Monday, March 2, 2009

క్షమించవూ...


తప్పెవరిదైనా చెలీ తపనిద్దరిదీ
తగువేదైనా సఖీ మధనిద్దరిదీ..

కదిలే పాదాల మధ్య పెరిగే దూరాలు మనవే
రగిలిన వాగ్యుద్ధాల మధ్య నలిగే హృదయాలూ మనవే
మూగ బాసల సంభాషణల్తో నిండిన అగాధాలు మనవే
కనుసన్నల సంజాయిషీలలో పెరిగిపోయిన అపోహలూ మనవే ! .. తప్పెవరిదైనా...

అలిగి అటు తిరిగిన నేత్రాల్లో పొగిలే చలమలూ మనవే
విరిగిన పెదవుల సందుల్లో వంగిన భావాలూ మనవే
కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే
మన కలల ఖైదుల్లో జీవిత బందీలూ మనమే! .. తప్పెవరిదైనా...

మనమల్లుకున్న స్పర్ధల సాలె గూళ్ళల్లో
బరువెక్కిన గుండెలు వేళ్ళాడాల్సిందేనా ?
మనం కట్టుకున్న దర్పాల కోటబురుజుల్లో
బందీగా భావాలిలా పతనమనాల్సిందేనా ? ! .. తప్పెవరిదైనా...

తప్పులు పట్టే తత్వాన్నొదిలి
ఒప్పును చెయ్యగ పరుగున చేరా
అక్కున చేర్చగ చేతులు చాచి
రెక్కలు గట్టుకు దగ్గిర వాలా ! .. తప్పెవరిదైనా...


8 comments:

 1. నాకు ఈ కవిత చూస్తే, వేటూరి గారి, ఉన్నాను నీకు తోడుగా (ఇద్దరు సినిమా లోది) కవిత గుర్తొచ్చింది, నేను ఆ రిథమ్ లోనే చదువు కున్నాను, చాలా గొప్ప భావాల్ని చిన్న చిన్న పదాలతో పొందుపరిచారు, నాకు నచ్చింది.

  ReplyDelete
 2. కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే

  Beautiful! The beauty of this poem is a consequence of the team work of your soothing words.

  Beutiful!!

  ReplyDelete
 3. "తప్పులు పట్టే తత్వాన్నొదిలి
  ఒప్పును చెయ్యగ పరుగున చేరా"బావుందండీ ....ఏ ఒక్కరు ఇలా అనుకున్నా మనస్పర్ధలు మంచులా కరిగిపోతాయ్ ...... ఇద్దరూ అలాగే అనుకుంటే అపార్ధాలే దరి చేరవు .

  ReplyDelete
 4. మాటలు రావడం లేదు. కాని చెప్పలేని భావమేదో గుండెనిండా నిండి ఉన్నానంటుంది.
  గురువు గారూ మరో సారి మీకు మీరే సాటి.

  ReplyDelete
 5. తప్పులెవరివైనా తపనపడుతున్నది నీ కోసం!
  తగువులేవైనా తోడుకోరుతున్నది నీ కోసం!
  కదులుతున్న కాలంలో చూపులతో దూరంచేయకు,
  నలుగుతున్న హృదయాన్ని మాటలతో పొడిచేయకు,
  మూగభాషతో నైనా నన్ను ముడివేయనివ్వు.
  తడికన్నులతోనైనా నన్ను పలకరింపనివ్వు..

  పరిగెడుతున్న ప్రాయంలో ప్రళయాలు సృష్టించకు
  పోరాడకున్నా ప్రేమతో జయించగలము ప్రేమను
  అపర్థాల అడుగులతో అగాధాలు సృష్టించకు
  అర్థమైన ప్రేమతో ఆనందం పంచుకో..

  ReplyDelete
 6. నరహరి గారూ నాబ్లాగుకు స్వాగతం. వేటూరివారితో పోల్చి నాకవితకి బరువు పెంచారు. ధన్యవాదాలు.

  విజయమోహన్ గారు మీకు నాకవిత నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

  ఆనంద్ గారు.. మీకవితల్లో ఉండే పదాలు మోయగలిగినంత భావాన్ని ఈ చిన్నిచిన్ని మాటలు మోయలేవు అందుకే నిడివి పెరుగుతుంది. ఇటువచ్చినందుకు ధన్యవాదాలు.

  పరిమళం గారు మీఉత్తరాలు, యక్ష ప్రశ్నలు చూశాను. సమయాభావంవల్ల అక్కడ నా భావం వ్యక్తంచేయలేక పోయాను. ధన్యవాదాలు.

  శృతిగారు ధన్యవాదాలు. భావాలలాంటివి భాషదేముంది అందరికీ తెలిసినదే. మీరు తక్కువేమీ కాదు.. మీరు కలను ఆహ్వానించిన తీరు చూడండి ఓ సారి.. మీకు దిగటం వచ్చోరాదో అని చెట్టెక్కిచ్చడంలేదు లేక పోతేనా.. ఏ జెండాకర్రో ఎక్కిచ్చేవాడిని.

  అశ్వని గారు ధన్యవాదాలండి. అప్పుడప్పుడూ ఇలా సంతకాలు పెట్టండి రిజిస్టరులో లేకపోతే ఆబ్సెంటనుకుంటాను.

  వర్మగారు ఇక మీగురించేమి చెప్పను. కుంచేకాదు మీరు పెన్ను ఝుళిపించినా చిత్రాలే వస్తున్నాయి. చాలా అందమయిన స్పందన అందించి నాకవితకి విలువ పెంచారు. ధన్యవాదాలు.

  ReplyDelete