Tuesday, March 10, 2009

ఎగిరే భావాలు..




మనసు నెర్రల్లో ..
భావాలు ఇరుక్కున్నాయి
కప్పు చిల్లుల్లో వెన్నెల్లాగా..

గుండె ముంతలో ...
భావాలు దాచుకున్నాను
వాటి ఉపయోగం అది పగిలితేనే

భాష మూసలో
మనసు ఒదిగిపోతుంది..
నీటి గుంటలో ఆకాశంలా..

ఎర లేని మనసు గాలానికి
జ్ఞాపకాలు చిక్కుతున్నాయి..
గాయాలే మిగులుతున్నాయి..

మనసు ఆనందపు అంచులు
తాకుతుంది స్వేచ్చగా
ఆ ఎగిరే గాలిపటం లా..

గమ్యమెప్పుడూ..
అల్లంత దూరమే.. ఎంత నడిచినా..
భూమి గుండ్రంగా ఉందిగా..

నా మనసు బంగారు గని
తవ్వేది నేనే అయినప్పుడు
మిగలని నాకు బంగారమెందుకు?

రాత్రి నల్ల చీర కట్టిన
పగలే అవుతుంది...
ఒంటరితనం లో రెండూ ఒకటే ..

బందీ అయిన కాలం
గానుగెద్దులా తిరుగుతుంది
గడియారంలో... మనిషిని పిప్పి చేస్తూ..

గుండె గాయాలకు
కాగితాలద్ది.. ఆ మరకలని
అందంగా.. కవితలంటున్నాం ..

తడి చెంపల మీద
పదాలు నాటి
పద్యాలేరుకుంటున్నాం

నా ఆనందం
గుడ్డివాడి గుండెల్లో సూర్యోదయం
అందం చూపుల్లో ఉంటుందంటారుగా..

నిండుకుండ తొణకదు..
నిజమే నా కళ్ళు అలానే ఉన్నాయి
దూరమయ్యే నిన్ను చూస్తూ..

కరిగే మబ్బులతో
వెలిసిన వాన ఊరటనిస్తుంది.
ఈ కళ్ళు మబ్బులు కావే ?!

నీడా నిలకడగా ఉండదు..
వెలుతురుతో దోబూచు లాడుతూ
నాకెవరు అసలైన ఆధారం ..

తలపు జల్లుల్లో
తడిసేలోపే ఆశల గాలికి
గుండెలెండి పోతున్నాయి

మెరిసిన జ్ఞాపకం ..
ఉరిమిన గొంతు, కురిసిన కళ్ళు..
అబ్బ.. వాన ఎంత అందమైనదో ..

9 comments:

  1. స్పందించి ఎగసిపడే మనసుకు
    తెలియదు ఆ స్పందన తీరాన్ని చేరాలంటే
    నా చేతినుండి పదాల సునామీ రప్పించాలని
    ఆ పదాల సునామీ సృష్టించలేక ఇలాగే ఆగుతున్నా

    ReplyDelete
  2. బావుందండీ ! వసంతోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  3. గుండెలో కొలువైన తలపుల జల్లుకు అది కరుగుతుందేమో కాని ఎండదు.
    కరిగి కరిగి "నేను" అనేది లేకుండా చేస్తుంది. మరదే కదా గమ్మత్తు. ఆ మత్తులోనే మనం జ్నాపకాల మెరుపులు, మైమరపించే కళ్ళలోని ఊసులు వెతుక్కుంటు, ఏరుకుంటూ ...
    కొత్తలోకాన్ని ఆవిష్కరించారు కదా గురువు గారూ!

    ReplyDelete
  4. ఫణి ప్రదీప్ గారు, పరిమళం గారు, పద్మార్పిత గారు ధన్యవాదాలు.
    శృతిగారు ధన్యవాదాలు..

    ReplyDelete
  5. చక్కని పదబంధం
    మెరుగైన అల్లిక
    మంచి భావం
    అరుదైన గేయం

    ReplyDelete
  6. జయచంద్ర గారు ధన్యవాదాలు

    ReplyDelete
  7. ఆత్రేయ గారు!

    "అందమయిన భావాలు ..
    పొందికైన శబ్దాలు ...
    ’ఆత్రేయ’ మళ్ళీ పుట్టాడా?"

    అభినందనలు
    - డా|| ఆచార్య ఫణీంద్ర

    ReplyDelete
  8. ఆచార్య పణీంద్ర గారు ధన్యవాదాలండి..

    ReplyDelete