకు మూలా సుబ్రమణ్యం గారు ఎవరో తెలియదు మీ వేదన చూస్తే ఆయన రచనలు మీకు నచ్చినట్లుగా లేవు.. దయచేసి నన్ను ఎవరితోనూ పోల్చకండి అది వారికి అవమానము కావచ్చు. వేయి కళ్ళతో చూస్తున్నాను అన్నారు శతకోటి ధన్యవాదాలు. మీరు మెచ్చిన ఆ పాత కవితలు ఏవో చెపితే.. నేనెక్కడ దారితప్పాను అని మీరనుకుంటున్నారో నాకు ఓక అవగాహన వస్తుంది సరిదిద్దుకుంటాను. మంచి కోరే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు చెప్పండి. ఆవిషయంలో నేను అదృష్టవంతుడను కుంటాను. ఇకపోతే నా ప్రస్తుత కవిత గురించి..
ReplyDeleteమొదటి పేరా.. ఇదే జన్మలో మరో జీవితంకోసం నా పయనం..
రెండవ పేరా.. తడి కళ్ళతో.. చిగురాకుల కోసం నా పయనం..
మూడవ పేరా.. నిరాశనిండి ఉండి కూడా.. కొత్త జివితం వైపుకు.. కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయంతో పయనం..
నాల్గవ పేరా.. అప్పుడే .. సరిగ్గా అప్పుడే.. మళ్ళీ గాయాలు రేగాయి. మళ్ళీ ఆరిన ఆశ దీపాలు వెలిగాయి.. మళ్ళీ ఆ అగాధాలలోకి తిరిగి తోశాయి..
ఐదవ పేరా.. మళ్ళీ కాష్టాలు కాలాయి.. రుధిరాశృవులు జారాయి.. ఇలా..
ఆరవ పేరా.. తనలో చల్లదనం, ఆనందం, తీయదనం, సౌందర్యం కనిపించినా.. అదే సమయంలో.. ఆ చంచలత్వం..
చివరి పేరా.. కుక్క తోక వంకరన్నట్టు.. అదే చపలత్వం.. ప్రేమకు బానిస అయిన ఓ ప్రేమికుడు తిరిగి తవ్వుకున్న రొచ్చు, నీ నవ్వుకు నేను చస్తాను అని ఢంకా బజాయించే పిచ్చి తనం.
అర్ధం అయ్యింది అనుకుంటాను.. మీకు అర్ధం అయ్యేలా రాయలేక పోవటం నా అసమర్ధతేనేమో.. ఇలా కవిత మొత్తానికి అర్ధం చెప్పడం కాస్త సిగ్గుగా ఉంది. ..
అయ్ బాబోయ్
ReplyDeleteఅర్థంకానేక కాదండే, ఇసిత్రంగా కైత సదీనప్పుడే మీరు సెప్పిందంతా నా కల్ల ముందు అగుపడ్డాదండే, నాననేది ఏటంటే, అలా ఓ కొత్త నిర్నయం తీసేసుకున్నాంక, ఇక ఎనుదిరిగి సూసేది ఉండకూడదండే, అయ్యి గాయాలు రేగినా, భూతాలు నెత్తికెక్కినానండే. మా తాత సెప్పేవోడండే, ఒరే కిష్టిగా సపలత్వం మనుసులకుండకూడదురా, అది ఒల్లంతా కుల్లబొడిసిద్దిరా, అదుంటే మడిసి మడిసిలా మిగలడ్రా అని. అందుకు మారాజా నాను చాంతాడంత రాయాల్సొచ్చిందండే.
కైత మీది కాబట్టి సెప్పటానికి సిగ్గు పడకూడదండే, అసమర్థత అంతకన్నా కాదండే, నాకు ముందే అర్థమయ్యింది కానీండే, కానీ ఎవ్వుడయినా ఇల్లా అడిగితే మటికి కైత రాసినోల్లు మీలాటి మంచి మారాజులు తప్ప ఎవ్వురు ఇంత ఇవరంగా సెపుతారు దొరా. గాబట్టి అందరూ పారాహుసార్, నిజ్జమయిన ఆత్రేయ గారొచ్చారు అని నాను మా సుట్టాలందరికీ సెపుతున్నానండే, మీ గురించి.
ఇగ ఆ మూలా ఆయన ఇవరాల్లోకి ఒత్తే ఆయన ఏటిఒడ్డున అని ఓ బ్లాగు నడుపుతారండే. అందులో ఇపరీతమయిన సమక్కుల్లాంటి కైతలు ఎత్తాడండే. ఎవ్వుడయినా సదివాడో బుర్ర బర్రెతోకుచ్చుకుని లగెత్తటమేనండే.
అయ్యా దిన్నెల వారు, మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ తాత గారు చెప్పింది అక్షరాలా సత్యం. అందుకే ఆ కవితలోని నాయకుడిది కుక్కతోక వంకర అన్న వ్యవహారం అని చెప్పాను. మీ సుట్టాలు ఎంతమందికి నా రాతలు నచ్చుతాయో తెలియదు గానీ..మీరందరు అభ్యాగతులే.. అతిధులుగారు. నిజ్జమయిన ఆత్రేయ అంత సీను నాకుందంటారా.. అబ్బో ఎంతపెద్ద ఈరతాడేశారో పెద్ద బరువే పెట్టారు నాతలన. ఇంతకూ మీకు నచ్చిన కవితలేవో చెప్పలేదు.. వేచి ఉంటా.. నేను ఇంకా ఏఏటి ఒడ్డుకూ వెళ్ళలేదండీ.. తప్పకుండా చూస్తాను. ఆ "సమక్కుల్లాంటి" అన్న పదం నా పరిధిలో లేనిది కాస్త వివరించగలరు. అది మీరు కాదుగదా :-).. ఉండబట్టలేక అడుగుతున్నాను మీరు మాగంటి వారు కాదుగదూ ?!!
ReplyDeleteమారాజా
ReplyDeleteనాకు ఇంకోళ్ళ పేరెట్టుకునేంత గానీ, దాక్కుని మారుపేర్లతో రాసేంతగాని లేదండే. గానీ మీర్జెప్పిన మాగంటోరు నాకు బాగా దెల్సండే. మీకు ఇంగా అనుమానం ఉంటే అండే, దేవరపల్లి రాజేంద్ర గోరిని, పరుచూరి శ్రీనివాస్ గోరిని అడగండే. మీ కైతలకి ఎల్లా వచ్చేననుకున్నారు ? మాగంటాయన సెప్పగా సూడ్డానికొచ్చిన బ్లాగేనండే మీది. గాబట్టి, అదండే సంగతి. అయినా మాగంటాయన్ని గుర్తుకుదెచ్చి మాంచి పంజేసారండే. ఆయనకు నేను మూడొందలు బాకీ ఉన్నానండే. ఇయ్యేల్లే పంపిచ్చేత్తానండే.
సమక్కులా ? ఓ పాలి అలా ఏటొడ్డుకెళ్ళండే, మీకే తెలుసుద్ది
దిన్నెల వారికి మరో సారి ధన్యవాదాలు. అబ్బే అనుమానమేమీ లేదండి. ఎందుకో అలా అనిపించింది. మరోలా అనుకోకండి. మరో రెండు కొత్త పెర్లు చెప్పారు. మీవంటి పెద్దవారి, సాహిత్యాభిమానుల పరిచయం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. వస్తూ ఉండండి. ఇలా రాస్తూఉండండి..
ReplyDeleteఅదేంటి గురువుగారూ ! అంత అందమైన చివరి పేరాకి వివరణ అలా ఇచ్చారు ? కవిత మనసుకి హత్తుకొనేలా ఉందండీ !
ReplyDeleteHeart touching.....
ReplyDeleteపరిమళంగారు అందంగా చెప్పినవేవీ ఆనందం ఇవ్వాలని లేదుగా.. అలాగే చేదుగా ఉండేవన్నీ చెడు చేయవుగా.. మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteపద్మార్పిత గారు ధన్యవాదాలు