Saturday, February 21, 2009

చెరువు


నింగి మబ్బులు కప్పుకుని దాలి గుంటలో పిల్లిలా ఒదిగి
ప్రశాంతంగా పడుకున్న ఆ చెరువు చూస్తే అందరికీ అక్కసే

ఇటు గట్టున మర్రి చెట్టు
ఊడ చేతులు దూర్చి కితకిత లెడుతుంది
కాళ్ళనందులో దించి నీళ్ళు తాగుతుంది
ఒళ్ళు మండిన చెరువు ఒడ్డు తడుపుతుంది.

అటు గట్టున పారిజాతాల చెట్టు
పువ్వులిసిరి సరసాలాడుతుంది
పరవశపు గుండ్రాలు తెగ రేపుతుంది
నచ్చని చెరువు దాని బింబాన్ని పట్టేసి నలిపేస్తుంది

ఇటుపక్క చేరిన పనిలేని పిల్లాడు
పలక రాళ్ళను తీసి విసురు తున్నాడు
వాటి కప్ప గంతులు చూసి ఎగురుతున్నాదు
వాడి కేమి తెలుసు? తగదన్న చెరువు దాన్ని తిరిగి విసిరిందని ?

వీస్తున్న గాలికీ అదను దొరికినట్టుంది
చెరువు కప్పుకున్న ముసుగు లాగేసింది
కోపమొచ్చిన చెరువు, ప్రకృతి అంతా ఒడ్డు పక్కన కట్టేసి
తన మధ్యలో నీలాకాశాన్ని, సూర్యుడిని పట్టి బంధించి
తెగ ఊపి కసి తీర్చుకుంటుంది

9 comments:

  1. బాగు బాగు బహుబాగు, ఇదేం చిత్రం, సాహితీ మిత్రమా, నేనూ నా సరస్సు/సెలయేరు గురించే వ్రాస్తినాయే. కూసింత ఆలోచనల, స్పందనల విభిన్నత, అంతే. సమయాభావం ఇపుడు అందరినొదిలి నాఒక్కదాని దరికి చేరినట్లుంది :( చాలా వెనుకబడిపోతున్నాను, చదవటం, వ్రాయటం రెండిటా. దైనందిన జీవితం కొండచిలువలా నాలోని మనిషిని మింగేస్తుంది. ఒకసారి చూడండి.

    "ఇంత చెప్పాక ఇక పేరడుగరు మరి!!!" - http://maruvam.blogspot.com/2009/02/blog-post_16.html

    ReplyDelete
  2. చెరువంత కోపం చూపినా
    చేరువ చేశారెలా? (కవితకు)
    చెప్పొద్దూ అంతోటి
    చెరువు కూడా
    గువ్వలా ఒదిగింది
    మీ కవిత్వపు కౌగిలో
    ఏదేమైనా గురువు గారూ!
    కదిలే మేఘాన్నైనా మీరు.

    చాల అన్న పదం చిన్నగా కనిపిస్తోంది. ఎందుకో మరి?
    అంతకు మించి మరో పదం కనిపించ లేదు.
    చా....లా బాగుంది.

    ReplyDelete
  3. చాలా బాగుంది. :)
    మహాశివరాత్రి శుభాకాంక్షలు

    ReplyDelete
  4. మన్నించాలి, వాక్యం పుర్తిగా చెప్పకుండానే వ్యాఖ్య ముగించేశాను.

    కదిలే మేఘాన్నైనా మీరు
    ఒడిసి పట్టేయగలరు.

    అని నా అభిప్రాయం.

    ReplyDelete