Showing posts with label ఓటమి. Show all posts
Showing posts with label ఓటమి. Show all posts

Wednesday, October 14, 2009

పశ్చాత్తాపం



తప్పు బరువు పెరిగి రెప్ప
తోడు చేరింది
కాళ్ళు విరిగిన ప్రేమ
కరిగి జారింది

దిశ మళ్ళిన చూపు
నేలపాలవుతూ..
గోరు గురుతును చేరి
సేదతీరింది

గుండె ఒలికిన గంగ
దొప్పల్ని నింపితే
వేడి శ్వాసల హోరు
ఆవిరిగ మార్చింది

ముడిబడిన భృకుటి
విప్పలే లేకేమో
అదిరెడి చుబుకము
పెదవి విరిచింది

నీట తేలిన జగతి
నిలువ నేర్వని స్థితి
నివురు గప్పిన ఆశ
నేటి బ్రతుకు.

Monday, September 7, 2009

దొరకని ప్రేమ..


చిరు దీపపు వెలుతురులు
అటు వైపూ .... ఇటు వైపూ.

తక్కెడలోని బరువులు , అవిశ్రాంతంగా..
ముల్లును కదుపుతూనే ఉన్నాయి..

రెండు విల్లులు విడిచిన
ఒకటే బాణము..
తపనలు తెలియకేమో ..
తగల కుండా .. దూసుకు పోయింది.

జారి పడ్డ ఈకలు ఏరుకుని
రంగులో ముంచి
రంగరించుకుంటున్న నాకు,

కరిగిన రాత్రి,
రెల్లు గడ్డి మీద...
చల్లగా తగిలి
మేల్కొలిపింది.

Monday, August 3, 2009

నీడ


ఎన్నాళ్ళగానో
నన్ననుసరించిన నా నీడ ...
తనకూ రంగులు కావాలనడిగింది.

కలన తప్ప రంగెరుగని నేను,
కన్న ప్రతికలనుండీ,
తను కోరిన రంగులు
రంగరిస్తూ వచ్చాను..

చాలలేదనుకుంటాను..
వెలుగు కలిసిన ప్రతి క్షణం..
అర్ధిస్తూ నిలబడుతుంది.

విధిలేక కలలూ..
నా రెప్పలు చీల్చుకుని
కాంతి తీగెలు వెదుక్కుంటున్నాయి.

వివర్ణ ప్రవాహంలో
ఎదురీదుతూ..
అలసిన గురివింద కళ్ళు..
తమ ఎరుపు మరిచి నట్టున్నాయి.

Tuesday, July 28, 2009

కవితా శకలం


చూపులు కలిసిన ప్రతిసారీ
పెగలని పదాలు
పెదవుల మాటునే
కరిగిపోతున్నాయి..
పువ్వులు పూస్తున్నాయి..

జారిపోయే క్షణాలు
రెప్పల వెనక
తిరుగుతాయే కానీ
చెక్కిళ్ళపై జేరి..
బరువైనా దించవు..
వ్యస్థ జీవితం ముసుగులో
ముఖం దాస్తున్నాయి..

నిన్ను మరిచానన్న నమ్మకం
నీకు కలిగించడం కోసమేనేమో...
ఈ అసంకల్పిత స్పందన !

నిప్పును మ్రింగి
వెన్నెల కురిపించే
ఆ చందమామదీ
ఇదే కధేమో ...

నీక్కావల్సినదానిని
మరో సారి చెప్పనీ..
నేను నిన్ను మరచాను !!

నిజమే.. నిన్ను నేను మరచాను..
కానీ... నువ్వే !!.... ప్రతిక్షణం..
ప్రతిఒక్క క్షణం.. గుర్తొస్తున్నావు ..

కంటి తడిలాగానో..
కవితా శకలంలాగానో !!

Friday, June 12, 2009

రాత్రి




విరగబూసిన జ్ఞాపకాలు
మెడన వేసుకుని, ఎప్పటిలానే..
కలలు పరిచిన నిశీధిలో
విరిగి చెదిరిన ఆశ తునకలు
ఏరి తిరిగి కూర్చలేక ..
బంధాలు త్రుంచి,
బరువు తీర్చమన్నట్టు..
వేడి నిట్టూర్పుల బలానికి
విగత భావాల తోడుగా
అనంత వీధుల్లో..
ఈ రాత్రి...
గాలిపటంలా ఎగరుతుంది..

పండు వెన్నెల, పిల్ల గాలులూ..
ప్రకృతి అందం... ఏమాత్రం పట్టవు.
చుక్కాని విరిగిన పడవ సరంగులా
బ్రతుకు పోరాటంలో
తపన పడుతూ తిరుగుతుంది..
ఊపిరి ఉగ్గబట్టి ... పంటిబిగువున
బంధాలను లాగుతుంది..

రంగులు పులుముకుంటున్న
తూర్పు కొండల వెకిలి నవ్వు..
చెట్టు కొమ్మల్లో ప్రతిధ్వనిస్తుంది..

ఓడి కరిగిన రాత్రి అవశేషాలు
వెలుగు చూడని కోణాల్లోకి
విసిరేయబడతాయి !!

Tuesday, June 9, 2009

మూగ ప్రేమ

(ఈ చిత్రము http://emsworth.wordpress.com/tag/willard-metcalf/ నుండి గ్రహించబడినది.)

ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…


పొద్దులో ప్రచురించబడిన మూగ ప్రేమ .

Wednesday, May 20, 2009

నీది గెలుపెలా అవుతుంది ?


ముఖాన పచ్చపోసుకున్న
ఆ పన్నెండు మైలు రాళ్ళేగా
నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా..

ఐనా అవి దాటిన ప్రతిసారీ
నా గుండెలవిసేలా అరచి మరీ చాటింపేస్తావు
వెనక బడ్డ నన్ను చూసి గేలిచేస్తావు

నీ పరుగుకు మూడు కాళ్ళు ..
మరి నాకూ.. ఎన్ని అడ్డంకులేస్తావు ?
ఎందుకెగతాళి చేస్తావు ?

నేనే లేనప్పుడు, నీకస్థిత్వమేదీ ?
నా బ్రతుకంతా నిన్ను నింపుకున్నానే
నువ్వు నాకిచ్చేదేమిటి ?

ప్రమేయం లేకుండానే జారిపోతావు..
ఆపడానికెన్ని చేశాను ?
నిన్ను గోడకు శిలువేశానే ..

ఐనా అవిశ్రాంతంగా.. నా బ్రతుకు బాట వెనక
అగాధాలను తవ్వుతూనే ఉంటావు..
గమ్యం కానరాకుండా..
ముందు మలుపులు తిప్పుతూనే ఉంటావు.

దాటిపోయేదాకా .. వెనకున్నావని తెలియదు..
నా ఓటమే.. నీ గెలుపుకి సాక్షి.

ఈ ఆట ఏకపక్షంగా లేదూ..?
నీది గెలుపెలా అవుతుంది ?




Tuesday, April 14, 2009

నన్నిలానే చావనీ..


కన్నీరొలకనీయకని చెప్పకు
నేనెందుకు ఇలా వున్నానో నీకు
తెలియదనీ చెప్పకు..
ఈ కోతకి కారణం నీకెరుకలేదనీ చెప్పకు ..

నిండిన కళ్ళు, తడి చెక్కిళ్ళు
గద్గదమయిన స్వరమూ
ఈ తడీఅరిన గొంతుకనూ విడిచి
దైర్యంగా బ్రతకమనీ చెప్పకు ..

ఈ గుండె లోతుల్లోని విషాదాన్ని
ఏమర్చి బ్రతుకు నడపాలన్న కోరిక
నాకు ఏ కోశానా లేదు.. అది ఎందుకో
నీకు అర్ధమవ్వాలనీ లేదు.
చెప్పాల్సిన అవసరమూ లేదు..

ఎందుకో.. నిష్కారణంగా.. ఈ రోజు
నా కళ్ళు ఒలుకుతున్నాయి..
పెదవులు వణుకుతున్నాయి..
గట్టి నిర్ణయాలు కొరుకుడు పడకేమో
ఐనా నీకెందుకు చెపుతున్నానూ ?...వదిలేయి..

నా బ్రతుకెలా మారిపోయింది
నేనెలా ఉండేవాడినో కూడ మర్చిపోయాను..
ఏమీ ఎరగనట్లు, ఏమీ జరగనట్లు
తల తిప్పుకుని వెళ్ళిపోయావు..
అంతకన్నా ఆశించినదేమీ లేదులే.

నేను ఆ పాత నాలా మార కోరట్లేదు
ఎప్పటికీ.. కొన్ని గాయాలు పచ్చిగా ఉంటేనే..
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ. ఈ కసి తీరేట్టుగా లేదు
అనుభూతి అందంగా ఉన్నట్టుంది
అది పూర్తిగా నన్ను వశంచేసుకున్నట్టుంది.

నేనేమి చెయ్యనూ.. అంటావా...
అయ్యో ఆగి మరీ విన్నావా ?..
క్షమించు.. ఇది నా స్వగతం..
నీ బ్రతుకు నీది.

ఇలానే నా ఆశ కాష్టాల
నెగడులో చలి కాగుతూ..
అశృధారలతో నా గాయాలు
తనివి తీరా కడుగుతూ..
నా బ్రతుకు బతకనీ
నన్నిలానే చావనీ..

Wednesday, April 8, 2009

రాత్రి భయం


నిన్న పడమటి వేటగాడు చల్లిన
విశ్రాంతి గింజల కోసం వాలిన రాత్రి
జ్ఞాపకాల వలలో చిక్కి, బెదిరిన కళ్ళతో
చీకట్లో వణుకుతూ విలవిలలాడుతుంది.

తూర్పు కొండమీద అతనొస్తున్న అలికిడి
వెలుతురై ఆకాశాన్ని ఓ పక్క ఆవరిస్తుంటే...
పెల్లుబికిని బ్రతుకు భయం, తన కళ్ళనుండి
సింధూరమై తూర్పు నింగిని అలుముకుంటుంది

దాని నిట్టూర్పుల వేడి శ్వాసలు తగిలి
ఇళ్ళముందు కళ్ళాపులు ఆరుతున్నాయి
ఆతృత అధికమయి నుదుటి బిందువులు
దాని ఆశలా జారి పచ్చగడ్డి మీద జేరుకున్నయి

అంతవరకు తనకి ఊరట కల్గిస్తూ, స్నేహంగా ఊగి
ఊసులాడిన కలువా.. మూతి ముడిచింది.
తలవంచి దీనంగ శోకాన్ని గుప్పించి, పొద్దు
తిరిగేసరికి ముఖము తిప్పె మరికొన్ని పూలు.

వేటగాడటుగా రాకుండ పోడు ..
చీకటి రాత్రినతను మింగకా పోడు..ఇది
కుమ్మరి చక్రంలా..సాగుతూనే ఉంటుంది.
పునరావృతమవుతూనేఉంటుంది ....

Monday, November 3, 2008

నేనే ఎందుకు ఇది నాకే ఎందుకు ?

అలిసిన ఊహలు విసిగిస్తున్నా
బలమున వాటిని బంధిస్తున్నా
రానని నవ్వులు పరుగిడుతున్నా
వాటిని మోముపై పులిమేస్తున్నా
నీ ఆటలకిక అంతం లేదా
నా ఓటమి నీక్కనపడలేదా

ఆగక కన్నులు చెమరేస్తున్నా
త్వరపడి వాటిని తుడిచేస్తున్నా
ఓటమి నాపై నడిచేస్తున్నా
రోషపు రంగులు పులిమేస్తున్నా
నీ ఆటలకిక అంతం లేదా
నా ఓటమి నీక్కనపడలేదా

ఇకసరి,
నేనోడితి,
మోకరిల్లితి,
ఓటమినొప్పితి
దోసిలి ఒగ్గితి
నీ గొప్ప పొగిడితి
నీ పాదము కడిగితి
ఇకనైనా.. నీ ఆటలకు అంతం లేదా
నా ఆక్రందనలు వినపడలేదా


alisina uuhalu visigistunnaa
balamuna vaaTini bandhistunnaa
raanani navvulu parugiDutunnaa
vaaTini mOmupai pulimEstunnaa
nee aaTalakika antam lEdaa
naa OTami neekkanapaDalEdaa

aagaka kannulu cemarEstunnaa
tvarapaDi vaaTini tuDicEstunnaa
OTami naapai naDicEstunnaa
rOshapu rangulu pulimEstunnaa
nee aaTalakika antam lEdaa
naa OTami neekkanapaDalEdaa

sarE, dEvuDuu..
nEnODiti,
mOkarilliti,
OTaminoppiti
dOsili oggiti
nee goppani pogiDiti
nee paadamu kaDigiti
ikanainaa.. nee aaTalaku antam lEdaa
naa aakrandanalu vinapaDalEdaa