పట్టె మంచము మీద తూర్పుగా తలపెట్టి
కాలి మట్టెల వరకు తనువంత దాచేస్తు
కటిక చీకటి గప్పి కునుకు తీసే పడతి ...
సవ్వడే లేకుండ సరసాలు ఆడంగ
చల్లగా దరికి జేరి విరహమందిన ప్రియుడు
మెల్లగా ఆఝాము తెర లాగుతున్నాడు ...
చిమ్మ చీకటి అడవి..మధ్య నడిచెడి దారి..
బాట చివరన ఎరుపు గగన తలము ..
ఆ క్రింద మెరిసేటి కొండ చరియల నడుమ
నిండుగా ముద్దొచ్చే భాను మందారం..
తమ సఖుడి రాకతో, ఆనంద ముప్పొంగి
వికసించి నవ్వేటి రెండు పద్మాలు..
పద్మాల పూ తావి చాలదనుకుందేమో
తనవంతు గంధాలు విరజల్లు సంపెంగ ..
పగడాల తమ కాంతి దశదిశలకూ జిమ్మి
పగటి వెలుగులు మింగి ముత్యాలు గా మార్చి
పలకరింపుగ చూచె ఆలుచిప్పల నవ్వు.
ఆనంద దుందుభులు ప్రాగ్దిశలో మ్రోగంగ
ఆ తాళానికనువుగా తపన తీరేలాగ
తనవంతు గాన్నాన్ని తోడు కలిపిన శంఖు..
ఇంత సుందర తరుణమూరికే జారేనా ?
కొంత తడవైనా దాన్ని కట్టేయవద్దూ.. ?
ఆమంగళావకాశాన్ని ముడులేసి బంధించి
గుండెలోతుల్లో దాచేటి బంగారు కలశాలు..
సురగంగ ఉప్పొంగి శివుని శిరమున చేరి
సుడులెన్నొ తిరిగేసి విసిగినట్టుంది ...
భువి పైకి జారంగ బలమైన తలమేదొ
తెగవెదికి ఆ స్థలము ఎంచినట్టుంది..
తనధారనోపంగ హరుని జడలోతునుబోలు
కూపాన్ని ఆ మధ్య తవ్వి నట్టుంది..
ఈజగతి మెచ్చంగ సురపతే నొచ్చంగ
వాడి ఏనుగు వాడి దంతాలు మాయమై
వడివడిగ పరుగెత్తి ఇటుదాగెనెందుకో ?
ఎర్ర కలువల మీద అందాల ఈ రాశి
ఎన్ని తావుల జనెనో ఎంతగా అలసెనో ...
తనువు మరిచి..
విభుని కొరకై తపియించు ఋషి లాగ ..
తపనలెరుగక..
అమ్మ ఒడిలోన శయనించు పాప లాగ..
నిద్ర ఒడిలో తాను ఒదిగి ఉంటే..
ఆశగా అటుచేరి ఆమె విభుడు నేడు
అందాన్ని ఆసాంతం ఆవిష్కరించాడు..
మమతతో ఆవిడ్ని ఓలలాడించాడు..
కవితలో తనువంత పూలు కురిపించాడు..