Monday, October 25, 2010
గతోదయం
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడంలేదు
గతం, ప్రతి రాత్రీ
రెప్పలు చీల్చుకుని
ఉదయిస్తుంది
అన్నీ అస్తమయ మెరుగని
ఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా.
Thursday, October 21, 2010
ఈ ఉదయం
బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
రంగుల ప్రపంచం
ఓ లోయ సరిహద్దుల్లో అంతమయింది
రెండు సూర్యుళ్ళ ఉదయంతో
సగం కాలిన రాత్రి
ముళ్ళ కంప మీద
అలానే కరుగిపోయింది.
చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచి
జారిపోతున్న చీకట్లకు
తనువు చాలించిన తుంపర్లు
తెరలవుతున్నా..
చల్లగా వీచిన తెల్లపదాల తావి
పూల తోటలోకి ..దారి చూపింది.
Sunday, October 17, 2010
వీడ్కోలు
ఆ వీడ్కోలు క్షణంలో
నిర్వీర్యమయిన నీ ముఖం
నన్ను వెంటాడుతూనే ఉంది
ఎంతో అనుకుంటాను
ఏదో చెయ్యాలని
ఎంతైనా చెయ్యాలని
దూరాలు పెరిగే కొద్దీ
ప్రేమలు ఆప్యాయతలు
ఫోను తంత్రులకు
చెక్కు ముక్కలకే
పరిమితమై పోతున్నాయి
నీ ఒళ్ళొతలపెట్టిన తృప్తి
నా తలపై తిరిగిన నీ చేతి వెచ్చదనం
ఏ చెక్కుతో కొనగలను ?
ఒద్దనుకున్న క్షణాల్లో
స్థంబించే కాలం
ఇపుడు చిన్నగా నైనా
కదలదే?
బరువైన శ్వాసలు
అదిరే చుబుకంతో
తడిసిన పరిసరాల వెనక
నీ ముఖమూ..
స్పష్టంగా కనబడదు.
గడిపిన నెల రోజుల ఆనందం
ఈ ఒక్క క్షణం..
బూడిదవుతోంది
కనీసం ఈ క్షణమయినా..
గుండెలు మండుతున్నా..
మాటలు రాకున్నా..
ఊపిరందకున్నా..
ఆగిపోతే బాగుండు.
Tuesday, September 14, 2010
నిశ్శబ్ద పుష్పం
నిశిరాతిరి
మాలిణ్యాలను కరిగిస్తోంది.
వెచ్చని అశక్తత
మంద్రంగా వీస్తోంది.
అసంకల్పితంగా వికసించింది
ఓ నిశ్శబ్ద పుష్పం
గంధరహిత పుప్పొళ్ళను
గుండెలనిండా పులుముతూ
తనువునూపుతూ
స్వరరహిత గీతంతో
మనసును తాకుతూ
మూసిన రెప్పల వెనక
కరిగిన కాలం
మిణుగురులవుతుంది
రేపటి ఆశ లేదు
ఈ నిశి రాతిరే శుభోదయం.
Tuesday, August 24, 2010
మబ్బు
ఎప్పటినుంచో..
కాళ్ళు పరిచిన దారి
కంపలు తప్పుకుంటూ
పూదోటలనానుకుంటూ..
ఊచలకు ఇవతల
నిశ్శబ్దం నింపుకున్న
మంచు ప్రమిదల్లో
తడి దీపాల ఆరాటం
ఆ దారి మొదలు కోసం
ఈ లోపే మరో అంకం..
పారే నీటి క్రింద
గులక రాయిలా..
ఆ దారి..
అవిచన్నం, నిశ్చలం
ఈ మబ్బు విడవాలి
Tuesday, August 17, 2010
మరోప్రశ్న
తెరలు తెరలుగా
అవే ప్రశ్నలు.. అలలవుతూ
మనిద్దరి మధ్య
నన్ను శోధిస్తాను
నిన్ను ప్రశ్నిస్తాను
తెలుసుకునే లోపే
మరోప్రశ్న ..
తెలుసనుకున్న దాన్ని
తిరిగి ప్రశ్నిస్తూ..
వృత్తంలా పరిచుంచిన
పట్టాల మధ్య, ఇది,
ముడులు విప్పుకుంటూ..
గుంటలు పూడ్చుకుంటూ..
పరుగనిపిస్తుంది ..
మనమధ్య దూరమిక
లేదనిపిస్తుంది.
ఈలోపల
నీ అస్థిత్వాన్నీ,
నా విశ్వాసాన్ని
ప్రశ్నిస్తూ.. మరో నెర్ర.
అతుకుల చక్రం సాగుతుంది
మరో అతుకుని ఆహ్వానిస్తూ..
మరో గుంటకు చోటు చేస్తూ..
Monday, August 9, 2010
మైనపు రెక్కలు
గమ్యం ఎక్కడో శిఖరాలమీద
ఉద్భవిస్తుంది,
పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగా
పెదవి విరుస్తూ..
సామూహిక నిస్సహాయతకు
సాక్ష్యమన్నట్టు
వికటాట్టహాసం చేస్తూ..
వాడి ప్రశ్నల వాలుమీద
ఆత్మావలోకనమే ప్రయాణం..
ఆ నవ్వులు ముల్లుకర్రలు
ప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ..
ప్రత్యామ్నాయం దొరికేలోపే
మైనపు రెక్కలు కరిగి
ఆత్మ విమర్శై పలుకరిస్తుంది.
ఈ చిత్రం www.thecreativecreative.com నుండి తీసుకొనబడినది.
http://poddu.net/?p=4942 లోకుఉడా కూడగలరు.
loosely based on http://musingsbytrinath.blogspot.com/2010/02/frivolity.html
Tuesday, July 20, 2010
కవిత
తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే..
ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ.. కరిగిపోతూ ..
అలజడిచేస్తూ..
అక్షరాల జల్లు
నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?
పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.
తడుపుదామనో
కలిసి తరిద్దామనో..
గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది.
picture by Jean-Sébastien Monzan
పొద్దు లో ప్రచురించబడినది http://poddu.net/?p=4829
Tuesday, July 13, 2010
ప్రకృతి
ఆకు నీడన చేరిన పువ్వు
గాలి తట్టినప్పుడల్లా
తెరిపె కోసం తొంగిచూస్తూ..
నేల కురిసిన వాన
హత్తుకునే అడ్డులు...
నింపుకున్న గుంటలు..
నవ్వులు చిందిస్తూ..
నింగిలోని చుక్కలన్నీ
మెల్లగా..
గరిక కొనలమీదుగా
ఉదయిస్తూ..
ప్రతికిరణమూ
రంగులద్దుతూ..
మనసునద్దం పడుతూ..
ప్రకృతి.
పొద్దులో చూడండి http://poddu.net/?p=4833
Wednesday, July 7, 2010
నోటు
నగ్నంగా నిలబడ్డా..
నిలువెత్తు సత్యాన్ని,
కనుమరుగు చేస్తుంది.
కనబడ్డా కాదేమోనన్న
సందేహన్ని కొనిపెడుతుంది.
ఎంత పెద్ద నిజాన్నయినా..
గొంతులోతుల్లోనే సమాధి చేస్తుంది.
నోటు,
ఓ చిత్రానికి తగిలించిన పటంలాంటిది
నిజాన్ని, గోడకు బంధించి
అందనంత ఎత్తులో..
అందంగా చూపిస్తుంది
ఏ వేలిముద్రలు అంటకుండా
ఆదుకుంటుంది.
త్రినాధ్ గారి కవిత నుండి ప్రేరణతో
http://musingsbytrinath.blogspot.com/2010/07/seeing.html
Tuesday, June 29, 2010
నెమలి కన్ను
జీవం లేనిదే ఐనా
పాత పుస్తకం పేజీల మధ్య
ప్రత్యక్షం అయినపుడల్లా
ఓ కధ చెపుతుంది ..
చూపుగాలాలు శూన్యంలో
దేవులాడుతూ మిగిలిపోతాయి
పరిసరాలు ఒక్కసారిగా
పారదర్శకమయిపోతాయి
ఇంతలో ఏదో శబ్దం
ఘనీభవించిన గడియారం
ఒక్క ఉదుటున పరుగెడుతుంది.
అసంతృప్తిగా కధ ఆగిపోతుంది.
కధ అంతం తెలిసినా..
ఎందుకో
ఆ పుస్తకం తెరవాలనిపిస్తుంది
మళ్ళీ ఆ కధ వినాలనిపిస్తుంది.
Tuesday, June 22, 2010
పొగ మంచు.
దగ్గరయ్యేకొద్దీ
దారి చూపిస్తూ ..
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ..
మురిపిస్తూ..
తేమతగిలిస్తూ..
కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ..
ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..
తాత మాటలు తవ్వి తీస్తూ..
పొద్దులో ప్రచురించపబడినది. http://poddu.net/?p=4744
దారి చూపిస్తూ ..
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ..
మురిపిస్తూ..
తేమతగిలిస్తూ..
కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ..
ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..
తాత మాటలు తవ్వి తీస్తూ..
పొద్దులో ప్రచురించపబడినది. http://poddu.net/?p=4744
Tuesday, April 27, 2010
అయిష్టంగా...
పలచ బడ్డ ప్రస్తుతం మీద
వయసునూ అలసటనూ అరగదీస్తూ
బాల్యాన్ని చేరుకున్నాను
పరిసరాలను కమ్మిన
సొంత ఊరు, చిన్నతనపు
కేరింతల మధ్య
నెరిసిన రెప్పకట్టలు తెగి
కళ్ళనుండి పొంగిన పాత కబుర్లు
కాలాన్ని కరిగించి
గెలిచామంటూ గేలి చేశాయి
అయినా.. అయిష్టంగా..
గుండెనిండిన తృప్తి
కడుపు నిండిన జ్ఞాపకంతో
వాస్తవంలోకి తిరుగు ప్రయాణం
Thursday, April 22, 2010
వాన
ఒకటే వాన
బరువుతగ్గిన ఆకాశం
చినుకుల మధ్యగా
ఆటలాడుతూ చిరుగాలి
గుప్పుమంటూ
గుంటలు నింపుకున్న నేల
తలదాచుకునే ఆరాటంలో
పడుచుదనం పట్టించుకోని పాఠం..
పల్లానికి పరుగెట్టి..
చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ..
తాత చేతిపై జ్ఞాపకమవుతూ..
చూరుక్రిందా తడిసిన తలల
తలపుల్లో గుబులు ఒలకపోస్తూ..
ఒకటే వాన.
Wednesday, February 17, 2010
తృప్తి
తడి మెరుపులుల్లో
కరిగిన చూపులు ..
ఉరుము ధ్వనుల్లో
మమైకమైన మౌనం ..
జడివాన జల్లుల్లో..
జోరు గాలుల్లో..
వాడిన రెక్కమందారాలు
ఎర్రబారిన చందమామను
ఎదలోతుల్లో గుచ్చేసరికి
ఏడడుగులు నడిచిన తృప్తి
వెచ్చగా తాకింది.
గుండెలపైన మరో రాత్రి
బద్ధకంగా అస్తమించింది.
Tuesday, February 9, 2010
జ్ఞాపకాల గుబాళింపు..
నిద్ర జార్చుకున్న నింగి మధ్య
విరగ పూసిన కలువ
ఆపై వేచిన తుమ్మెద పలకరింపు..
కంటి కొలకులు చూసిన
ముత్యాల పలవరింపు..
అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..
ఒడిలిన తెరల వెనకగా
ఎగబ్రాకిన వేకువ కిరణం..
వెచ్చగా ఒళ్ళిరిచుకున్న
జ్ఞాపకాల గుబాళింపు..
Wednesday, February 3, 2010
మనసు మూగబోతున్నా...
గుండె గదిలో బందీని చేసి
గురుతుకొచ్చిన ప్రతిసారీ
తలుపు తడుతున్నావు ...
కంటి రెప్పల్లో ఖైదు చేసి
అలసి సోలిన ప్రతిసారీ
అలజడి చేస్తున్నావు...
మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..
మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..
తలనెత్తి నీకు దూరమవలేక
ఒదిగి చెంతన చేరినపుడల్లా..
నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..
పొంగు ప్రేమను పంచ
చేజాచినపుడల్లా..
ఓడిపోయానంటు మోకరిల్లుతావు..
అగాధాల అంచు కాక
మరి ఇదేమి నేస్తం?
పరిమళం గారు రాసిన "మనసు మూగబోతున్నా " కవితలు నా స్పందన.
http://anu-parimalam.blogspot.com/2010/02/blog-post.html
Tuesday, January 19, 2010
మౌనం
పురిటినొప్పుల్లా తెరలు తెరలుగా
తడిమిన తరుణాలు
మౌనాన్ని ప్రసవించి మరలి పోతాయి
జ్ఞాపకాలు ఆలపించిన గీతాలు
ఎండురెప్పల మధ్య
నిశ్శబ్దంగా దొరిలి పోతాయి
సెలయేటి గలగలలు
ఘనీభవించి గొంతు లోతుల్లో
పదాలు వెదుకుతూ ఉండిపోతాయి
భాష జార్చుకున్న
బరువు భావపు ప్రతి కదలికా
ఏ రంగూ తగలని కవితే..
ఈ కవితా సాగరంలో తేలుతూ నేనూ...
Subscribe to:
Posts (Atom)