Friday, August 28, 2009

సెలవు

నేను మనదేశానికి (గుంటూరు) వెళుతున్న కారణంగా ఒక నలభైరోజుల పాటు నా బ్లాగుకు సెలవలు ప్రకటించడమయినది.

మరిన్ని కవితలతో మీముందుకు అక్టోబరు నెలలో తిరిగి వస్తాను.

అప్పటివరకు సెలవు.

Wednesday, August 26, 2009

పిలుపు


చెరిగిన బొట్టునెవరో
తిరిగి దిద్దినట్టనిపించింది

గుడిలో గంట
మరల మ్రోగినట్టనిపించింది

మెలికలు తిరిగిన నడక
అదిరి ఆగి నిలిచిన లేడి
నిలకడగా.. కదిలినట్టనిపించింది

రెప్ప తెంచుకుని
మనసు భారాన్ని మోసుకుంటూ..
తలుపులు బిగిసిన గమ్యానికి
తలను మూర్కుని తనువు చాలించినే
చూపులు.. ఈసారి పూసినట్టనిపించింది.

నీ పిలుపుతో.. చెలీ..
శవం బ్రతికినట్టనిపించింది..
శిల కరిగినట్టనిపించింది.

Tuesday, August 25, 2009

ఏకాంతం




నీడనూ వదిలి
చీకట్లో.. ఒంటరిగా..
నిండిన దొప్పలతో..
నేనూ..

నిశ్శబ్దంలో..
మిణుగురులనేరుకుంటూ..
అలసి కీచురాళ్ళయిన
నా ఆలోచనలూ..

బరువెక్కిన రెప్పల మధ్య,
నిశిరాతిరిలో నిశ్శబ్దంగా..
బందీలయ్యాము..

మెలకువొచ్చేసరికి
రంగులద్దుకున్న రాత్రి
నీడతోడిచ్చి ..
బండ మెడనగట్టి
దారి నడవమంది.

కలవని చూపులు


చూపులు కలిసే లోపే
తెరలు దిగిపోతాయి..
వంతెనలు కరిగి పోతాయి..
ఊసులు వెనుతిరిగి వస్తాయి..

మరో ప్రయత్నం
మరింత బలంగా..
అసంకల్పితంగా..
మొదలవుతుంది..
తీరం చేరే అలల్లా..

ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?

తలలు తిప్పుకున్న ప్రతిసారీ
గుండెలు పిండే అనుభూతి..
నన్ను చూస్తున్నావన్న
అదో తృప్తి.

అదే ఇంధనంగా..
మళ్ళీ రెప్పలు లేస్తాయి
తిరుగుతున్న తలనాపడానికో ..
జారుతున్న రెప్పలనడగడానికో ..

జారిపోయిన అల..
మరో సారి తీరం వైపు ఎగురుతుంది.
తిరిగి మరలడానికి.

Monday, August 24, 2009

ఉదయం




నిశ్శబ్దపు అంచులమీదకు
జారిన నిప్పు కణికలు
ఆవిరై అలుపు రేపాయి !

రెప్ప బరువు లేపలేని ఆద
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!

తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..

అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.


published in poddu.net (http://poddu.net/?p=3220)

Tuesday, August 11, 2009

గొడుగు



వానలెన్ని చూసిందో
ఎన్ని ఎండల కాగిందో
బలహీన మయిన బొమికలతో
బేలగా చూస్తుంది..

కానీ ఆ ముఖం మీద
రంగు పూలు మాత్రం
పొడుచుకున్న పచ్చలా
శాశ్వతంగా పలుకరిస్తున్నాయి

కరుకు కాలం
ఎన్ని కరిగించలేదు ?
చిరుగాలి కూడా.. ఇప్పుడు
తనని కృంగదీస్తుంది..
కణుపులిరిగిన చేతిలా
వ్రేలాడ దీస్తుంది.

ఈ వానలో.. మట్టి ముద్దగా
మిగిలిన నేను..
తలదాచుకోవాలనే ఈ పరుగు..

తనతల నేను దాచుకోవడానికో.. ?
నా తల తనలో దాచుకోవడానికో.. ?
పారుతున్న కాలమే సాక్షి !!


త్రినాధ్‌ గారు తన బ్లాగులో రాసిన ribs అన్న కవితను నాకనుగుణంగా మలచి రాసినది. ఆ కవితను ఇక్కడ చూడండి.
http://musingsbytrinath.blogspot.com/2009/07/ribs.html

Monday, August 10, 2009

ఎదురు జల్లు...


అప్పటిదాకా ఎక్కడున్నాయో
నువ్వు మలుపు తిరిగేసరికి
ఊడిపడ్డాయి.. వెచ్చగా..
-*-

చూసినంత సేపూ రాని నువ్వు
అటు తిరిగేసరికి ప్రత్యక్షం..
తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని.
-*-

కిటికీ లోనుంచి నీకోసం చూస్తూ
అందరూ నీలానే కనిపిస్తారు
దగ్గరకొచ్చేదాకా..
-*-

ఆరుబయట నేను..
గోడమీద కాలానికి
కీ ఇవ్వడం మరిచానేమో..
-*-

ఎంత చూసినా...
అక్కడి వరకే.. ఈ చూపులు..
మలుపు తిరిగితే బాగుణ్ణు.
-*-

ప్రతి శబ్దంలో
అడుగుల అలికిడి వెదకలేక
చెవులూ అలుస్తున్నాయి..
-*-

చెవులకి చేరిన చేతి డొప్ప..
శ్వాసనాపి ..ఆకుల అలజడిని
ఆపోశన పడుతోంది.

Sunday, August 9, 2009

పయనం...



కారడవి నడుమ, శిధిలాల మధ్యగా
మట్టి దారి ! ఏకాంతం తోడుగా..
కాలం కాగడా వెలుతురులో..
సాగిపోతోంది....

గతవైభవాల మట్టి దులుపుకుంటూ..
చింత చెట్ల నీడల్లోంచి..చిత్తడి నేలల్లోంచి
మలుపులు తిరిగి తిరిగి
అలసిన ముఖాన్ని తుడుచుకుంటూ...

వీడిపోతున్న కాలి బాటలు
మిగిల్చిన వైరాగ్యాన్ని
మైలు రాళ్ళలో దాచుకుంటూ..

స్థిరంగా.. అస్థిర గమ్యం వైపు.
ఆశ వేగంతో.. అనంత దూరాలకు
ఆగని.. నిరంతర.. పయనం...

Thursday, August 6, 2009

అంతా మిధ్య..


వయసు కేంద్రం..
భవిత ఇంధనం...
జ్ఞాపకాల తరుగు..
ఆశల వాలు..
బంధాల మోత..
అనుభవపు మిగులు..
బాధ కుదుపులు..
విధి పధం..
బ్రతుకు చక్రం..
పయనం !

జారిపోతూ.. ప్రస్తుతం
దృశ్యమాత్రంగా..
ఏది స్థిరం ?

మరి నా పయనమెక్కడికి ?
దేనికోసం ?

అన్నీ
కరిగిపోయేవే.. మిగిలిపోయేవే..
కదిలిపోయేవే.. నిలిచి పోయేవే ..
అంతా మిధ్య..

Tuesday, August 4, 2009

నేనెవరు ?


పగులుతున్న గుండెను
పెదిమల్లో చూపే సరికి
నవ్వను కున్నారు..
ముక్కలేరుకుంటూ మిగిలిపోయాను.

రగులుతున్న మంటల్ని
పంటి బిగువున కట్టేస్తే
మొహమాటమనుకున్నారు..
మౌనంగానే మరలిపోయాను.

శతకోటి కోణాల
సజీవ శిల్పాన్ని నేను
తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నారు...
చేతికంటిన తడిని తుడుచుకెళుతున్నారు..

నా లోతులు తవ్వి
పోసిన నీటి గుట్టలూ..
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..

అద్దం మీద ఊదిన ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
ఇక నా పరిచయమెవరినడగను ?

Monday, August 3, 2009

నీడ


ఎన్నాళ్ళగానో
నన్ననుసరించిన నా నీడ ...
తనకూ రంగులు కావాలనడిగింది.

కలన తప్ప రంగెరుగని నేను,
కన్న ప్రతికలనుండీ,
తను కోరిన రంగులు
రంగరిస్తూ వచ్చాను..

చాలలేదనుకుంటాను..
వెలుగు కలిసిన ప్రతి క్షణం..
అర్ధిస్తూ నిలబడుతుంది.

విధిలేక కలలూ..
నా రెప్పలు చీల్చుకుని
కాంతి తీగెలు వెదుక్కుంటున్నాయి.

వివర్ణ ప్రవాహంలో
ఎదురీదుతూ..
అలసిన గురివింద కళ్ళు..
తమ ఎరుపు మరిచి నట్టున్నాయి.