Tuesday, April 7, 2009
ఆ వానకు అర్ధం ఉంది.
నా "వాన " కవితకు చాలా మంది స్పందించారు.. ధన్యవాదాలు.
ఆ కవితలోని మాటలు, ప్రకృతి అందాన్ని నా భావుకత జోడించి
రాసినట్లుగా మీరందరూ దాన్ని ఆస్వాదించారు.. అభినందించారు
ధన్యవాదాలు. కానీ...
మీరు గమనించారో లేదో.. ఆ కవిత లేబుళ్ళలో ఒకటి, తత్వం.
ఆ కోణంలోనుంచి ఈ కవితను ఎవరూ ఆస్వాదించలేదని నా అభిప్రాయం
ఎందుకంటే వచ్చిన వ్యాక్యలలో అది లేదు కాబట్టి. అదికూడా తెలిస్తే (కవితలోని
మాధుర్యం.. ఇంకా ఆనందింపజేస్తుందనిపించి)
ఈ వివరణ ఇస్తున్నాను...
ప్రధానంగా.. ఈ కవిత.. చాలా పోలికలతో నిండి ఉంది.. ఇదే కవితలోని కొన్ని
పదాలను మార్చి రాస్తున్నాను.. చూడండి... అవే పదాలు ఎందుకు వాడాను ?
వాటి తత్వం ఏమిటి ? వాటి నైజమేమిటి ? అన్న వి మీకే వదిలేస్తున్నాను.
అవధరించండి..
నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల
కన్నీటి దారలతో,
వేదన గాలి పటాలు ఎగరేస్తూ ....... (అవి గాలి పటాలెందుకయ్యాయి ?)
బాధ చెక్కిళ్ళపై పరవళ్ళుతొక్కుతుండగా
వేడి నిశ్చ్వాసలు జగమంతా నింపుతుంది.. మనసు
నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు
నా ఒడిలో పడి (ఒడి అంటే ?)
మత్తుగా.. తావి లేని కన్నీరు (మరి రంగు రుచులున్నాయా ?)
పువ్వుల్లా చిందు తున్నాయి, బరువు కిరీటాలు దించుతున్నాయి (పువ్వుల్లా ఎందుకు ? కిరీటాలేమిటి ? )
ఒడిలో చేరి ఇంకి పోతున్నాయి.. మెల్లగ.. కన్నీళ్ళు
జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.
జారే కన్నీటి ధారల్లో
దోబూచులాడుతూ.. బాహ్యరూపం లేదుగనక
నీటి ఆసరాతో వ్యక్త మవుతున్నాయి.. (మరి చిన్న పిల్లల్లా ఎందుకన్నాను ?)
తామెక్కడున్నాయో చాటుతున్నాయి.. మనో భావాలు.
ఇప్పటికే మీతలలు వేడెక్కి ఉంటాయి. ఇక విరమిస్తాను..
Subscribe to:
Post Comments (Atom)
మీ చక్కని కవితాపటిమత, భావుకత అవగతమయినది గురువుగారు. Well experienced better expressions in our daily life what we expected from Telugu poetry fortunately found in some of your Best poems which we like lot in Best way. Congrats.. once again...:D
ReplyDeleteపృథ్వి గారు ధన్యవాదాలు
ReplyDeleteఆత్రేయ గారు, మీరన్నట్టు భావుకతకే పెద్ద పీట వేసాను కాని తాత్వికతను పట్టించుకోలేదు......ఇవాల్టి వరకు ఆలోచించాను...అయినా తట్టలేదు....వివరించగలరా? కావాలంట్ పర్సనల్ మెయిల్ లో అయినా నాకభ్యంతరం లేదు...తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది....చెప్పగలరా దీని వెనుక ఉన్న తాత్వికత?
ReplyDeleteఇప్పటి వరకు నాకర్థమయినది..... వేదనను మనం నియంత్రించగలం అనేది చెప్పెందుకో, కన్నీళ్లు కానిచ్చేస్తే (దారం పూర్తయితే) ఎటో వెళ్లి పోయి మళ్ళీ దొరకదు (బాధించదు) అన్నట్టు అర్థమయింది...వేదనను నియంత్రించేందుకు మాత్రమె కన్నీళ్లు.....దాని ఫలం కాదు...అన్నట్టు తోచింది. (మీ కవిత మొదటి పేరా రెండవ వర్షన్ ప్రకారం )
దాన్నే మీరు ఆశావాహకంగా చెప్పాలని ప్రయత్నిస్తూ......."నల్లని" తో "వేదన"ను సూచిస్తూ....కన్నీళ్లు కురిస్తే....(దారం అయిపోతే)....మనసు (నేల) ఆశావాహకంగా (సుగంధ పూరితమవుతుంది) అవుతుంది అని చెప్పినట్టు తోచింది....అంటే కన్నీళ్లను అహ్వానిస్తున్నారన మాట....విషాద చిహ్నంగా కాదు....విషాదాంత చిహ్నంగా చూడాలి కన్నీళ్లను అన్న బోధన అని అనిపించింది. (కవిత మొదటి వర్షన్ మొదటి పేరా)
రెండవ పేరా రెండవ వర్షన్
అలా జారిన కన్నీళ్లు ఇంకేదీ మనసులోనే (ఓడి లో)....... ఆ కన్నీళ్లు (ఇక్కడ పశ్చాత్తాపం అనే ధ్వని వినిపించింది కన్నీళ్లు అంటే) అలా మనసులో ఇంకి.......కొత్త ఆలోచనలకు (పూవులకు) అనురార్పణ చేసాయి...బరువు కిరీటాలు (పుప్పొడి = భవిష్యత్ లో పెద్ద చెట్టు=బరువు కిరీటాలు ?) నవ్య భూమికి (సస్య స్యామలానికి) నాంది పలుకుతున్నాయి (దించుతున్నాయి) అన్నట్టు తోచింది.......కాకపొతే ఇంట ఆశావాహకంలో "తావి లేని" అనేసి ఈ అన్వయం సరి కాదు...ఈ వర్షన్ ఆశావాకం కాదు అని అనిపించేలా చేసారు....నేను తాతివకత కోసం భూతద్దంలో చూస్తున్నానేమో అనిపించింది....ఈ నా అన్వయం చూస్తుంటే.
రెండవ పేరా మొదటి వర్షన్
కన్నీళ్లు (చినుకులు) నేల (మనసు)లో చేరి ఆనందాన్ని కలుగ చేస్తూ (పువ్వుల్లా విచ్చుకుంటూ) ఆశ అనే కిరీటాలను (అయితే అవి "నీటి" కిరీతాలేందుకు అయ్యాయి? ఏమో అర్థం కాలేదు.... ) ఇచ్చాయి అన్నట్టు తోచింది....అయితే ఇక్కడ కూడా "తమకంలో, తావి మరచి" అన్నప్రయోగం కొంత నీచ ప్రయోగంగా అనిపించి నా అన్వయం తప్పు అని అనిపించింది.....ఇక్కడ కూడా "తావి" కొరుకుడు పడలేదండి.
మూడవ పేరా రెండవ వర్షన్
నాకు ఇందులో నిగూఢ అర్థం ఏదీ అగుపించలేదండి. తేటతెల్లంగా అర్థం స్ఫష్టంగానే ఉంది అని అనిపించింది....కాబట్టి మళ్ళీ వివరించటం లేదు.
మూడవ పేరా మొదటి వర్షన్
మనోభావాలు (ఎమోషన్స్) తమది తప్పని తెలిసినా/సర్దుకు పోవాలని తెలిసినా .... చిన్న పిల్లల్లా ..నిజంగా అవుటయినా "నేనివ్వను బాట్....నేను అవుట్ కాదంతే" అంటూ బాట్ అట్టే పెట్టుకునే చిన్న పిల్లల్లా.... నాది తప్పయితే మాత్రం అలా అనవచ్చా అనుకుంటూ ఇంకా ఆగి ఆగి దుఖాన్ని రేపుతూ (ఊపుతూ) (కన్నీళ్లను ఆగి ఆగి తెప్పిస్తూ) తమ ఉనికిని చాటుకుంటాయి...అని చెప్పారనిపించింది.
మీ మొదటి వర్షన్ లో......ఇలా అనిపించకపోవటానికి కారణం....కథా వస్తువును సూచించే చిన్న సూచన అయినా లేకపోవటమే కారణం అయి ఉండొచ్చు ఆత్రేయ గారు....ఆఫ్ కోర్స్...మాలాటి వారికి....లోతుకెళ్ళి వెతికే శ్రమ చేసేందుకు బద్ధకం కూడా లెండి :-) పైన కనపడ్డ భావుకతే చూసాను అప్పుడు.
మీ రెండవ వర్షన్ అలాగే పెట్టుంటే (మొదటి వర్షన్ గా మార్పు చేయక ) తప్పక తత్త్వం కొంచం అన్నా స్ఫురణకు వచ్చేది...తప్పు మీది అని తోసేస్తున్నా చూడండి :-)
ఒక చిన్న మాట/అనుమానం.................మీ మొదటి సూటి వర్షన్ నిజంగా చాలా బావుంది.....దాన్ని ఎందుకు రెండవ వర్షన్ గా మార్చారు?..............నిగూడంగా ఉండి తీరాలా కవిత? లేక ఇంకేదన్నా ఆలోచన ఉందా మార్పుకు? నా అన్వయం ఇది....అసలు రచయిత అన్వయమేమిటో వినాలని ఉంది.....ఇక్కడే అయితే పెక్కు అన్వయాలు.... అభిప్రాయాలు వస్తాయి..అందుకని చర్చ ఇక్కడే చేస్తారని ఆశ.
భవదీయుడు.
భావకుడు గారూ..
ReplyDeleteకవిత కొంచెం వ్యాఖ్య ఘనం అన్నట్టు ఉంది... మీరంత సమయం వెచ్చించి అంత పెద్ద వ్యాఖ్య (ఇప్పడిదాకా నాకవితలకు వచ్చిన వాటిలో మీదే పెద్ద వ్యాఖ్య) చేసినప్పుడు, నా వంతు వివరణ ఇవ్వడం నా బాధ్యత.
మొదటి 'వాన ' ను.. నేను చెప్పాలనుకున్న దానిని పూర్తిగా భావుకతే ప్రధానంగా కనపడేలా రాసిన మాట వాస్తవమే.. సాధారణంగా కవితల్లోని అంశము ప్రకృతి ప్రధానమయి నప్పుడు.. దానికి భావుకత జోడించి దానిని ఓ భావ చిత్రంగా మనోహరంగా, హృదయానికి హత్తుకునేలా తెరకి ఎక్కించడం జరుగుతుంది.
అందుకు భిన్నంగా.. ఈ కవితలో, ఒక విషయాన్ని చెప్ప దలిచి దానికి ప్రకృతి ముసుగు గప్పి, సమాంతర ఉదాహరణలు సూచికలుగా వాడి, దానికి భావుకత జోడించి ఓ పదచిత్రాన్ని ఆవిష్కరించాను. ప్రకృతి చిత్రం ప్రస్ఫుటంగా బహిర్గతమవడంతో, దాని కాన్వాసు లోతులకి తొంగి చూడొచ్చేమో అన్న సూచన నేనివ్వక పోవడంతో (మీరు పెట్టిన నింద స్వీకరిస్తున్నానండీ ) అసలు భావం వెనకనే ఉండి పోయింది. దాంతో వాన1.2 విడుదల చేయాల్సి వచ్చింది. మీరన్నట్లుగా దీంట్లో కొన్ని సూచనలిచ్చాను.. చదువుతున్నది కాక వేరే ఏదో అర్ధం ఉంది ఇక్కడ అన్నట్లుగా..
వివరించాల్సినది తెరవెనకౌన్న విషయం కాబట్టి, మొదటి వర్షనును పూర్తిగా స్పృసించకుండా వదిలేస్తున్నాను. మీరు చాలావరకు నేను చెప్పదలిచిన దానిని గ్రహించారు. ధన్యవాదాలు. మీకు వచ్చిన అనుమానం/అభ్యంతరము 'తావి లేని ' 'తమకంలో ' అన్న మాటలతోనే. రెండవ పేరా ఆశావహం కాదు 'తావి లేని ' అనడం వల్ల అన్నారు అది కొంత వరకు నిజం కానీ ఆకారణం వల్ల కాదు. వివరిస్తాను.
మనసుకు ఎప్పుడూ తోడుండే నీరు బహిర్గతమై తననుండి విడివడి ఉన్నది కనుక తిరిగి తనని చేరడానికి తహతహ లాడుతుంది. అంకుకే 'ఒడి ' లోకి ఉరికింది విరహాన్వితయై అన్న భావనలో 'తమకము ' వాడాను. ఇక 'తావి '. మనసు నుండి విడివడిన నీటికి జరిగిన పరివర్తన అది. తావి అన్నది పువ్వుకు నాది అని చెప్పుకోగల ఒక ఆస్తిగా చెప్ప వచ్చు. ఇది ప్రక్షాళితమయిన కంటి చుక్క. తనదైనది ఏదీ లేదు. నోటిలోకి చేరిందనో, పెదవి సందుల్లో జేరిందనో రాస్తే, దానికి రుచి ఆపాదించాల్సి వస్తుంది. లేదా చెక్కిలి మీద నిలిచింది అని చెపితే దానికి ఏ వాసనో అందించాల్సి వస్తుంది. అందుకే ఒడిలో పడి అనటంలో ఆ రెండిటి అస్థిత్వాన్నీ అనుభూతిలోకి వచ్చే అవకాశాన్ని తీసేశాను. అనుభూతి లేని దాని అస్థిత్వమెప్పుడూ ప్రశ్నార్ధకమే.. అందుకని అవి లేవన్న భావన అక్కడ ఆవిష్కరించాను. నిర్మలత్వాన్నీ, నిశ్చలత్వాన్ని సూచించాను.
నీటి కిరీటాలు -- రెండవ కవితలో -- బరువు కిరీటాలయ్యాయి. నిష్కల్మషమయిన కన్నీరు మనసులో జేరి, కొత్త చిగుర్లు, తిరిగి కన్నీరొలకని కొత్త ఆలోచనలు, బాధకు విరిగిన బురుజులను తిరిగి పురరుద్ధరిచే కొత్త ప్రయత్నాలతో, తన మనో సామ్రాజ్యానికి తనని తిరిగి పట్టాభిషిక్తుడిని చేస్తాయి. అవికిరీటాలు. పదవితోపాటూ బాధ్యత, ఆశతోపాటు నిర్వర్తించాల్సిన పధకాలూ.. ఇలా తిరిగి బరువు పెంచుతాయి. అందుకని అవి బరువు కిరీటాలయ్యాయి.
ఇక మూడవ పేరా.. విరిగిన ఆశలు, మనో భావాలు, బాధ, ఆశలు, బాధ్యత వంటివి పరోక్షంగా మనకు కన్నీళ్ళ ద్వారా వాటి అస్థిత్వాన్ని తెలియ జెపుతాయి. కురుస్తున్న చినుకుల వెనక గాలి లాగా.. మీరన్నట్టు, మన ప్రస్థుత మానసిక స్థిని అర్ధం చేసుకోకుండా మారాం చేసే చిన్న పిల్లల్లా.. ఇందాక మనసుకు కొత్తగా వచ్చిన కిరీటాలు రేపేవే ఇవన్నీ కూడా.. ఇప్పుడేగా.. నిర్మలత్వం, నిశ్చలత అని అనుకున్నాము, మానవ నైజమిది.. తిరిగి మళ్ళీ ఆదే కూపంలోకి జారుతున్నాం. మళ్ళీ కన్నీరొలికేదాకా మనకు ఆవిషయం తెలియదు. ఇది మూడవ పేరా.
కవిత మొత్తానికీ.. ఆధారం ఇది.
ఆశగా ఉదయిస్తుంది..బాధ్యతగా నెత్తికెక్కి,
విధిగతికి లొంగుతుంది .. పడమటికి వంగుతుంది...
వెలుగులుడిగి రాత్రిగా శోకిస్తుంది ..
తొలిఝాము తిమిర హరణం .. సరికొత్త నిర్ణయం..
తిరిగి ఆశ ఉదయిస్తుంది.
హ్మ్మ్.. మరో భావ చిత్రం..
ఇక మీ ప్రశ్నలు..
మొదటిది అందాన్నే చూపింది చెప్పింది. అర్ధాన్ని ఇవ్వలేక పోయింది. తనలోతు చూపలేకపోయింది. అందుకని రెండవది పుట్టింది.
కవిత నిగూఢంగా ఉండనక్కర లేదు. కానీ మరో కోణంలో కవితను చూడడంవల్ల ఎన్నో సత్యాలు అవగతమవుతాయి. కృష్ణ లీలలు తీసుకోండి. గజేంద్ర మోక్షం తీసుకోండి. వాటిని కధగా కూడా చదవొచ్చు. వాటి అంతరార్ధాన్ని పరమార్ధాన్ని విశ్లేషించి తెలుసుకుంటే వచ్చే అనుభూతి వేరు. నా కవితను వాటితో పోలుస్తున్నానను కోకండి. అపచారం. ఉదహరించానంతే.
నేరాసే చచ్చు రాతలకి ఇంతలోతు విశ్లేషణ అవసరమంటారా.. ? లేదేమో... :-)
నా వివరణ మీకు సమంజసమనిపించిందని ఆశిస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.