Thursday, April 2, 2009

నువ్వంటే నాకు అసహ్యం !!


నువ్వు వెచ్చగా నా చెక్కిళ్ళు
నిమిరి నప్పుడు, పెదవుల మీద
తడి ముద్దులు గుప్పించి నపుడు..ఆప్యాయంగా
అక్కున చేర్చిన నెచ్చెలిని గుర్తు చేశావు !
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

నా బాధల్లో పిలవకుండానే
ప్రత్యక్షమయి, గొంతు లోతుల్లో రాగాలు
రేపి, ఉపశమనమిచ్చి మనసు తేలికచేసినప్పుడు
అమ్మ అనురాగ లాలనను గుర్తు చేశావు
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

ఆనందంలోనూ ఆక్రోశంలోనూ..
చీకట్లో నను కౌగిలితించి నీలోకలిపేసి
వెలుగులో నా తోడుంటూ.. ఏకాంతంలోనూ
నాతోనే ఉంటూ.. నా నీడను గుర్తు చేశావు ..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

గుండెలు పగిలి, మనసు విరిగిపోయి
నోరు తడారిన తరుణంలోనూ.. నా మూగ
బాధకు భాష్యం చెపుతూ..
తపించే నాకు ప్రత్యక్షమవుతావు
ఆ పరమాత్మను గుర్తు చేస్తావు..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

సముద్రమంత విశాల హృదయం,
పసిపాపలా నిర్మలమయిన స్థితి,
పుష్పమంత సున్నితమైన స్పర్శ,
అనురాగ మూర్తివి, అందాల రాసివి ..
ఐనా నువ్వంటే నాకు అసహ్యం !!

నువ్వు నాసొంతం. నాదానివి
నన్నెరిగిన దానివి. నా మనో నాదానివి
అంతర్నినాదానివి, భావోన్మాదానివి
నాలోని పూడనగాధానివి
పుష్పించని చెట్టువి,

నా కంటి బొట్టువి !!
నువ్వంటే నాకు అసహ్యం !!
అందుకే తుడిచి తరిమేస్తా..
మింగి మరిచేస్తా..
తిరిగిరావద్దని ప్రార్ధిస్తా..

11 comments:

  1. కన్నీరా ఎందుకే బయటికొస్తావు
    నలుగురిలో నన్ను చులకన చేస్తావు ?

    నేను బైటకి వచ్చి నీ హృదయాన్ని
    తేలిక చేస్తాను నన్నాపకు నేస్తం !

    ReplyDelete
  2. నేడు తరిమిన కన్నీరు
    రేపు ఉప్పెనవచ్చు
    గుండెలోని ముసురు
    కన్నీటితోనే పల్చబడని
    సముంద్రమంతా ఈ కన్నుల్లో
    అలలవడం కన్నా
    ఒక్క బొట్టుతో మండే
    అగ్నిని ఆర్పివేయని!!

    ReplyDelete
  3. నీకు (కన్నీరు) చొరవ ఎక్కువని నాకు తెలుసు
    ఐనా నను పలకరించవద్దు
    నువ్వంటే భయం కాదు
    అసహ్యమని చెప్పలేను
    కాని నలుగురు అడిగితే
    మౌనాన్ని బదులివ్వలేను!!

    ReplyDelete
  4. హిందీ పాత సినిమా పాటని గుర్తుకు తెచ్చారండీ.....
    "ఏ ఆసూ మేరీ దిల్ కి జుభాన్ హై!
    మై హస్స్ దూ తో హస్ దే ఆసు!
    మై రోవ్ తో రో దే ఆసు!"
    (కన్నీరు మన హృదయ భాష,
    మనం నవ్వితే నవ్వుతుంది, మనం ఏడిస్తే ఏడుస్తుంది.)
    చాల బాగారాసారు అంటే రొటీన్ గా ఉన్నా తప్పదు మరి!!!

    ReplyDelete
  5. ఆత్రేయ గారూ, చాలా చాలా బాగుంది. అసహ్యం అసహ్యం అంటూనే అది ఎంత విలువైందో చెప్పారు.
    ఎంత బాధ, కష్టం వచ్చినా గుండె లోని ఆ బాధను కరిగి కన్నీటి బొట్టై జారిపోనివ్వకుండా లోపలే అణచి పెట్టే కొందరు దురదృష్టవంతులకే తెలుస్తుంది అది ఎంత అమూల్యమైనదో

    ReplyDelete
  6. కలుపుగోలు కన్నీరు!

    కంటి చివర నేను ఒంటరిగా నిల్చి
    మనసులోని కడగండ్ల లోతును
    ప్రపంచం కొలవకుండా చేసానే,
    అయినా నేనంటే నీకు అసహ్యమేనా?
    అయినా సరే! నీకు నేనే తోడని నా నమ్మకం.
    అందుకే నీవేమన్న నీ కంటినే నా నివాసం.
    ఏమన్నా అనుకో నా నేస్తం!

    ReplyDelete
  7. అహా ఒక్క బొట్టు ఎన్ని కవితలు పండించిందో.. అద్భుతమయినా స్పందనలు.. కవిత జన్మ ధన్యమయ్యింది.

    పరిమళం గారికీ, వంశీ గారికి రెండు సార్లూ, పద్మార్పిత గారూ ఆప్కో, పిచ్చాబ్బాయి గారూ మీకూ, అశ్వినిశ్రీ గారూ మీకూ, అందరికీ మీ అభిమానానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  8. మంచి ఎత్తుగడ, నడక. బాగుంది.

    ReplyDelete
  9. బాబా గారు బహుకాల దర్శనం. ధన్యవాదాలండి.. అది 'ఎత్తుగడ ' అని పట్టేశారే !! నేనూ అలా అనుకునే.. ముందు అన్నీ పాసిటివ్ విషయాలు రాసి.. సస్పెన్స్లో ముంచి చివరికి తెరతీసే ఉద్దేశ్యం అది. ధన్యవాదాలండి.

    ReplyDelete
  10. ఒహో ఈదారి పట్టారా, నిందాస్తుతి, ద్వేషంలో ప్రేమ కురిపిస్తున్నారు? వాటికీ మన మనసు తేలుసు అందుకే అలా కనుపాపల వెంబడే వుంటాయి. తలిచినా తలవకున్నా సమయానికి వచ్చి అడ్డుపడతాయి. వెళ్తూ మనం నిమ్మళించామో లేమో రూఢిచేసుకునివెళ్తాయి.

    ReplyDelete
  11. బాగాచెప్పారు ఉష గారు. నిజమే చల్లబడ్డామా లేదా అని రూఢిచేసుకునిమరీ జారిపోతాయి. ధన్యవాదాలు.

    ReplyDelete